పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : భరతుండు వనంబుఁ జనుట

  •  
  •  
  •  

5.1-112-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భరతుండు హరిణకుణక క్షేమంబు గోరుచు “నెప్పుడు వచ్చి నన్ను సంతోషపఱచు? నానా ప్రకారంబులైన తన గతులచేత నన్ను నెప్పు డానందంబు నొందించు? ధ్యానసమాధి నున్నప్పుడు నన్నుఁ గొమ్ముల గోఁకుచు నుండు; నట్టి వినోదంబు లెప్పుడు గనుఁగొందు దేవ పూజాద్రవ్యంబులు ద్రొక్కి మూర్కొనినం గోపించి చూచినం గుమారుడుంబోలె దూరంబునకుం జని నిలిచి మరల నేఁ బిలిచిన వెనుక నిలిచి యుండు; నిట్టి మెలఁకువ స్వభావంబులు గలుగుట యెట్టు? లీ భూదేవి యెంత తపంబు చేసినదియో? యా హరిణ పాదస్పర్శంబులం బవిత్రయైన భూమి స్వర్గాపవర్గకాములైన మునులకు యజ్ఞార్హ యగు నట్టి హరిణపోతంబు నెట్లు గనుఁగొందు? నదియునుంగాక భగవంతుండగు చంద్రుండు మృగపతిభయంబున మృతజననియు, స్వాశ్రమపరిభ్రష్టంబునైన మృగశాబకంబును గొనిపోయి పెంచుచున్నవాఁడో? మున్ను పుత్రవియోగతాపంబునం జంద్రకిరణంబులం బాపుదు; నిప్పుడు హరిణపోతంబు దన శరీర స్పర్శంజేసి చంద్రకిరణంబులకన్న నధికం బగుచుం బుత్ర వియోగతాపంబు నివర్తింపం జేసె” ననుచుం బెక్కు భంగుల హరిణ నిమిత్తంబులైన మనోరథంబులచేతం బూర్వకర్మవశంబున యోగభ్రష్టుండగు భరతుండు భగవదారాధనంబు వలన విభ్రంశితుం డగుచు నితరజాతిం బుట్టిన హరిణపోతంబుమీఁది మోహం బగ్గలం బగుచుండ నుండె;” నని పలికి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భరతుండు = భరతుడు; హరిణ = లేడి; కుణక = పిల్ల యొక్క; క్షేమంబున్ = క్షేమమును; కోరుచున్ = కోరుతూ; ఎప్పుడు = ఎల్లప్పుడు; వచ్చి = చేరవచ్చి; నన్నున్ = నన్ను; సంతోష = సంతోష; పఱచున్ = పెట్టును; నానా = వివిధ; ప్రకారంబులు = రకములు; ఐన = అయిన; తన = తన యొక్క; గతుల = వర్తనల; చేతన్ = వలన; నన్నున్ = నన్ను; ఎప్పుడు = ఎప్పుడు; ఆనందంబున్ = ఆనందము; ఒందించు = కలిగించును; ధ్యాన = ధ్యానము నందలి; సమాధిన్ = సమాధిస్థితిలో; ఉన్న = ఉండిన; అప్పుడు = సమయములో; నన్నున్ = నన్ను; కొమ్ములన్ = కొమ్ములతో; గోకుచున్ = గీరుతూ; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; వినోదంబుల్ = వేడుకలు; ఎప్పుడున్ = ఎప్పుడు; కనుగొందున్ = చూడగలను; దేవ = భగవంతుని; పూజా = పూజకైన; ద్రవ్యంబులున్ = పదార్థములను; త్రొక్కి = తొక్కి; మూర్కొనినన్ = వాసనచూసినందుకు; కోపించి = కోపముచేసి; చూచినన్ = చూసినచో; కుమారుడున్ = పిల్లవాని; పోలెన్ = వలె; దూరంబున్ = దూరమున; కున్ = కు; చని = వెళ్ళి; నిలిచి = నిలుచుండి; మరలన్ = మరల; ఏన్ = నేను; పిలిచినన్ = పిలిచిన; వెనుకన్ = వెనుక తట్టున; నిలిచి = నిలబడి; ఉండున్ = ఉండును; ఇట్టి = ఇటువంటి; మెలకువ = నేర్పు గల; స్వభావంబుల్ = స్వభావములు; కలుగుట = కలుగుట; ఎట్టులు = ఎలావీలయినది; ఈ = ఈ; భూదేవి = భూమాత; ఎంత = ఎంతటి; తపంబున్ = తపస్సును; చేసినదియో = చేసెనో; ఆ = ఆ యొక్క; హరిణ = లేడి; పాద = కాళ్ళ; స్పర్శంబులన్ = తగులుటవలన; పవిత్రము = పవిత్రము; ఐన = అయినట్టి; భూమి = నేల; స్వర్గ = స్వర్గమును; అపవర్గ = మోక్షమును; కాములు = కోరెడివారు; ఐన = అయిన; మునుల్ = మునుల; కున్ = కు; యజ్ఞ = యజ్ఞములు చేయుటకు; అర్హ = తగినది; అగున్ = అగునో; అట్టి = అటువంటి; హరిణ = లేడి; పోతంబున్ = పిల్లను; ఎట్లు = ఏ విధముగా; కనుగొందున్ = కనిపెట్టగలను; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; భగవంతుండు = భగవంతుడు; అగు = అయిన; చంద్రుండు = చంద్రుడు; మృగపతి = సింహము యొక్క {మృగపతి - మృగములకు ప్రభువు, సింహము}; భయంబునన్ = భయముచేత; మృత = మరణించిన; జననియున్ = తల్లి గలది; స్వ = తనయొక్క; ఆశ్రమ = ఆశ్రమమునుండి; పరిభ్రష్టంబున్ = తప్పిపోయినది; ఐన = అయినట్టి; మృగ = లేడి; శాబకంబునున్ = పిల్లను; కొనిపోయి = తీసుకెళ్ళి; పెంచుచున్ = పెంచుతూ; ఉన్నవాడో = ఉన్నాడేమో; మున్ను = ఇంతకు ముందు; పుత్ర = కుమారుల; వియోగ = ఎడబాటు యొక్క; తాపంబునన్ = బాధల; చంద్ర = చంద్రుని యొక్క; కిరణంబులన్ = కిరణములచేత; పాపుదున్ = పోగొట్టుకొనెదను; ఇప్పుడు = ఇప్పుడు; హరిణ = లేడి; పోతంబు = పిల్ల; తన = తన యొక్క; శరీర = దేహము; స్పర్శన్ = తాకుట; చేసి = వలన; చంద్ర = చంద్రుని యొక్క; కిరణంబుల్ = కిరణముల; కన్నన్ = కంటెను; అధికంబు = ఎక్కువ; అగుచున్ = అగుచూ; పుత్ర = పుత్రుల; వియోగ = ఎడబాటు యొక్క; తాపంబునన్ = సంతాపము; నివర్తింపన్ = తొలగించునట్లు; చేసెన్ = చేసెను; అనుచున్ = అంటూ; పెక్కు = అనేకమైన; భంగులన్ = విధములుగ; హరిణ = లేడి; నిమిత్తంబులు = కోసము; ఐన = అయిన; మనోరథంబుల్ = కోరికల; చేతన్ = వలన; పూర్వ = పూర్వకాలపు లేదా జన్మజన్మల; కర్మ = కర్మములకు; వశంబునన్ = విధేయమగుటచే; యోగ = యోగాభ్యాసము; భ్రష్టుండు = జారిపోయినవాడు; అగు = అయిన; భరతుండు = భరతుడు; భగవత్ = భగవంతుని; ఆరాధనంబున్ = పూజ; వలన = నుండి; విభ్రంశితుండు = మిక్కిలి జారిపోయినవాడు; అగుచున్ = అగుచూ; ఇతర = మరియొక; జాతిన్ = జాతిలో; పుట్టిన = జనించిన; హరిణ = లేడి; పోతంబున్ = పిల్ల; మీది = పైని; మోహంబు = లాలస; అగ్గలంబు = పెంచుకొనుట; అగుచుండ = చేసుకొనుచు; ఉండెన్ = ఉండెను; అని = అని; పలికి = చెప్పి; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఇంద్రుడు; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా భరతుడు లేడిపిల్ల క్షేమంగా ఉండాలని కోరుకుంటూ “ అది ఎప్పుడు వచ్చి నన్ను సంతోషపెడుతుందో? రకరకాలైన తన నడకలతో నన్ను ఎప్పుడు మురిపిస్తుందో? నేను ధ్యానసమాధిలో ఉండగా కొమ్ములతో గోకేది. అలాంటి వినోదాలను మళ్ళీ ఎప్పుడు చూస్తానో? దేవుని పూజకై తెచ్చిన ద్రవ్యాలను తొక్కి వాసన చూసినప్పుడు నేను కోపంగా చూస్తే చప్పున చిన్నబిడ్డలాగా దూరంగా పోయి నిలబడి, నేను పిలిచినప్పుడు వచ్చి నా వెనుక నిలబడేది. దానికి ఇంతటి తెలివి ఎలా అబ్బింది? ఈ భూదేవి ఎంత పుణ్యం చేసుకుందో? ఇటువంటి జింకపిల్ల పాదస్పర్శ వల్ల ముక్తి కాములైన మునుల యజ్ఞవాటిక కావడానికి యోగ్యత సంపాదించుకుంది. ఆ జింకపిల్లను నేనెక్కడ వెదకాలి? భగవంతుడైన చంద్రుడు సింహం బారిన పడకుండా తల్లి, ఆశ్రయం లేని ఆ జింకపిల్లను తీసికొని పోయి పెంచుకుంటున్నాడేమో? పూర్వం నేను పుత్ర వియోగ తాపాన్ని చంద్ర కిరణాలతో శాంతింప జేసుకొనేవాణ్ణి. తరువాత ఈ జింకపిల్ల చంద్రకిరణాల కంటే చల్లనైన తన శరీర స్పర్షతో ఆ సంతాపాన్ని పోగొట్టింది” అనుకుంటూ ఎన్నో విధాలుగా జింకపిల్లను గురించి భావించి బాధపడుతున్న భరతుడు యోగభ్రష్టు డయ్యాడు. భగవంతుణ్ణి ఆరాధించడం మానుకున్నాడు. మృగజాతిలో పుట్టిన జింకపిల్ల మీద మోహం పెంచుకున్నాడు” అని శుకమహర్షి మళ్ళీ ఇలా అన్నాడు.