పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-684-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి సౌందర్యఖనియు సముద్రపుత్రియు నయిన శతధృతి యను కన్యం బ్రహ్మాదేశంబునం బాణిగ్రహణంబు చేసె; నా శతధృతి వలనం బ్రాచీనబర్హికిఁ బదుగురు కొడుకులు జనియించిరి; వారలు తుల్యనామ వ్రతులును ధర్మపారగులును నయిన ప్రచేతసులు; వారు ప్రజాసర్గంబు నందుఁ దండ్రిచేత నాజ్ఞాపితులయి తపంబు గావింప వనంబునకుం జను సమయంబునం దన్మార్గంబునఁ బ్రసన్నుం డగుచు దృశ్యమానుండైన రుద్రునిచేత నేది యుపదేశింపబడె దాని జపధ్యాన పూజా నియమంబుల సేవించుచుఁ దపఃపతి యైన నారాయణుం బదివేల దివ్యవత్సరంబులు పూజించి;" రని చెప్పిన విని విదురుండు మైత్రేయున కిట్లనియె.

టీకా:

అట్టి = అటువంటి; సౌందర్య = సౌందర్యమునకు; ఖనియున్ = గని వంటిది; సముద్ర = సముద్రుని; పుత్రియున్ = పుత్రిక; అయిన = అయినట్టి; శతధృతి = శతధృతి {శతధృతి - శత (నూరు)(100) ధృతి (యజ్ఞములు)}; అను = అనెడి; కన్యన్ = కన్యను; బ్రహ్మ = బ్రహ్మదేవుని; ఆదేశంబునన్ = ఆజ్ఞానుసారము; పాణిగ్రహణము = వివాహము; చేసెన్ = చేసుకొనెను; ఆ = ఆ; శతధృతి = శతధృతి; వలనన్ = వలన; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; కిన్ = కి; పదుగురు = పదిమంది; కొడుకులు = పుత్రులు; జనియించిరి = పుట్టిరి; వారలు = వారలు; తుల్య = సమానమైన; నామ = పేర్లు; వ్రతులును = వ్రతములును కలవారు; ధర్మ = వేదధర్మమున; పారగులును = జ్ఞానులు {పారగులు - పారము (తుది) చూసినవారు}; ప్రచేతసులు = ప్రచేతసులు {ప్రచేతసులు - ప్ర (ఉత్తమమైన) చేతస్ (మానసము) కలవారు}; వారు = వారు; ప్రజా = సంతానమును; సర్గంబునన్ = పుట్టించుట యందు; తండ్రి = తండ్రి; చేతన్ = చేత; ఆజ్ఞాపితులు = ఆజ్ఞాపించబడిన వారు; అయి = అయ్యి; తపంబున్ = తపస్సు; కావింపన్ = చేయుటకు; వనంబున్ = అడవి; కున్ = కి; చను = వెళ్ళిన; సమయంబున్ = సమయము; అందున్ = అందు; తత్ = ఆ; మార్గంబునన్ = దారిలో; ప్రసన్నుండు = ప్రసన్నమైనవాడు; అగుచున్ = అవుతూ; దృశ్యమానుండు = ప్రత్యక్షమైన వాడు; ఐన = అయినట్టి; రుద్రుని = శివుని; చేతన్ = వలన; ఏది = ఏదైతే; ఉపదేశింపబడెన్ = ఉపదేశింపబడినదో; దానిన్ = దానిని; జప = జపించుట {జపించుట - యథోచితముగ మరల మరల మననము చేయుట}; ధ్యాన = ధ్యానము చేయుట {ధ్యానము - మనసున ధరించుట}; పూజా = పూజించుటలతోను; నియమంబులన్ = యమనియమములతోను; సేవించుచున్ = సేవించుతూ; తపః = తపస్సునకు; పతి = ప్రభువు; ఐన = అయిన; నారాయణున్ = హరిని; పదివేల = పదివేలు (10,000); దివ్యవత్సరంబులున్ = దివ్యసంవత్సరములు; పూజించిరి = పూజించిరి; అని = అని; చెప్పినన్ = చెప్పగా; విని = విని; విదురుండు = విదురుడు; మైత్రేయున్ = మైత్రేయున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అంతటి సౌందర్యవతి, సముద్రపుత్రి అయిన ఆ శతధృతిని బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం ప్రాచీనబర్హి పెండ్లి చేసుకున్నాడు. శతధృతివల్ల ప్రాచీనబర్హికి పదిమంది కొడుకులు జన్మించి ‘ప్రచేతసులు’ అని ప్రఖ్యాతి గాంచారు. వారు సమవ్రతులు, సమనాములు, ధర్మజ్ఞులు. ఆ ప్రచేతసులు తండ్రి ఆజ్ఞ తలదాల్చి ప్రజలను సృజించటం కోసం తపస్సు చేయడానికి అడవికి బయలుదేరారు. త్రోవలో వారికి రుద్రుడు సాక్షాత్కరించి దయతో నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ప్రచేతసులు ఆ ఉపదేశానుసారం జపధ్యాన పూజానియమాలతో నారాయణుని పదివేల సంవత్సరాలు ఆరాధించారు” అని చెప్పగా విని విదురుడు మైత్రేయ మహర్షిని ఇలా ప్రశ్నించాడు.