పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భూ ద్వీప వర్ష విస్తారములు

  •  
  •  
  •  

5.2-66-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరేంద్రా! యా క్రౌంచద్వీపపతి యగు ఘృతపృష్ఠుండు దన కుమారుల నా పేళ్ళుగల యామోద, మధువహ, మేఘపృష్ఠ, సుదామ, ఋషిజ్య, లోహితార్ణ, వనస్పతు లను వర్షంబుల కభిషిక్తులం జేసి పరమ కల్యాణ గుణ యుక్తుం డయిన శ్రీహరి చరణారవిందంబుల సేవించుచు దపంబు నకుం జనియె; నా వర్షంబుల యందు శుక్ల వర్ధమాన భోజ నోపబర్హణానంద నందన సర్వతోభద్రంబు లను సప్త సీమాపర్వతం బులును నభయయు, నమృతౌఘయు, నార్యకయు, తీర్థవతియుఁ, దృప్తిరూపయుఁ, బవిత్రవతియు, శుక్లయు నను సప్తనదులును గల; వందులఁ బవిత్రోదకంబు లనుభవించుచు గురు ఋషభ ద్రవిణక దేవక సంజ్ఞలు గలిగి వరుణదేవుని నుదకాంజలులం బూజించు చున్న చాతుర్వర్ణ్యంబు గలిగి యుండు.

టీకా:

నరేంద్ర = రాజా; ఆ = ఆ; క్రౌంచద్వీప = క్రౌంచద్వీపమునకు; పతి = ప్రభువు; అగు = అయిన; ఘృతపృష్ఠుండున్ = ఘతపృష్టుడు; తన = తన యొక్క; కుమారులన్ = పుత్రులను; ఆ = ఆ; పేళ్ళు = పేర్లు; కల = కలిగిన; ఆమోద = ఆమోదము; మధువహ = మధువహము; మేఘపృష్ఠ = మేఘపృష్ఠము; సుదామ = సుదామము; ఋషిజ్య = ఋషిజ్యము; లోహితార్ణ = లోహితార్ణము; వనస్పతులు = వనస్పతము; అను = అనెడి; వర్షంబుల్ = వర్షములు, దేశములు; కున్ = కు; అభిషిక్తులన్ = పట్టాభిషేకము; చేసి = చేసి; పరమ = అత్యుత్తమ; కల్యాణ = శుభకరమైన; గుణ = సుగుణములతో; యుక్తుండు = కూడినవాడు; అయిన = అయిన; శ్రీహరి = నారాయణుని; చరణ = పాదము లనెడి; అరవిందంబులన్ = పద్మములను; సేవించుచున్ = కొలచుచు; తపంబున్ = తపస్సు చేసుకొనుట; కున్ = కు; జనియెన్ = వెళ్ళెను; ఆ = ఆ; వర్షంబుల = వర్షములు, దేశములు; అందున్ = లో; శుక్ల = శుక్లము; వర్ధమాన = వర్ధమానము; భోజన = భోజనము; ఉపబర్హణ = ఉపబర్హణము; ఆనంద = ఆనందము; నందన = నందనము; సర్వతోభద్రంబుల్ = సర్వతోభద్రము; అను = అనెడి; సప్త = ఏడు (7); సీమా = సరిహద్దు; పర్వతంబులునున్ = పర్వతములును; అభయమున్ = అభయ; అమృతౌఘయున్ = అమృతౌఘ; ఆర్యకయున్ = ఆర్యక; తీర్థవతియున్ = తీర్థవతి; తృప్తిరూపయున్ = తృప్తిరూప; పవిత్రవతియున్ = పవిత్రవతి; శుక్లయున్ = శుక్ల; అను = అనెడి; సప్త = ఏడు (7); నదులునున్ = నదులు; కలవు = ఉన్నవి; అందులన్ = వాని యందలి; పవిత్ర = పవిత్రమైన; ఉదకంబులనున్ = నీటిని; అనుభవించుచున్ = భుజించుచు; గురు = గురువులు; ఋషభ = ఋషభులు; ద్రవిణక = ద్రవిణకులు; దేవక = దేవకులు; సంజ్ఞలున్ = అనెడి పేర్లు; కలిగి = ఉండి; వరుణదేవుని = వరుణదేవుని; ఉదక = నీరుపట్టిన; అంజలులన్ = దోసిళ్ళతో; పూజించుచున్న = ఆరాధించుతున్నట్టి; చాతుర్వర్ణ్యంబున్ = నాలుగుకులములు; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును;

భావము:

రాజా! ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్ఠుడు క్రౌంచద్వీపానికి అధిపతి. అతనికి ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అని ఏడుగురు కుమారులున్నారు. అతడు తన కుమారుల పేరు మీదుగా క్రౌంచద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించి ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క కుమారుని రాజుగా నియమించాడు. తరువాత తాను మంగళ గుణనిలయుడైన శ్రీహరి పాదపద్మాలను సేవిస్తూ తపం చేయడానికి అడవులకు వెళ్ళాడు. ఆ క్రౌంచద్వీపంలోని ఏడు వర్షాలలో శుక్లం, వర్ధమానం, భోజనం, ఉపబర్హణం, ఆనందం, నందనం, సర్వతోభద్రం అనే ఏడు కొండలు; అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తిరూప, పవిత్రగతి, శుక్ల అనే ఏడు నదులు ఉన్నాయి. ఆ నదీజలాలలో స్నానం చేసి గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులు అనే నాలుగు వర్ణాలవారు జలాంజలులను సమర్పిస్తూ వరుణదేవుని సేవిస్తూ ఉంటారు.