పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-307-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; నఖిల ప్రమాదంబు లైన యభిచార కర్మంబుల వలన నారాయణుండును, గర్వంబు వలన నరుండును, యోగభ్రంశంబువలన యోగనాథుఁ డయిన దత్తాత్రేయుండును, గర్మబంధంబులవలన గణేశుం డైన కపిలుండును, గామదేవునివలన సనత్కుమారుండును, మార్గంబుల దేవహేళనంబు చేయుటవలన శ్రీహయగ్రీవమూర్తి యును, దేవతానమస్కార తిరస్కార దేవపూజా చ్ఛిద్రంబులవలన నారదుండును, నశేష నిరయంబులవలనఁ గూర్మంబును, నపథ్యంబు వలన భగవంతుం డైన ధన్వంతరియును, ద్వంద్వంబువలన నిర్జితాత్ముం డయిన ఋషభుండును, జనాపవాదంబువలన నగ్నిదేవుండును, జనన మరణాదులం గలుగఁ జేయు కర్మంబులవలన బలభద్రుండును, గాలంబువలన యముండును, సర్పగణంబులవలన శేషుండును, నప్రబోధంబువలన ద్వైపాయనుండును, బాషాండ సమూహంబువలన బుద్ధదేవుండును, శనైశ్చరునివలనఁ గల్కియునై, ధర్మరక్షణపరుం డయిన మహావతారుండు నన్ను రక్షించుంగాత; ప్రాత స్సంగమ ప్రాహ్ణ మధ్యాహ్నాపరాహ్ణ సాయంకాలంబులను ప్రదోషార్ధరాత్రాపరాత్ర ప్రత్యూషానుసంధ్యలను గదాద్యాయుధంబుల ధరియించి, కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసంహార, త్రివిక్రమ, వామన, హృషికేశ, పద్మనాభ, శ్రీవత్సధామ, సర్వేశ్వరేశ, జనార్దన, విశ్వేశ్వర, కాలమూర్తు లను నామ రూపంబులు గల దేవుండు నన్ను రక్షించుంగాక; ప్రళయకాలాన లాతితీక్ష్ణ సంభ్రమ భ్రమణ నిర్వక్రవిక్రమ వక్రీకృత దనుజచక్రం బైన సుదర్శన నామ చక్రంబ! మహావాయు ప్రేరితుండై హుతాశనుండు నీరస తృణాటవుల భస్మీభూతంబు చేయు భంగి, భగవత్ప్రయుక్తంబవై మద్వైరి సైన్యంబుల దగ్ధంబు గావింపుము; జగత్సంహారకాల పటు ఘటిత చటుల మహోత్పాత గర్జారవ తర్జన దశదిశాభి వర్జిత ఘనఘనాంతర నిష్ఠ్యూత నిష్ఠురకోటి శతకోటిసం స్పర్శ స్ఫుర ద్విస్ఫులింగ నిర్గమనానర్గళ భుగ భుగాయమాన మూర్తి విస్ఫూర్తి! నారాయణకరకమలవర్తి! గదాయుధోత్తమ! మదీయవైరి దండోపదండంబుల భండనంబునం జండ గతిం బిండిపిండిగాఁ గూశ్మాండ వైనాయక రక్షో భూత గ్రహంబులు చూర్ణంబులుగాఁ గొండొక వినోదంబు సలుపుము; ధరేంద్రంబ వైన పాంచజన్యంబ! సర్వలోక జిష్ణుండైన శ్రీకృష్ణునిఁ నిఖిల పుణ్యైక సదన వదన నిష్ఠ్యూత నిశ్శ్వాసాధర వేణు పూరితంబవై యున్మత్త భూత, ప్రేత, పిశాచ, విప్ర గ్రహాది క్రూర దుర్గ్రహంబులు విద్రావణంబులుగా, నస్మ త్పరవీరమండ లంబుల గుండియలతోఁ దదీయమానినీ దుర్భర గర్భంబులు గర్భస్థార్భక వివర్జితంబులుగా నవియ, బ్రహ్మాండభాండ భీకరంబయిన భూరి నాదంబున మోదింపు; మతి తీవ్రధారా దళిత నిశాతకోటి కఠోర కంఠ కరాళ రక్తధారా ధౌత మలీమస విసరంబవయిన నందక మహాసి శేఖరంబ! జగదీశ ప్రేరితంబవై మద్విద్వేషి విషమ వ్యూహంబుల మెండు ఖండములుగ ఖడించి చెండాడుము; నిష్కళంక నిరాంతక సాంద్ర చంద్రమండల పరిమండిత సర్వాంగ లక్షణ విచక్షణ ధర్మనిరతం బవయిన చర్మంబ! దుర్మద మద్వైరిలోకంబులకు భీకరాలోకంబులను సమాకుల నిబిడ నిరీంద్ర