షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము
- ఉపకరణాలు:
నీ విభవంబు లీ జగము నిండుట యుండుట నాశ మొందుటల్
నీ విమలాంశజాతములు నెమ్మి జగంబు సృజించువార, లో
దేవ! భవద్గుణాంబుధుల తీరముఁ గానక యీశ! బుద్ధితో
వావిరిఁ జర్చ చేయుదురు వారికి వారలు దొడ్డవారలై.
టీకా:
నీ = నీ యొక్క; విభవంబులు = వైభవములే; ఈ = ఈ; జగము = జగత్తు; నిండుట = సృష్టిచేత నిండుట; యుండుట = స్థితి; నాశమున్ = లయము; ఒందుటల్ = పొందుటలు; నీ = నీ యొక్క; విమల = నిర్మలమైన; అంశ = అంశచేత; జాతములు = పుట్టినవి; నెమ్మి = కుతూహలముతో; జగంబు = జగత్తు; సృజించు = సృష్టించెడి; వారలు = వారు; ఓ = ఓ; దేవ = భగవంతుడ; భవత్ = నీ యొక్క; గుణ = సుగుణముల; అంబుధుల = సముద్రముల; తీరమున్ = హద్దును; కానక = చూడలేక; ఈశ = భగవంతుడ; బుద్ధి = బుద్ధి; తోన్ = తోటి; వావిరిన్ = అత్యధికముగ; చర్చన్ = చర్చించుట; చేయుదురు = చేసెదరు; వారి = వారి; కిన్ = కి; వారలు = వారు; దొడ్డవారలు = గొప్పవారు; ఐ = అయ్యి.
భావము:
దేవా! ఈ లోకాలు పుట్టడం, పెరగడం, నశించడం అనేవి నీ లీలా విలాసాలు మాత్రమే. లోక కర్తలైనవారు నిర్మలమైన నీ అంశంవల్ల జనించినవారే. వీరందరూ నీ గుణ సముద్రంలో మునిగి తేలుతూ తీరాలు చేరలేక తమకు తామే ప్రభువులమనే భావంతో వాదులాడుకుంటూ ఉంటారు.