షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము
- ఉపకరణాలు:
ఇట్లు నారాయణకవచంబు ఘటియించి, పాదంబులను, జానువులను, నూరువులను, నుదరంబునను, హృదయంబునను, నురంబునను, ముఖంబునను, శిరంబునను నట్లష్టాంగంబులం బ్రణవపూర్వకంబైన యష్టాక్షరీ మంత్రరాజంబు విన్యాసంబుచేసి ద్వాదశాక్షర విద్యచేతం గరన్యాసంబు చేసి, మంత్రమూఁర్తియై భగవచ్ఛబ్ద వాచ్యం బైన ప్రణవాది యకారాంత మహామంత్రంబు చేత నంగుళ్యంగుష్ఠ పర్వసంధులయం దుపన్యసించి, మఱియు హృదయంబున నోంకారంబు, వికారంబు మూర్ధంబున, షకారంబు భ్రూమధ్యంబు నందు, ణకారంబు శిఖ యందు, వేకారంబు నేత్రంబులయందు, నకారంబు సర్వ సంధులయందు మఱియు నస్త్రము నుద్దేశించి మకారంబు నుపన్యసించె నేని మంత్రమూర్తి యగు; మఱియును "అస్త్రాయఫట్" అను మంత్రంబున దిగ్భంధనంబుచేసి, పరమేశ్వరునిం దన భావంబున నిల్పి విద్యామూర్తియుఁ, దపోమూర్తియు నగు షట్చక్తి సంయుతం బైన నారాయణ కవచాఖ్య మైన మంత్రరాజంబు నిట్లని పఠియించె.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; నారాయణకవచంబు = నారాయణ కవచమును; ఘటియించి = అనుసంధానము చేసికొని; పాదంబులను = పాదములను; జానువులను = మోకాళ్ళ యందు; ఊరువులను = తొడల యందు; ఉదరంబునను = కడుపు నందు; హృదయంబునను = హృదయమునను; ఉరంబునను = వక్షస్థలమునను; ముఖంబునను = ముఖము నందు; శిరంబునను = తలపైన; ఇట్లు = ఈ విధముగ; ఇట్లు = ఈ విధముగ; అష్టాంగంబులన్ = అష్టాంగములు యందు {అష్టాంగములు - 1పాదములు 2మోకాళ్ళు 3తొడలు 4కడుపు 5హృదయము 6వక్షస్థలము 7ముఖము 8తల}; ప్రణవపూర్వకంబు = ఓంకారము ముందుగా కలది; ఐన = అయిన; అష్టాక్షరీ = అష్టాక్షరి {అష్టాక్షరీమంత్రము - ఓంనమోనారాయణాయ అనెడి 8 అక్షరములు గల ఓంకారముతో ప్రారంభించి శిరస్సుతో మొదలిడి అష్టాంగవిన్యాసముతో చేసెడి మంత్రము}; మంత్ర = మంత్రములలో; రాజంబు = శ్రేష్ఠమైనది; విన్యాసంబు = విన్యాసము; చేసి = చేసి; ద్వాదశాక్షరవిద్య = ద్వాదశాక్షరవిద్య {ద్వాదశాక్షరవిద్య - ఓంనమోభగవతేవాసుదేవాయ అనెడి 12 అక్షరములుగల ఓంకారముతో ప్రారంభించి కరన్యాసముతో చేసెడి మంత్రము}; చేతన్ = చేత; కర = చేతులతో; న్యాసంబు = న్యాసము; చేసి = చేసి; మంత్రమూర్తి = మంత్రమూర్తిగ; ఐ = అయ్యి; భగవత్ = భగవంతుడు యనెడి; శబ్ద = పలుకుచే; వాచ్యంబు = పలుకబడునది; ఐన = అయిన; ప్రణవ = ఓంకారము; ఆది = ముందుకలిగి; అకారాంత = అకారము అంతముగా కలిగిన; మహా = గొప్ప; మంత్రంబు = మంత్రము; చేతన్ = చేత; అంగుళ్య = చేతి వేళ్ళు; అంగుష్ట = బొటకనవేలు; పర్వ = విస్తరించిన; సంధుల = సంధుల; అందు = అందు; ఉపన్యసించి = చక్కగా న్యాసముచేసి; మఱియు = ఇంకను; హృదయంబునన్ = హృదయము నందు; ఓంకారంబు = ఓంకారము; వికారంబు = వికారము; మూర్దంబునన్ = శిరస్సు నందు; షకారంబు = షకారము; భ్రూమధ్యంబున్ = భృకుటి; అందు = అందు; ణకారంబు = ణకారము; శిఖ = పిలకప్రాంతము; అందు = అందు; వేకారంబు = వేకారము; నేత్రంబులు = కన్నులు; అందు = అందు; నకారంబు = నకారము; సర్వ = అన్ని; సంధుల = శరీరసంధుల; అందు = అందు; మఱియున్ = ఇంకను; అస్త్రమున్ = అస్త్రమును; ఉద్దేశించి = ఉద్దేశించి; మకారంబును = మకారము; ఉపన్యసించెనేని = పలికినట్లయితే; మంత్రమూర్తి = మంత్రమూర్తిగ; అగు = అగును; మఱియును = ఇంకను; అస్త్రాయఫట్ = అస్త్రాయఫట్; అను = అనెడి; మంత్రంబునన్ = మంత్రముచేత; దిగ్బంధనంబు = దిగ్బంధనము; చేసి = చేసి; పరమేశ్వరుని = భగవంతుని; తన = తన యొక్క; భావంబునన్ = భావములో; నిల్పి = నిలుపుకొని; విద్యా = విద్య యొక్క; మూర్తియున్ = స్వరూపమును; తపస్ = తపస్సు యొక్క; మూర్తియున్ = స్వరూపమును; అగు = అయిన; షట్చక్తి = ఆరుశక్తులతో; సంయుతంబు = కూడినది; అయిన = అయిన; నారాయణకవచ = నారాయణకవచము; ఆఖ్యము = అనెడి పేరు గలది; ఐన = అయిన; మంత్ర = మంత్రములలో; రాజంబున్ = శ్రేష్ఠమైన దానిని; ఇట్లు = ఈ విధముగ; అని = అని; పఠియించె = చదివెను.
భావము:
ఈ విధంగా నారాయణ కవచాన్ని అనుసంధానం చేసుకొని ‘ఓం నమో నారాయణాయ’ అనే ప్రణవ పూర్వకమైన అష్టాక్షరీ మంత్రంలోని ఎనిమిది అక్షరాలను పాదాలు, మోకాళ్ళు, తొడలు, కడుపు, హృదయం, వక్షఃస్థలం, ముఖం, శిరస్సు అనే అష్టాంగాలలో విన్యాసం చేయాలి. తరువాత ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే ద్వాదశాక్షరీ మంత్రంతో కరన్యాసం చేయాలి. ఈ విధంగా అంగన్యాస కరన్యాసాలు చేసి సాధకుడు మంత్రమూర్తియై వెలుగొందిన తర్వాత ‘ఓం విష్ణవే నమః’ అనే మంత్రాన్ని గ్రహించి, హృదయంలో ‘ఓం’కారాన్ని, శిరస్సున ‘వి’కారాన్ని, కనుబొమల నడుమ ‘ష’కారాన్ని, శిఖయందు ‘ణ’కారాన్ని, నేత్రాలలో ‘వే’కారాన్ని, మిగిలిన శరీర సంధి ప్రదేశాలలో ‘న’కారాన్ని, అస్త్రముద్రతో ‘మ’కారాన్ని విన్యాసం చేసి ‘అస్త్రాయ ఫట్’ అనే మంత్రంతో దిగ్బంధనం చేసి భగవంతుణ్ణి మనస్సులో ధ్యానిస్తే విద్యామూర్తిగా, తపోమూర్తిగా రూపొందుతాడు. షట్ఛక్తులతో కూడిన ‘నారాయణ కవచం’ అనే మంత్రాన్ని ఈ విధంగా పఠించాలి.