షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము
- ఉపకరణాలు:
"అజితుఁడవై భక్తులచే
విజితుం డైనాఁడ విపుడు వేడుక వారున్
విజితులు నీచేఁ గోర్కులు
భజియింపనివారు నిన్నుఁ బడయుదురె? హరీ!
టీకా:
అజితుడవు = జయింపరానివాడవు; ఐ = అయ్యి; భక్తుల్ = భక్తుల; చేన్ = చేత; విజితుడు = జయింపబడినవాడు; ఐనవాడవు = అయితివి; ఇపుడు = ఇప్పుడు; వేడుకన్ = వేడుకగా; వారున్ = వారుకూడ; విజితులు = జయింపబడిరి; నీ = నీ; చేన్ = వలన; కోర్కులు = కోరి; భజియింపని = కొలువని; వారున్ = వారు; నిన్నున్ = నిన్ను; పడయుదురే = పొందగలరా ఏమి; హరీ = ఆదిశేషుడా.
భావము:
“ఓ ఆదిశేషా! పరులచేత జయింప శక్యం కాని వాడవైన నీవు భక్తులచేత ఇప్పుడు జయింప బడినావు. ఆ భక్తులు కూడా నీచేత జయింపబడిన వారై నీకు వశులై వర్తిస్తున్నారు. కోరికలను జయింపలేనివాడు నీ కరుణకు పాత్రుడు కాలేడు.