షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము
- ఉపకరణాలు:
నీ దిక్కు గానివారికి
నే దిక్కును లేదు వెదక యిహపరములకున్
మోదింపఁ దలఁచువారికి
నీ దిక్కే దిక్కు సుమ్ము; నీరజనాభా!
టీకా:
నీ = నీ; దిక్కు = వైపు; కాని = కానట్టి; వారి = వారి; కిన్ = కి; ఏ = ఏ విధమైన; దిక్కును = రక్షణయు; లేదు = లేదు; వెదకన్ = ఎంత వెదికిననూ; ఇహపరముల్ = ఈలోక పైలోక ప్రయోజనముల; కున్ = కు; మోదింపన్ = సంతోషింప; తలచు = కోరెడి; వారి = వారల; కిన్ = కి; నీ = నీ యొక్క; దిక్కే = రక్షణ మాత్రమే; దిక్కు = శరణ్యము; సుమ్ము = సుమా; నీరజనాభా = విష్ణుమూర్తి {నీరజ నాభుడు - నీరజము (పద్మము) నాధుడు (బొడ్డున గలవాడు), విష్ణువు}.
భావము:
ఓ పద్మనాభా! నీ దిక్కు చూచి నీవే దిక్కని మ్రొక్కని వారికి ఈ ప్రపంచంలో ఏ దిక్కూ లేదు. ఇహపరాలలో కూడా వారు దిక్కుమాలినవారే. లోకంలో సురక్షితంగా ఉండి సుఖపడాలనుకొనే వారికి నీ దిక్కే సరైన దిక్కు.