షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము
- ఉపకరణాలు:
ఆ విద్యాధరభర్త గాంచె హరనీహా రామృతాహాసమున్
శ్రీవిభ్రాజితమున్ నిరస్త గిరిజా సేవాగతాయాసమున్
దేవానీక వికాసమున్ శుభమహాదేవాంఘ్రి సంవాసమున్
భూవిఖ్యాత విలాసముం ద్రిభువనీ పూతంబుఁ గైలాసమున్.
టీకా:
ఆ = ఆ; విద్యాధర = విద్యాధరుల; భర్త = నాయకుడు; కాంచెన్ = చూచెను; హర = పరమశివుని; నీహార = మంచువంటి; అమృతా = అమృతమువంటి; హాసమున్ = చిరునవ్వులు గలది; శ్రీ = శుభకరమైన; విభ్రాజితమున్ = మిక్కిలి ప్రకాశించుతున్నది; నిరస్త = పోగొట్టబడిన; గిరిజా = పార్వతీదేవి; సేవా = సేవ చేయుట వలన; ఆగత = వచ్చిన; ఆయాసమున్ = ప్రయాసలు గలది; దేవ = దేవతలు; అనీక = సర్వులకు; వికాసమున్ = వికాసము నిచ్చునది; శుభ = శుభమైన; మహాదేవ = పరమశివుని; అంఘ్రి = పాదముల; సంవాసమున్ = చక్కటి నివాసము; భూ = భూలోక మంతను వ్యాపించిన; విఖ్యాత = యశస్సు యొక్క; విలాసమున్ = శోభ గలది; త్రిభువనీ = ముల్లోకములను; పూతంబున్ = పవిత్రము చేసెడిది అగు; కైలాసమున్ = కైలాసపర్వతమును.
భావము:
ఆ విద్యాధర చక్తవర్తి అక్కడ కైలాస పర్వతాన్ని చూశాడు. అది శివుని వలె, మంచు వలె, అమృతం వలె తెల్లగా శోభిస్తున్నది. సిరి సంపదలతో విరాజిల్లుతున్నది. పార్వతీ దేవిని సేవించడానికి వచ్చిన భక్తుల శ్రమను తొలగిస్తున్నది. దేవతలకు వికాసాన్ని సమకూరుస్తున్నది. మహాశివుని పాద స్పర్శచే పునీతమైనది. విశ్వవిఖ్యాతి గన్నది. లోకాలను పవిత్రం చేస్తున్నది.