నిష్ఠుర తమః పటల పటు ఘటనంబులం గుటిల పఱుపుము; నిఖిల పాపగ్రహంబుల వలనను సకల నర మృగ సర్ప క్రోడ భూతాదులవలనను నగు భయంబులు పొందకుండ భగవన్నామ రూప యాన దివ్యాస్త్రంబుల రక్షించుం గాక; బృహద్రథంతరాది సామంబులచేత స్తోత్రంబు చేయం బడుచున్న ఖగేంద్రుండు రక్షణ దక్షుండై నన్ను రక్షించుఁగాక; శ్రీహరి నామ రూప వాహన దివ్యాయుధ పారిషదోత్తమ ప్రముఖంబు లస్మదీయ బుద్ధీంద్రియ మనఃప్రాణంబుల సంరక్షించు; భగవంతుండయిన శేషుండు సర్వోపద్రవంబుల నాశంబు చేయు; జగ దైక్యభావంబయిన ధ్యానంబు గలవానికి వికల్పరహితుండై, భూషణాయుధ లింగాఖ్యలగు శక్తులం దన మాయ చేత ధరియించి తేజరిల్లు చుండు లక్ష్మీకాంతుండు వికల్ప విగ్రహంబులవలన నన్ను రక్షించుఁగాక; లోకభయంకరాట్టహాస భాసుర వదనగహ్వరుం డగుచు, సమస్త తేజోహరణ ధురీణ తేజః పుంజ సంజాత దివ్య నృసింహావతారుం డగు నప్పరమేశ్వరుండు సర్వ దిగ్భాగంబు వలన, సమస్త బహిరంతరంబుల వలన నన్ను రక్షించుచుండుఁ గాత" మని నారాయణాత్మక కవచ ప్రభావం బితిహాస రూపంబున నింద్రుండు దెలిసికొని, ధ్యానంబు చేసి, తద్విద్యాధారణ మహిమవలన నరాతుల నిర్జించెం; గావున నెవ్వరేని నిర్మలాత్ము లగు వార లే తద్విద్యా ధారణులై యనుదినంబును బఠియించిన; నతి ఘోర రణంబుల నత్యుత్కట సంకటంబులను, సర్వ గ్రహ నిగ్రహ కర్మ మారణకర్మాది దుష్కర్మ జన్య క్లేశంబులను వదలి, యవ్యాకుల మనస్కులై, విజయంబు నొందుదురు; మఱియును, సర్వ రోగంబులకు నగమ్యశరీరులై సుఖంబు నొందుదు; రదియునుం గాక.

టీకా:

మఱియున్ = ఇంకను; అఖిల = సర్వ; ప్రమాదంబులు = ప్రమాదకరములు; ఐన = అయిన; అభిచారకర్మంబుల = చేతబడుల {అభిచారము - హింసార్థమైన మంత్ర తంత్ర రూపక కర్మము, పంపు, చేతబడి}; వలన = వలన; నారాయణుండును = నారాయణుడు; గర్వంబు = గర్వము; వలన = నుండి; నరుండును = నరుడు; యోగ = యోగాభ్యాసమునుండి; భ్రంశంబు = పతన మగుట; వలన = నుండి; యోగనాథుడు = సకల యోగములకు ప్రభువు; అయిన = ఐన; దత్తాత్రేయుండును = దత్తాత్రేయుడు; కర్మబంధంబుల = కర్మబంధముల; వలన = నుండి; గణేశుండు = గణాధిపతి; ఐన = అయిన; కపిలుండును = కపిలుడు; కామదేవుని = మన్మథుని; వలన = నుండి; సనత్కుమారుండు = సనత్కుమారుడు; మార్గంబులన్ = దారులమ్మట; దేవ = దేవతలను; హేళనంబు = అవమానించుటలు; వలన = నుండి; శ్రీహయగ్రీవమూర్తి = హయగ్రీవుడు; దేవతా = దేవతలను; నమస్కార = నమస్కరించుటను; తిరస్కార = చేయకపోవుట; దేవ = దేవుని; పూజ = పూజలను; ఛిద్రంబుల = లోపముల; వలన = నుండి; నారదుండును = నారదుడు; అశేష = అంతులేని; నిరయంబు = నరకముల; వలన = నుండి; కూర్మంబును = కూర్మావతారుడు; అపథ్యంబు = తినరానిది తినుట; వలన = నుండి; భగవంతుండు = భగవంతుడు; ఐన = అయిన; ధన్వంతరియును = ధన్వంతరి; ద్వంద్వంబు = డోలాయమాన స్థితుల; వలన = నుండి; నిర్జిత = జయింపబడిన; ఆత్ముండు = ఆత్మ గలవాడు; అయిన = ఐన; ఋషభుండును = ఋషభుడు; జన = లోకులచే; అపవాదంబు = నిందల; వలన = నుండి; అగ్నిదేవుండును = అగ్నిదేవుడు; జననమరణాదులు = పునర్జన్మ నొందుట; కలుగజేయు = కలిగించెడి; కర్మంబుల = కార్యముల; వలన = నుండి; బలభద్రుండును = బలభద్రుడు; కాలంబు = కాలప్రభావముల; వలన = నుండి; యముండును = యముడు; సర్ప = పాముల; గణంబుల = సమూహముల; వలన = నుండి; శేషుండును = ఆదిశేషుడు; అప్రబోధంబు = అజ్ఞాన జనితముల; వలన = నుండి; ద్వైపాయనుండును = కృష్ణద్వైపాయనుడు; పాషాండ = వేదవిద్యేతరుల; సమూహంబు = సమూహముల; వలన = నుండి; బుద్ధదేవుండును = బుద్ధదేవుడు; శనైశ్చరుని = శనీశ్వరుని; వలన = నుండి; కల్కియున్ = కల్కి; ఐ = అయ్యి; ధర్మ = ధర్మమును; రక్షణ = రక్షించుట యందు; పరుండు = లగ్నమైనవాడు; అయిన = ఐన; మహావతారుండు = గొప్ప అవతారములు దాల్చెడి వాడు; నన్ను = నన్ను; రక్షించుగాత = రక్షించుగాక; ప్రాతః = ఉదయము {ప్రాత స్సంగమము – పొద్దు పొడుచుటకు ముందు మూడుగడియల కాలము, ఉదయసంధ్య}; సంగమ = పగటి సంధ్యల; ప్రాహ్ణము = లేబగలు {ప్రాహ్ణము - ఉదయము మొదలు పదిగడియలు వరకు గల కాలము, లేబగలు}; మధ్యాహ్న = మధ్యాహ్నము; అపరాహ్ణ = మిట్టమధ్యాహ్నము; సాయంకాలంబులను = సాయంకాలము; ప్రదోష = మునిమాపువేళ; అర్థరాత్రి = అర్థరాత్రి; అపరాత్రి = అపరాత్రి; ప్రత్యూష = ప్రభాతము; అనుసంధ్యలను = ఉదయ సాయం సంధ్య లందు {అనుసంధ్యలు - 1.పొద్దుపొడుచుటకు ముందు మూడుగడియల కాలము (ఉదయ సంధ్య) 2.పొద్దుకుంగిన తరువాత మూడు గడియల కాలము (సాయం సంధ్య)}; గద = గద; ఆది = మొదలగు; ఆయుధంబులు = ఆయుధములను; ధరియించి = ధరించి; కేశవ = కేశవుడు; నారాయణ = నారాయణుడు; గోవింద = గోవిందుడు; విష్ణు = విష్ణువు; మధుసంహార = మధుసంహారుడు; త్రివిక్రమ = త్రివిక్రముడు; వామన = వామనుడు; హృషికేశ = హృషికేశుడు; పద్మనాభ = పద్మనాభుడు; శ్రీవత్సధామ = శ్రీవత్సధాముడు; సర్వేశ్వరేశ = సర్వేశ్వరేశుడు; జనార్దన = జనార్దనుడు; విశ్వేశ్వర = విశ్వేశ్వరుడు; కాలమూర్తులు = కాలమూర్తులు; అను = అనెడి; నామ = పేర్లు; రూపంబులు = రూపములు; కల = కలిగిన; దేవుండు = భగవంతుడు; నన్ను = నన్ను; రక్షించుగాక = కాపాడుగాక; ప్రళయకాల = ప్రళయకాలము నందలి; అనల = అగ్నివలె; అతి = మిక్కిల; తీక్ష్ణ = తీక్షణమైన; సంభ్రమ = అతివేగముగ; భ్రమణ = గిరగిరతిరుగు చున్న; నిర్వక్రమ = ఎదురులేని; విక్రమ = పరాక్రమము గల; వక్రీకృత = వంచబడిన; దనుజ = రాక్షసుల; చక్రంబు = గుంపులు గలది; ఐన = అయిన; సుదర్శన = సుదర్శనము అనెడి {విష్ణుమూర్తి సాధనములు - 1చక్రము (సుదర్శనము) 2గద (కౌముదకి) 3శంఖము (పాంచజన్యము) 4ఖడ్గము (నందకము) 5చర్మము (డాలు) (శతచంద్రము) 6విల్లు (శార్ఙ్గము)}; నామ = పేరు గల; చక్రంబ = (విష్ణు) చక్రమా; మహా = గొప్ప; వాయు = వాయువులచే; ప్రేరితుండు = ప్రేరేపింపబడినవాడు; ఐ = అయ్యి; హుతాశనుండు = అగ్నిదేవుడు; నీరస = బలహీనమైన; తృణ = గడ్డిపరకల; అడవులన్ = అడవులను; భస్మీభూతంబున్ = కాలిపోయినవిగా; చేయు = చేసెడి; భంగిన్ = వలె; భగవత్ = విష్ణుమూర్తిచే; ప్రయుక్తంబవు = ప్రయోగింపబడిన దానవు; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; వైరి = శత్రువుల; సైన్యంబులన్ = సైన్యములను; దగ్ధంబు = కాల్చివేయుట; కావింపుము = చేయుము; జగత్ = భువనముల; సంహార = విలయ; కాల = సమయ మందలి; పటు = తీవ్రముగ; ఘటిత = కలుగజేయబడెడి; చటుల = భయంకరమైన; మహా = గొప్ప; ఉత్పాత = ఆపదల; గర్జ = గర్జించెడి; రవ = శబ్దములతో; తర్జనన్ = బెదిరింపులతో; దశదిశ = పదిదిక్కులను {దశదిశలు - 1తూర్పు 2ఆగ్నేయము 3దక్షిణము 4నైరృతి 5పడమర 6వాయవ్యము 7ఉత్తరము 8ఈశాన్యము 9పైన 10కింద అనెడి 10 దిక్కులు}; అభివర్జిత = మిక్కిలి విడువబడిన; ఘన = గొప్పగొప్ప; ఘన = మేఘముల; అంతర = లోని; నిష్ఠ్యూత = వెడలగ్రక్కబడిన; నిష్ఠుర = కఠినమైన; కోటి = అనేకమైన; శతకోటి = వజ్రాయుధములు; సంస్పర్శ = తగిలినట్లు; స్ఫురత్ = అనిపించెడి; విస్ఫులింగ = అగ్నికణములు; నిర్గమ = వెలువడుటచే; అనర్గళ = ఎడతెగని; భుగభుగాయమాన = భుగభుగ మనెడి; మూర్తి = స్వరూపము యొక్క; విస్ఫూర్తి = ప్రకాశము; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; కర = చేతులు యనెడి; కమల = పద్మము లందు; వర్తి = ప్రవర్తించెడి; గదాయుధ = గదాయుధములలో; ఉత్తమ = ఉత్తమమా; మదీయ = నా యొక్క; వైరి = శత్రువుల; తండ = గుంపులు; ఉపతండంబులన్ = ఉపగుంపులను; భండనంబునన్ = యుద్ధములో; చండ = భయంకరమైన; గతిన్ = విధముగ; పిండిపిండిగాన్ = పిండిపిండిగా నగునట్లు; కూశ్మాండ = కూష్మాండములు {కూశ్మాండములు - పిశాచబేధము, కూష్మాండములు}; వైనాయక = వైనాయక; రక్షః = రాక్షసులు; భూత = భూతములు {భూతములు - పిశాచబేధము}; గ్రహంబులు = గ్రహములు {గ్రహములు - పట్టెడివి, పిశాచబేధము}; చూర్ణంబులు = పిండి; కాన్ = అగునట్లు; కొండొక = ఒక విధమైన; వినోదంబున్ = వినోదమును; సలుపుము = చేయుము; దర = శంఖములలో; ఇంద్రంబవు = శ్రేష్ఠమైనవానివి; ఐన = అయిన; పాంచజన్యంబ = పాంచజన్యమ; సర్వలోకజిష్ణుండు = నారాయణుడు {సర్వ లోక జిష్ణుడు - సర్వ (అఖిలమైన) లోక (భువనములను) జిష్ణుండు (జయించెడి శీలము గలవాడు), విష్ణువు}; ఐన = అయిన; శ్రీకృష్ణుని = శ్రీకృష్ణుని; నిఖిల = సమస్తమైన; పుణ్య = పుణ్యములకు; ఏక = ఏకైక; సదన = నివాసమైన; వదన = ముఖమునుండి; నిష్ఠ్యూత = వెలువడెడి; నిశ్శ్సాస = నిశ్వాసముతో; అధర = పెదవు లనెడి; వేణు = వేణువులచే; పూరితంబవు = ఊదబడెడిదానివి; ఐ = అయ్యి; ఉన్మత్త = వెఱ్రెత్తినట్టి; భూత = భూతములు {భూతములు - పిశాచబేధము}; ప్రేత = ప్రేతములు {ప్రేతములు - పిశాచబేధము}; పిశాచ = పిశాచములు {పిశాచములు - పిశాచబేధము}; విప్రగ్రహ = విప్రగ్రహములు {విప్రగ్రహములు - పిశాచబేధము}; ఆది = మొదలగు; క్రూర = క్రూరమైన; దుర్ = చెడ్డ; గ్రహంబులు = పిశాచములు {గ్రహములు - పట్టెడివి, పిశాచబేధము}; విద్రావణంబుల = పారిపోవునవి; కాన్ = అగునట్లు; అస్మత్ = నా యొక్క; పర = శత్రు; వీర = వీరుల; మండలంబులన్ = సమూహముల; గుండిల = గుండెల; తోన్ = తోపాటు; తదీయ = వారి యొక్క; మానినీ = స్త్రీల; దుర్భర = భరింపరాని; గర్భంబులు = కడుపులు; గర్భస్థ = కడుపులో నుండెడి; అర్భక = పిండములు; వివర్జితంబు = పోవునట్లు; కాన్ = అగునట్లు; అవియన్ = పగులునట్లు; బ్రహ్మాండభాండ = బ్రహ్మాండభాండమునకే {బ్రహ్మాండభాండము - సకల లోకములు కల బ్రహ్మాండాలు తనలో గల అతి పెద్దదైన అండ స్వరూప భాండము}; భీకరంబు = భయంకరమైనది; అయిన = ఐన; భూరి = అతిపెద్ద; నాదంబునన్ = శబ్దమును; మోదింపుము = గట్టిగా చేయుము; అతి = మిక్కిలి; తీవ్ర = తీవ్రమైన; దారా = పదునుచే; దళిత = చీల్చబడిన; నిశాత = రాక్షస; కోటి = సమూహముల; కంఠ = కంఠములనుండి; కరాళ = వెరపు పుట్టించెడి; రక్త = రక్తపు; ధారా = ధారలచే; ధౌత = తడిసి; మలీమస = మాసి; విసరంబవు = వేయబడినదానివి; అయిన = ఐన; నందక = నందకము యనెడి; మహా = గొప్ప; అసి = కత్తులలో; శేఖరంబ = శ్రేష్ఠమైనదానా; జగదీశ = విష్ణుమూర్తిచే; ప్రేరితంబవు = ప్రేరేపింపబడిన దానివి; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; విద్వేష = శత్రువుల; విషమ = కఠినమైన; వ్యూహంబులన్ = సైనికవ్యూహములను; మెండు = అనేకమైన; ఖండములుగ = ముక్కలుగ; ఖండించి = చీల్చి; చెండాడుము = చెండాడుము; నిష్కళంక = మచ్చలేని; నిరాంతక = నాశములేని; సాంద్ర = చిక్కటి; చంద్రమండల = చంద్రబింబములచే; పరిమండిత = చక్కగ యలంకరింపబడిన; సర్వ = అఖిల; అంగ = విభాగముల; లక్షణ = లక్షణములతో; విచక్షణ = విశిష్టతలుగల; ధర్మ = ధర్మబద్ధమైన; నిరతంబవు = శాశ్వతమైనది; అయిన = అయినట్టి; చర్మంబ = కవచమా; దుర్ = చెడ్డ; మద = గర్వము గల; మత్ = నా యొక్క; వైరి = శత్రువుల; లోకంబులు = సమూహముల; కు = కు; భీకర = భయంకరమైన; ఆలోకంబులను = చూపులతో; సమ = మిక్కిలి; ఆకుల = చీకాకు పెట్టెడి; నిబిడ = దట్టమైన; నీరంధ్ర = చిక్కని; నిష్ఠుర = కఠినమైన; తమస్ = చీకటి; పటల = తెరల; పటు = గట్టి; ఘటనంబులన్ = కార్యములచే; కుటిల = వంచి; పఱుపుము = వేయుము; నిఖిల = సమస్తమైన; పాప = చెడ్డ; గ్రహంబులు = పిశాచములు; వలనను = మూలమున; సకల = సమస్తమైన; నర = మానవులు; మృగ = జంతువులు; సర్ప = పాములు; క్రోడ = అడవి పందులు; భూత = భూతములు; ఆదుల = మొలైనవాని; వలనను = మూలమున; అగు = అయిన; భయంబులు = భయములను; పొందకుండ = పొందకుండగ; భగవత్ = భగవంతుని; నామ = నామముల; రూప = రూపములు; యాన = వాహనములు; దివ్య = దివ్యమైన; అస్త్రంబులన్ = అస్త్రములచే; రక్షించుగాక = కాపాడుగాక; బృహత్ = బృహత్తులు; రథాంతర = రథాంతరములు; ఆది = మొదలైన; సామంబుల = సామవేదస్తోత్రముల; చేత = చేత; స్తోత్రంబు = స్తోత్రములు; చేయంబడుచున్న = చేయబడుతున్నట్టి; ఖగేంద్రుండు = గరుత్మంతుడు {ఖగేంద్రుడు - ఖగము (పక్షులలో) ఇంద్రుడు (ఇంద్రుని వంటివాడు), గరుత్మంతుడు}; రక్షణ = కాపాడెడి; దక్షుండు = సమర్థుడు; ఐ = అయ్యి; నన్ను = నన్ను; రక్షించుగాక = కాపాడుగాక; శ్రీహరి = విష్ణుమూర్తి యొక్క; నామ = నామములు; రూప = రూపములు; వాహన = వాహనములు; దివ్య = దివ్యమైన; ఆయుధ = ఆయుధములు; పారిషత్ = సేవకులలో; ఉత్తమ = శ్రేష్టులు; ప్రముఖంబులు = మొదలగు ముఖ్యులు; అస్మదీయ = నా యొక్క; బుద్ధీంద్రియ = మతి సమర్థత గల ఇంద్రియము {బుద్ధి - మతి (దీని లక్షణములు 1శుశ్రూష 2శ్రవణము 3గ్రహణము 4ధారణము 5ఊహము 6అపోహము 7అర్థవిజ్ఞానము 8తత్త్వజ్ఞానము)}; మనస్ = మనస్సు; ప్రాణంబులన్ = ప్రాణములను; సంరక్షించు = కాపాడెడి; భగవంతుండు = భగవంతుడు; అయిన = అయిన; శేషుండు = ఆదిశేషుడు; సర్వ = అఖిలమైన; ఉపద్రవంబులన్ = హానులను; నాశంబు = నాశనము; చేయు = చేసెడి; జగత్ = జగత్తంతటి; ఐక్యభావము = సంలీన బుద్ధితో; ధ్యానంబుగల = ధ్యానము కలిగిన; వాని = వాని; కి = కి; వికల్పరహితుండు = భ్రాతులు లేనివాడు; ఐ = అయ్యి; భూషణ = ఆభరణములు; ఆయుధ = ఆయుధములు; లింగ = సంకేతములు; ఆఖ్యలు = అనబడెడివి; అగు = అయిన; శక్తులన్ = శక్తులను; తన = తన యొక్క; మాయ = మాయ; చేత = వలన; ధరియించి = ధరించి; తేజరిల్లుచుండు = విలసిల్లెడి; లక్ష్మీకాంతుండు = విష్ణుమూర్తి {లక్ష్మీకాంతుడు - లక్ష్మీదేవి యొక్క కాంతుడు (భర్త), విష్ణువు}; వికల్ప = భ్రాంతుల; విగ్రహంబుల = కలహముల; వలన = నుండి; నన్ను = నన్ను; రక్షించుగాక = కాపాడుగాక; లోక = లోకములకు; భయంకర = భయంకరములైన; అట్టహాస = వికట హాసములచే; భాసుర = ప్రకాశించుతున్న; వదన = నోరు యనెడి; గహ్వరుండు = గుహ గలవాడు; అగుచు = అగుచు; సమస్త = సమస్తమైన; తేజస్ = తేజస్సులను; హరణ = నాశనము చేయగల; ధురీణ = మిక్కిలి నేర్పుగల; తేజస్ = తేజస్సుల; పుంజ = సమూహములను; సంజాత = పుట్టిన; దివ్య = దివ్యమైన; నృసింహ = నరసింహ; అవతారుండు = అవతారము దాల్చిన వాడు; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = విష్ణుమూర్తి; సర్వ = అఖిలమైన; దిగ్భాగంబు = దిక్కుల; వలన = వలన; సమస్త = సమస్తమైన; బహిర్ = బయటి; అంతరంగంబుల = లోనివాని; వలన = వలన; నన్ను = నన్ను; రక్షించుచుండుగాతము = కాపాడుగాక; అని = అని; నారాయణ = విష్ణుని; ఆత్మక = స్వరూపమైన; కవచ = కవచము యొక్క; ప్రభావంబు = ప్రభావమును; ఇతిహాస = కథా; రూపంబునన్ = రూపములో; ఇంద్రుండు = ఇంద్రుడు; తెలిసికొని = తెలిసికొని; ధ్యానంబు = ధ్యానము; చేసి = చేసి; తత్ = ఆ; విద్యా = విద్యను; ధారణ = ధరించుట యొక్క; మహిమ = మహాత్యము; వలనన్ = మూలమున; అరాతులన్ = శత్రువులను; నిర్జించె = జయించెను; కావున = అందుచేత; ఎవ్వరేని = ఎవరైనను; నిర్మల = స్వచ్ఛమైన; ఆత్ములు = మనసు గలవారు; అగు = అయిన; వారలు = వారు; ఏతత్ = ఆ యొక్క; విద్య = విద్యను; ధారణులు = ధరించినవారు; ఐ = అయ్యి; అనుదినంబును = ప్రతిదినము; పఠియించినన్ = చదివినచో; అతి = మిక్కిలి; ఘోర = భయంకరమైన; రణంబులన్ = యుద్దములను; అతి = మిక్కిలి; ఉత్కట = తట్టుకొనలేని; సంకటంబులను = బాధలను; సర్వ = అఖిలమైన; గ్రహ = పట్టిపీడించెడివి; నిగ్రహకర్మ = అడ్డుకొనెడివి యైన హోమములు; మారణకర్మ = మరణ కారక మగు హోమములు; ఆది = మొదలగు; దుష్కర్మ = చెడు ప్రయోగముల; జన్య = కలిగెడి; క్లేశంబులు = చీకాకులు; వదలి = వదిలిపోయి; అవ్యాకుల = చీకాకులులేని; మనస్కులు = మనసులు గలవారు; ఐ = అయ్యి; విజయంబు = విజయములను; ఒందుదురు = పొందుదురు; మఱియును = ఇంకను; సర్వ = సమస్తమైన; రోగంబుల = జబ్బుల; కున్ = కును; అగమ్య = చేరని; శరీరులు = దేహములు గలవారు; ఐ = అయ్యి; సుఖంబున్ = సౌఖ్యములను; ఒందుదురు = పొందెదరు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

ఇంకా అన్ని ప్రమాదాలకు కారణాలైన అభిచార ప్రయోగాలనుండి నారాయణుడు నన్ను రక్షించునుగాక! గర్వపడడం నుండి నరుడు రక్షించునుగాక! యోగాభ్యాసం నుండి పతనం కాకుండా యోగాలకు అధిపతి అయిన దత్తాత్రేయుడు నన్ను కాపాడుగాక! కర్మబంధాల నుండి గణాధిపతి అయిన కపిలుడు రక్షించుగాక! మన్మథుని నుండి సనత్కుమారుడు కాపాడుగాక! దారిలో వెళ్తూ దేవతలను అవహేళన చేసిన పాపం నుండి శ్రీహయగ్రీవుడు రక్షించుగాక! దేవతలకు నమస్కారం చేయకుండా తిరస్కరించినప్పుడు, దేవపూజలో లోపం జరిగినప్పుడు నారదుడు నన్ను కాపాడుగాక! అంతులేని నరకాలనుండి కూర్మమూర్తి నన్ను రక్షించుగాక! తినరానిది తిన్న దోషం నుండి భగవంతుడైన ధన్వంతరి నన్ను కాపాడుగాక! శీతోష్ణాది ద్వంద్వాల నుండి జితేంద్రియుడైన ఋషభుడు నన్ను రక్షించుగాక! లోకుల నిందల నుండి అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక! చావు పుట్టుకలు కలిగించే అసత్కర్మల నుండి బలభద్రుడు నన్ను రక్షించుగాక! కాలప్రభావం నుండి యముడు కాపాడుగాక! సర్ప సమూహం నుండి ఆదిశేషుడు నన్ను రక్షించుగాక! అజ్ఞానం నుండి కృష్ణద్వైపాయనుడు నన్ను కాపాడుగాక! వేదవిద్యా విముఖుల నుండి బుద్ధదేవుడు నన్ను రక్షించుగాక! శనిపీడ నుండి కల్కి నన్ను కాపాడుగాక! ఈ విధంగా ధర్మరక్షణ పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ఆయా రూపాలలో నన్ను రక్షించుగాక! ఉదయం, మధ్యాహ్నం, పట్టపగలు, సాయంకాలం, మునిమాపువేళ, అర్ధరాత్రి, అపరాత్రి, పత్యూషకాలం, సంధికాలాలు, ప్రభాతం అనే సకల సమయాలలో గద మొదలైన ఆయుధాలను ధరించి కేశవుడు, నారాయణుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనుడు, త్రివిక్రముడు, వామనుడు, హృషీకేశుడు, పద్మనాభుడు, శ్రీవత్సాంకుడు, సర్వేశ్వరుడు, జనార్దనుడు, విశ్వేశ్వరుడు, కాలమూర్తి అనే నామ రూపాలు కలిగిన దేవుడు నన్ను రక్షించుగాక! ప్రళయకాలపు అగ్నిజ్వాలలతో అతి తీవ్రంగా తిరుగుతూ అవక్రపరాక్రమంతో రాక్షస సమూహాన్ని చీకాకు పరచే సుదర్శన చక్రమా! పెనుగాలికి పెచ్చరిల్లిన అగ్ని ఎండుగడ్డితో నిండిన అడవులను భస్మం చేసినట్లు నీవు భగవంతునిచే ప్రయోగింపబడి నా శత్రువులను నిశ్శేషంగా