షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము
- ఉపకరణాలు:
అరయ బ్రహ్మాదు లెవ్వని ననునయించి
భక్తియుక్తుల మనమునఁ బ్రస్తుతింతు?
రవని యెవ్వని తలమీఁద నావగింజఁ
బోలు? నా వేయుశిరముల భోగిఁ గొల్తు."
టీకా:
అరయ = కోరి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలగువారు; ఎవ్వని = ఎవనిని; అనునయించి = స్తుతించి; భక్తి = భక్తి యనెడి; యుక్తులన్ = ఉపాయములచేత; మనమునన్ = మనసులో; ప్రస్తుతింతురు = కీర్తించెదరు; అవనిన్ = భూమిపైన; ఎవ్వని = ఎవని యొక్క; తల = శిరస్సు; మీద = పైన; ఆవగింజన్ = ఆవగింజ; పోలున్ = వలెనుండునో; ఆ = ఆ; వేయుశిరములభోగిన్ = ఆదిశేషుని {వేయు శిరముల భోగి - వేయు (వెయ్యి (1,000)) శిరముల (తలల) భోగి (పడగల వాడు, దేహము కల వాజు, భోగించువాడు), ఆదిశేషుడు}; కొల్తు = కొలచెదను.
భావము:
బ్రహ్మాది దేవతలు వినయ వినమ్రులై ఎవరిని ఆశ్రయించి భక్తితో స్తోత్రం చేస్తారో, ఈ సమస్త భూమండలం ఎవరి శిరస్సు మీద ఆవగింజ వలె ఉంటుందో అటువంటి వేయిపడగల మహా భోగివైన నిన్ను సేవిస్తాను”