షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము
- ఉపకరణాలు:
మఱియు, నొక్కచోట విషయతృష్ణాపరులైన నరపశువులు పరతత్త్వంబవైన నిన్ను మాని యైశ్వర్యకాములై తక్కిన దేవతల భజియింపుదురు; వారిచ్చు సంపదలు రాజకులంబునుంబోలె వారలంగూడి నాశంబునం బొందుచుండు; విషయకామములేని నిన్ను సేవించినవారు వేఁచిన విత్తనంబునుంబోలె దేహాంతరోత్పత్తి నొందకుండుదురు; నిర్గుణుండవై జ్ఞానవిజ్ఞాన రూపంబు నొందియున్న నిన్ను గుణసమేతునింగా జ్ఞానులు భావింపుదురు; నీ భజనం బే రూపున నయిన మోక్షంబు ప్రసాదించు; జితమతివైన నీవు భాగవత ధర్మం బే ప్రకారంబున నిర్ణయించితి; వా ప్రకారంబున సర్వోత్కృష్టుండ వైన నిన్ను సనత్కుమారాదులు మోక్షంబు కొఱకు సేవించుచున్నా; రీ భాగవత ధర్మంబునందు జ్ఞానహీనుం డొక్కండును లేఁ; డన్య కామ్యధర్మంబులందు విషమబుద్ధిచేత నేను నీవు నాకు నీకు నని వచియించుచున్నవాఁ డధర్మనిరతుండై క్షయించుచుండు; స్థావర జంగమ ప్రాణిసమూహంబునందు సమంబైన భాగవతధర్మంబుల వర్తించుచున్న మనుజునికి భవద్దర్శనంబువలనఁ బాపంబు క్షయించుట యేమి చిత్రం; బిపుడు భవత్పాదావలోకనంబున నిరస్తాశుండ నైతి; మూఢుండ నయిన నాకుఁ బూర్వ కాలంబున నారదుం డనుగ్రహించి, భగవద్ధర్మంబు దయచేసె; నది నేఁడు నాకు వరదుండ వయిన నీ కతంబున దృష్టంబయ్యె; ఖద్యోతంబులచేత సూర్యుండు గోచరుండు గానిమాడ్కి జగదాత్మకుండవయిన నీ మహత్త్వంబు మనుజులచేత నాచరింపబడి ప్రసిద్ధంబైనది గాదు; అం దుత్పత్తి స్థితి లయ కారణుండవై భగవంతుండ వైన నీకు నమస్కరించెద; నని మఱియును.
టీకా:
మఱియున్ = ఇంకను; ఒక్కచోటన్ = ఒక్కొక్కచోట; విషయ = విషయము లందలి; తృష్ణ = లాలస యందు; పరులు = లగ్నమైనవారు; ఐన = అయిన; నరపశువులు = నరరూప జంతువులు; పరతత్త్వంబవు = పరతత్త్వ మైనవాడవు; ఐన = అయిన; నిన్ను = నిన్ను; మాని = వదలి; ఐశ్వర్య = ఐశ్వర్యములను; కాములు = కోరువారు; ఐ = అయ్యి; తక్కిన = ఇతర; దేవతలన్ = దేవతలను; భజియింపుదురు = పూజించెదరు; వారు = వారు; ఇచ్చు = ఇచ్చెడి; సంపదలు = సంపదలు; రాజకులంబునున్ = రాజవంశముల; పోలెన్ = వలె; వారలన్ = వారితో; కూడి = కూడి; నాశంబునన్ = నాశనమును; పొందుచుండు = పొందుచుండును; విషయ = విషయము లందు; కామము = ఆపేక్ష; లేని = లేనట్టి; నిన్ను = నిన్ను; సేవించినవారు = కొలిచెడివారు; వేచిన = వేయించిన; విత్తనంబునున్ = విత్తనము; పోలెన్ = వలె; దేహాంతరోత్పత్తిన్ = పునర్జన్మను {దేహాంతరోత్పత్తి - దేహము (శరీరము) అంతర (మరియొక దానిలో) ఉత్పత్తి(పుట్టుట), పునర్జన్మ}; ఒందకుండుదురు = పొందరు; నిర్గుణుండవు = త్రిగుణరహితుడవు; ఐ = అయ్యి; జ్ఞాన = ఆత్మజ్ఞానము యొక్క; విజ్ఞాన = విజ్ఞానమే; రూపంబున్ = స్వరూపము; ఒందియున్న = పొంది యున్నట్టి; నిన్ను = నిన్ను; గుణ = సుగుణములతో; సమేతునింగా = కూడినవానిగా; జ్ఞానులు = బుధులు; భావింపుదురు = భావించెదరు; నీ = నీ యొక్క; భజనంబున్ = సేవ; ఏ = ఏ; రూపునన్ = రూపములోను; అయినన్ = ఐనప్పటికి; మోక్షంబున్ = ముక్తిని; ప్రసాదించు = ఇచ్చును; జితమతివి = మనసును జయించినవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; భాగవత = భాగవతుల యొక్క; ధర్మంబున్ = సిద్ధాంతములను; ఏ = ఏ; ప్రకారంబునన్ = విధముగ; నిర్ణయించితివి = నిర్ణయించినావో; ఆ = ఆ; ప్రకారంబునన్ = విధముగ; సర్వ = అందరికంటెను; ఉత్కృష్టుండవు = మేలుచేసెడి వాడవు; ఐన = అయిన; నిన్ను = నిన్ను; సనత్కుమారాదులు = సనకాదులు {సనత్కుమారాదులు - సనకాదులు, 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు}; మోక్షంబున్ = ముక్తి నొందుట; కొఱకున్ = కోసము; సేవించుచున్నారు = కొలచుచున్నారు; ఈ = ఈ; భాగవత = భాగవతుల యొక్క; ధర్మంబున్ = మార్గము; అందున్ = అందు; జ్ఞాన = ఆత్మజ్ఞానము; హీనుండు = లేనివాడు; ఒక్కండును = ఒకడు కూడ; లేడు = లేడు; అన్య = ఇతరమైన; కామ్యధర్మంబుల్ = కోరికలకైన ధర్మముల; అందున్ = లో; విషమ = సమముగా ప్రసరించని; బుద్ధి = బుద్ధి; చేత = వలన; నేను = నేను; నీవు = నీవు; నా = నా; కున్ = కు; నీ = నీ; కున్ = కు; అని = అని; వచియించుచున్న = పలికెడి; వాడు = వాడు; అధర్మ = అధర్మము నందు; నిరతుండు = నిష్ఠగలవాడు; ఐ = అయ్యి; క్షయించుచుండున్ = నశించుచుండును; స్థావర = చరించలేని; జంగమ = చరించగలిగిన; ప్రాణి = జీవుల; సమూహంబున్ = సమూహముల; అందున్ = ఎడలను; సమంబున్ = సమత్వము గలది; ఐన = అయిన; భాగవత = భాగవతుల యొక్క; ధర్మంబులన్ = మార్గములో; వర్తించుచున్న = నడచెడి; మనుజున్ = మానవున; కిన్ = కి; భవత్ = నీ యొక్క; దర్శనంబు = దర్శించుట; వలనన్ = వలన; పాపంబు = పాపములు; క్షయించుట = నశించుట; ఏమి = ఏమి; చిత్రంబు = విచిత్రము; ఇపుడు = ఇప్పుడు; భవత్ = నీ యొక్క; పాద = పాదములను; అవలోకనంబునన్ = దర్శనమువలన; నిరస్త = తిరస్కరింపబడిన; ఆశుండను = ఆపేక్షలు గలవాడను; ఐతి = అయితిని; మూఢుండను = మూర్ఖుడను; అయిన = ఐన; నా = నా; కున్ = కు; పూర్వకాలంబున = ఇంతకు పూర్వము; నారదుండు = నారదుడు; అనుగ్రహించి = కరుణించి; భగవత్ = భాగవత; ధర్మంబున్ = ధర్మమును; దయచేసెన్ = దయతో ఇచ్చెను; అది = దానిని; నేడు = ఇప్పుడు; నా = నా; కున్ = కు; వరదుండవు = వరముల నిచ్చెడివాడవు; అయిన = అయిన; నీ = నీ; కతంబునన్ = వలన; దృష్టంబు = నిరూపింపబడినది; అయ్యె = అయినది; ఖద్యోతంబులు = మిణుగురుల; చేతన్ = చేత; సూర్యుండు = సూర్యుడు; గోచరుండు = తెలియబడనివాడు; కాని = కానట్టి; మాడ్కిన్ = విధముగనే; జగత్ = భువనమే; ఆత్మకుండవు = తానైనవాడవు; అయిన = ఐన; నీ = నీ యొక్క; మహత్వంబు = గొప్పదనము; మనుజుల = మానవులచేత; ఆచరింపబడి = అనుసరింపబడి; ప్రసిద్ధంబు = ప్రసిద్ధమైనది; కాదు = కాదు; అందున్ = అట్టి; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; కారణుండవు = కారణమైనవాడవు; ఐ = అయ్యి; భగవంతుండవు = భగవంతుడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; నమస్కరించెదన్ = నమస్కరించెదను; అని = అని పలికి; మఱియును = ఇంకను.