దహించు. ప్రళయకాలంలో అమితోత్సాహంతో గర్జిస్తూ పదిదిక్కులలో క్రమ్మిన కారు మబ్బులు వెలిగ్రక్కే కోటానుకోట్ల పిడుగుల నుండి వెడలే అగ్నికణాల భుగభుగ ధ్వనులతో నిండి శ్రీమన్నారాయణుని కరకమలంలో చండప్రచండంగా వెలిగే కౌమోదకీ గదాదండమా! తండోపతండాలైన నా విరోధులను పిండి పిండి కావించు. కూశ్మాండాలు, వైనాయకాలు, యక్షులు, రక్షస్సులు, భూతాలు, గ్రహాలు మొదలైన దుష్టశక్తులను పొడిపొడి చేసి వినోదించు. సకలలోక జయశీలుడైన శ్రీకృష్ణుని పుణ్యసదనమైన వదనం నుండి పూరింపబడే పాంచజన్య శంఖమా! ఉన్మత్తాలైన భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసులు మొదలైన వాటిని పారద్రోలు. నా విరోధి వీరుల గుండెలతోపాటు వారి ఇల్లాండ్ర కడుపులలోని పిండాలు అవిసేటట్లు బ్రహ్మాండభాండం బ్రద్దలయ్యే విధంగా పెద్దగా ధ్వనించు. నారాయణుని చేత ప్రయోగింపబడి మిక్కిలి పదునైన అంచుతో రాక్షసుల కఠోర కంఠాలను తెగనరికి ఆ కరాళ రక్తధారలలో మునిగి తేలే నందక మహాఖడ్గమా! నా శత్రు వ్యూహాలను ఖండ ఖండాలుగా చించి చెండాడు. నిష్కళంకాలు, నిరాటంకాలు అయిన శత చంద్రమండలాలతో అలంకరింపబడి, శుభలక్షణాలతో విలక్షణంగా ఉండే ధర్మస్వరూపమైన ఓ కవచమా! దుర్మదులైన నా శత్రు సమూహాలను కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతులను ప్రసరింపజేసి మిక్కిలి చిక్కని చిమ్మచీకట్లలో చిక్కుపడే విధంగా చెయ్యి. భగవంతుని నామాలు, రూపాలు, వాహనాలు, దివ్యాయుధాలు పాపగ్రహాల వలన, క్రూర మృగాల వలన, సర్పాల వలన, అడవి పందుల వలన సంభవించే ఉపద్రవాలను తొలగించి నన్ను రక్షించుగాక! నానా విధాలైన సామగానాలతో స్తోత్రం చేయబడే గరుత్మంతుడు రక్షాదక్షుడై నన్ను కటాక్షించుగాక! శ్రీమన్నారాయణుని నామ రూప వాహనాలు దివ్యాయుధాలు మొదలైనవి నా బుద్ధిని, ఇంద్రియాలను, మనస్సును, ప్రాణాలను సంరక్షించుగాక! భగవంతుడైన శేషుడు ఉపద్రవాల నన్నింటిని దూరంగా తొలగించుగాక! ఈ సమస్త విశ్వాన్ని భగవంతుని స్వరూపంగా భావించి ధ్యానించ బడే వాడు మాయామయుడు అయి, అలంకారాలు, ఆయుధాలు ధరించి తిరుగులేనివాడై విరాజిల్లే మహావిష్ణువు అవశ్యం కాపాడుగాక! సమస్తలోక భయంకరమైన అట్టహాసంతో ప్రకాశించే వదన గహ్వరంతో తేజోవిరాజమానుడై శ్రీ నృసింహదేవుడు లోపల, వెలుపల అన్ని దిక్కుల నుండి నన్ను రక్షించుగాక! ఈవిధంగా శ్రీమన్నారాయణ స్వరూపమైన కవచాన్ని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించాడు. ఇంద్రుడు ఆ కవచాన్ని గ్రహించి దాని ప్రభావంతో తన శత్రువులైన రాక్షసులను జయించాడు. లోకంలో ఎవరైనా సరే మాలిన్యంలేని మనస్సుతో ఈ నారాయణ కవచాన్ని స్వీకరించి ప్రతిదినం పఠిస్తున్నట్లయితే అతి భయంకరమైన యుద్ధాల వల్ల, అత్యంత దుర్భరాలైన కష్టాల వల్ల, ఘోరాతి ఘోరమైన దుష్టగ్రహాల వల్ల, క్రూరమైన మారణ కర్మల వల్ల ఏ విధమైన బాధలు పొందకుండా సుఖంగా ఉంటారు. ఎటువంటి మనోవ్యథలు లేకుండా విజయం సాధించి చక్కని ఆరోగ్యంతో ఆనందిస్తారు.