పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పాతాళ లోకములు

  •  
  •  
  •  

5.2-105-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి భూమండలంబు క్రింద యోజనాయుతాంతరంబున నండకటాహాయామంబు గలిగి క్రమంబున నొండొంటికిం గ్రిందగుచు నతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళలోకంబు లుండు; నట్టి బిల స్వర్గంబుల యందు నుపరి స్వర్గంబున కధికం బైన కామ భోగంబుల నైశ్వర్యానందంబులను సుసమృద్ధ వనోద్యాన క్రీడా విహార స్థానంబు లననుభవించుచు దైత్య దానవ కాద్రవేయాది దేవయోనులు నిత్య ప్రముదితానురక్తు లగుచుఁ గళత్రాపత్య సుహృద్బంధు దాసీదాస పరిజనులతోఁ జేరుకొని మణిగణ ఖచితంబులగు నతిరమణీయ గృహంబులయందు నీశ్వరునివలనం జేటు లేని కాయంబులు గలిగి వివిధ మాయావిశేష వినిర్మిత నూతన కేళీసదన విహరణమండప విచిత్రోద్యానాదుల యందుఁ గేళీవినోదంబులు సలుపుచుఁ జరియింతు; రంత.

టీకా:

అట్టి = అటువంటి; భూమండలంబున్ = భూమండలమునకు; క్రిందన్ = క్రిందన; యోజన = యోజనములు; అయుత = పదివేల (10,000); అంతరంబునన్ = దూరములలో; అండకటాహా = బ్రహ్మాండగోళమమంత; ఆయామంబున్ = విస్తరించుకొన్నది; కలిగి = కలిగినట్టియును; క్రమంబునన్ = వరుసగా; ఒండొంటికిని = ఒకదానికొకటి; క్రిందన్ = క్రిందనుండునవి; అగుచున్ = అగుచు; అతల = అతలము; వితల = వితలము; సుతల = సుతలము; రసాతల = రసాతలము; తలాతల = తలాతలము; మహాతల = మహాతలము; పాతాళ = పాతాళము యనెడి; లోకంబులున్ = లోకములు; ఉండును = ఉండును; అట్టి = అటువంటి; బిల = బిలము {బిలము - భూమి లేదా కొండల యందలి ఖాళీస్థలము లేదా కన్నము}; అందున్ = లలో; ఉపరి = పైనుండెడి; స్వర్గంబున్ = స్వర్గమున; కున్ = కు; అధికంబున్ = పెద్దవి; ఐన = అయినట్టి; కామ = కోరికలు తీర్చుకొను; లోకంబులన్ = లోకములలో; ఐశ్వర్య = సంపదలు; ఆనందంబులనున్ = ఆనందములను; సు = చక్కగా; సమృద్ధ = నిండైన; వన = వనములు; ఉద్యాన = తోటలు; క్రీడా = క్రీడించుటకు; విహార = విహరించుటకు; స్థానంబులనున్ = అనుకూలమైన ప్రదేశములందు; అనుభవించుచున్ = అనుభవించుతు; దైత్య = రాక్షస విశేషము; దానవ = రాక్షస విశేషము; కాద్రవేయ = నాగులు; ఆది = మొదలగు; దేవయోనులు = ఉత్తమ జన్మలుగలవారు; నిత్య = శాశ్వతమైన; ప్ర = మిక్కిలి; ముదిత = ఆనందములు మరియు; అనురక్తులు = ఆపేక్షలు కలవారు; అగుచున్ = అగుచు; సుహృత్ = సహృదయులు; బంధు = బంధువులు; దాసి = దాసీజనములు; దాస = సేవకులు; పరిజనులు = పరిచారకులు; తోన్ = తోటి; చేరుకొని = కూడుకొని; మణి = మణిమాణిక్యముల; గణ = సమూహములచే; ఖచితంబులు = తాపడము చేయబడినవి; అగు = అయినట్టి; అతి = మిక్కిలి; రమణీయ = అందమైన; గృహంబుల = ఇండ్ల; అందున్ = లో; ఈశ్వరుని = దైవము; వలనన్ = వలన; చేటు = ఆపదలు; లేని = లేనట్టి; కాయంబులు = దేహములు; కలిగి = కలిగి ఉండి; వివిధ = అనేక రకములైన; మాయా = మాయల యొక్క; విశేష = విశిష్టములచే; వినిర్మిత = చక్కగా నిర్మింపబడిన; నూతన = సరికొత్త; కేళీ = క్రీడా; సదన = గృహములు; విహరణ = విహరించుటకైన; మండప = మండపములు; విచిత్ర = చక్కగా రచింపబడిన; ఉద్యాన = తోటలు; ఆదుల = మొదలగువాని; అందున్ = లో; కేళీ = క్రీడలు; వినోదంబులున్ = వినోదములను; సలుపుచున్ = చేయుచు; చరియింతురు = తిరుగుతుందురు; అంత = అంతట;

భావము:

అటువంటి భూమండలం క్రింద ఒకదాని క్రింద ఒకటిగా అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం అనే ఏడు లోకాలున్నాయి. ఈ లోకాలలో ఒక్కొక్కదానికి మధ్య పదివేల యోజనాల దూరం ఉంటుంది. ఇవి క్రింద ఉన్నా స్వర్గం వంటివే. ఈ క్రింది స్వర్గాలు పైనున్న స్వర్గం కంటే ఎంతో గొప్పవి. ఇక్కడ దైత్యులు, దానవులు, నాగులు మొదలైన దేవజాతికి చెందినవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఐశ్వర్యం వల్ల సంక్రమించిన ఆనందానుభవంతో సుఖభోగాలతో తులతూగుతూ జీవిస్తారు. సర్వాంగ సుందరాలైన ఉద్యానవనాలలో, క్రీడా ప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు. వారు తమ భార్యలతో, బిడ్డలతో, చెలికాండ్రతో, దాస దాసీ జనంతో మణులు చెక్కిన రమణీయమైన గృహాలలో సర్వదా సంతోషం అనుభవిస్తూ ఉంటారు. ఈశ్వరుని కరుణ వల్ల వారికి దైహికాలైన వ్యాధులు లేవు. మాయలతో నిర్మింపబడ్డ కొంగ్రొత్త కేళీగృహాలలో, విహార మంటపాలలో, చిత్ర విచిత్రమైన ఉద్యానవనాలలో క్రీడా వినోదాలతో సంచరిస్తూ ఉంటారు.