పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

  •  
  •  
  •  

5.2-110-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి బలుని యావలింతలను స్వైరిణులు కామినులు పుంశ్చలు లను స్త్రీ గణంబులు జనియించి; రా కామినీ జనంబులు పాతాళంబుఁ బ్రవేశించిన పురుషునికి హాటకరసం బనియెడు సిద్ధరసఘుటిక నిచ్చి రససిద్ధునిం గావించి యతనియందు స్వవిలాసావలోక నానురాగ స్మిత సల్లాపోపగూహ నాదుల నిచ్ఛా విహారంబులు సలుపుచుండ నా పురుషుండు మదాంధుండై తానె సిద్ధుండ ననియును నాగాయుత బలుండ ననియును దలంచి నానావిధ రతిక్రీడలఁ బరమానందంబు నొందుచుండు.

టీకా:

అట్టి = అటువంటి; బలుని = బలాసురుని; ఆవలింతలను = ఆవలింతలందు; స్వైరిణులుల్ = స్వేచ్ఛగా పురుషులతో తిరిగెడు స్త్రీలు, జారిణి; కామినులుల్ = ప్రియ సంగమమున మిక్కిలి ఆసక్తిగల స్త్రీలు; పుంశ్చలుల్ = రంకుటాలు, కులట; అను = అనెడి; స్త్రీ = స్త్రీల; గణంబులున్ = సమూహములు; జనియించిరి = పుట్టిరి; ఆ = ఆ; కామినీ = స్త్ఱ్ఱీ; జనంబులు = జనములు; పాతాళంబున్ = పాతాళమును; ప్రవేశించిన = చేరినట్టి; పురుషుని = పురుషుని; కిన్ = కి; హాటకరసంబున్ = హాటకరసము, బంగారపు మందు; అనియెడు = అనెడి; సిద్ధరస = సిద్ధరసపు {సిద్ధరసము - సిద్ధి (వాంఛిత ప్రాప్తి) కలిగించెడి రసము (ఔషధము)}; ఘుటికన్ = గుళికను; ఇచ్చి = సేవించుటకు ఇచ్చి; రససిద్ధునిన్ = శృంగారరస సిద్ధునిగా; కావించి = చేసి; అతని = అతని; అందున్ = తో; స్వ = తమ; విలాస = విలాసవంతమైన; అవలోకన = చూపులు; అనురాగ = ఆపేక్షపూరిత; స్మిత = చిరునవ్వులు; సల్లాప = చక్కటి మాటలు; ఉపగూహనంబులు = కౌగిలింతలు; ఇచ్ఛా = ఇష్టానుసార; విహారంబులున్ = వర్తనలు; సలుపుచుండన్ = చేయుచుండగా; ఆ = ఆ; పురుషుండు = మానవుడు; మద = మదముచేత; అంధుండు = కన్న గాననివాడు; ఐ = అయ్యి; తానె = తనే; సిద్ధుండను = శృంగారరస సిద్ధుడను; అనియును = అని; నాగ = ఏనుగులు; అయుత = పదివేలకి సమానమైన; బలుండను = బలము కలవాడను; అనియును = అని; తలంచి = భావించుకొని; నానవిధ = అనేక విధములైన; రతిక్రీడలన్ = శృంగార వినోదము లందు; పరమ = అత్యధికమైన; ఆనందంబున్ = ఆనందమును; ఒందుచుండు = పొందుచుండును;

భావము:

అటువంటి బలాసురుని ఆవులింతల నుండి స్వైరిణులు, కామినులు, పుంశ్చలులు అనే స్త్రీ సమూహాలు పుట్టారు. ఆ స్త్రీలు పాతాళంలో ప్రవేశించిన పురుషునికి హాటకరసం అనే సిద్ధ రసఘుటికను ఇచ్చి అతనిని శృంగారరస సిద్ధుణ్ణి చేస్తారు. తమ తళుకు బెళుకు చూపులతో, అనురాగ ప్రదర్శనలతో, చిరునవ్వులతో, సరస సల్లాపాలతో, కౌగిలింతలతో అతనిని లోబరచుకొంటారు. తమకు నచ్చిన రీతిలో ఆ పురుషునితో విహారం సాగిస్తారు. అపుడు పాతాళం ప్రవేశించిన ఆ పురుషుడు తానే సిద్ధపురుషుడనని భావిస్తాడు. దర్పంతో అతని కళ్ళు నెత్తి కెక్కుతాయి. తాను పదివేల ఏనుగుల బలం కలవాడనని భావించుకొని రకరకాల రతిక్రీడలతో పరమానందం అనుభవిస్తుంటాడు.