భావము:
విషయసుఖాలకు మరిగిన నర పశువులు పరమేశ్వరుడవైన నిన్ను విడిచి ఐశ్వర్య వాంఛతో ఇతర దైవాలను ఆరాధిస్తారు. ఆ దేవతలిచ్చే సంపదలు రాజులిచ్చే మడి మాన్యాల వంటివి. మడిమాన్యాలు ఆ రాజులతోపాటు నశించిపోయే విధంగా ఆ చిల్లర దేవతలిచ్చే సంపదలు వారితో పాటు నష్టమై పోతాయి. విషయ వాంఛలను విడనాడి నిన్ను ఆరాధించేవారు వేయించిన విత్తనాల వంటివారు. వారికి దేహాంతాలలో మొలకెత్తే ప్రసక్తి ఉండనే ఉండదు. నిర్గుణుడవై కూడా జ్ఞాన విజ్ఞాన రూపాలతో విరాజిల్లే నిన్ను జ్ఞానవంతులైనవారు గుణవంతునిగానే భావిస్తారు. ఏ విధంగా ఆచరించినప్పటికీ నీ సేవ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నీవు నిర్ణయించిన భాగవత ధర్మానుసారంగా సనత్కుమారుడు మొదలైన మహానుభావులు మోక్షాన్ని కాంక్షించి సర్వేశ్వరుడవైన నిన్ను సంసేవిస్తారు. భాగవత ధర్మాన్ని అవలంబించిన మహానుభావు లందరూ జ్ఞానవంతులే. వారిలో జ్ఞానహీనుడంటూ ఉండడు. మనసులోని కోరికలను తీర్చుకోవాలనే తహతహతో కామ్యకర్మల వెంట పరుగెత్తుతూ ‘నేను నీవు నాకు నీకు’ అనే విషమ బుద్ధి కలవాడు అధర్మపరుడై అధోగతి పాలవుతాడు. చరాచరాలైన సమస్త జీవులయందు సమదృష్టి కలిగి భాగవత ధర్మానుసారం సర్వత్ర భగవంతుణ్ణి సందర్శించే వానికి పాపం పరిహారం కావటంలో ఆశ్చర్య మేముంది? ఇప్పుడు భగవంతుడవైన నీ పాద సందర్శనం వల్ల నాలోని దోషాలన్నీ పూర్తిగా నశించాయి. మందబుద్ధినైన నన్ను నారద మహర్షి అనుగ్రహించి భాగవత ధర్మాన్ని నాకు ఉపదేశించాడు. అందువల్ల ఇప్పుడు భగవంతుణ్ణి దర్శింపగలిగాను. మిణుగురు పురుగులకు సూర్యుడు గోచరించనట్లు సామాన్య మానవులకు జగదంతర్యామివైన నీ మహత్త్వం గోచరించదు. సృష్టిస్థితిలయాలకు హేతుభూతుడవై భగవంతుడవైన నీకు నమస్కరిస్తున్నాను” అని చెప్పి ఇంకా (ఇలా అన్నాడు).