చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట
- ఉపకరణాలు:
ఇట్లగుటం జేసి సత్పురుషు లైనవారలు నిరస్తమాయాగుణ సముదయంబు గల నిన్ను భజియింతురు; వారలు భవత్పాదానుస్మరణ రూపంబయిన ప్రయోజనంబు దక్క నితర ప్రయోజనంబుల నెఱుంగరు; దేవా! సేవక జనంబులను వరంబులు వేఁడు మని జగద్విమోహనంబు లైన వాక్యంబులు పలుకుదువు; యట్టి భవదీయ వాక్యతంత్రీనిబద్ధులు లోకులు గాకుండిరేని ఫలకాములై కర్మంబుల నెట్టు లాచరింతురు; యీశా! భవదీయ మాయావిమోహితులై జను లేమి కారణంబున నీకంటె నితరంబులఁ గోరుచుందు? రిట్లగుటం జేసి తండ్రి దనంతన బాలహితం బాచరించు నట్లు మాకు నీవ హితాచరణం బాచరింప నర్హుండ"వని పలికిన నాదిరాజర్షి యైన పృథుచక్రవర్తి యర్థవంతంబు లయిన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె “మహారాజా! దైవప్రేరితుండవై నా యెడ నిట్టి బుద్ధి గలుగుటం జేసి యచలాచలం బగు భక్తి వొడము; దానిచే దుస్తరం బగు మదీయమాయం దరింతువు; నీవు నాచే నాదిష్టం బగు కృత్యం బప్రమత్తుండ వగుచు నాచరించిన సకల శుభంబులం బొందుదువు; మదీయ భక్తజనంబులు స్వర్గాపవర్గనరకంబులం దుల్యంబులుగా నవలోకింతురు; గావున నీ యధ్యవసాయంబు నట్టిదియ; మఱియు మదీ యాదేశంబున దుస్త్యజం బగు రోషంబును ద్యజించి నా యెడ భక్తి సలిపితివి గాన యదియె నాకుఁ బరమహర్షదం బగు” నని యభినందించి యనుగ్రహించి యతండు గావించు పూజలు గయికొని గమనోన్ముఖుం డయ్యె; నయ్యవసరంబున.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; అగుటన్ = అగుట; చేసి = వలన; సత్పురుషులు = మంచివారు; ఐన = అయినట్టి; వారు = వారు; నిరస్త = తొలగింపబడిన; మాయా = మాయ యొక్క; గుణ = గుణముల; సముదయంబున్ = సమూహము; కల = ఉన్నట్టి; నిన్నున్ = నిన్ను; భజియింతురు = సేవింతురు; వారలు = వారు; భవత్ = నీ యొక్క; పాద = పాదములను; అనుస్మరణ = ధ్యానించెడి; రూపంబున్ = రూపముకలది; అయిన = అయినట్టి; ప్రయోజనంబున్ = ప్రయోజనము; తక్క = తప్పించి; ఇతర = ఇతరమైన; ప్రయోజనంబులన్ = ప్రయోజనములను; ఎఱుంగరు = తెలిసికొనరు; దేవా = భగవంతుడా; సేవక = భక్తులైన; జనంబులను = వారిని; వరంబులున్ = వరములు; వేడుము = కోరుకొనుము; అని = అని; జగత్ = లోకములకు; విమోహనంబులు = మిక్కిలి చక్కటివి; ఐన = అయిన; వాక్యంబులున్ = మాటలను; పలుకుదువు = పలికెదవు; అట్టి = అటువంటి; భవదీయ = నీ యొక్క; వాక్య = మాటల; తంత్రీ = తీగలచే; నిబద్దులు = బాగా కట్టబడినవారు; లోకులు = జనులు; కాకుండిరి = కాకుండినట్లు; ఏని = అయితే; ఫల = ఫలితములను; కాములు = కోరువారు; ఐ = అయ్యి; కర్మంబులన్ = కర్మములను; ఎట్టులు = ఏ విధముగ; ఆచరింతురు = చేసెదరు; ఈశా = హరి; భవదీయ = నీ యొక్క; మాయా = మాయచేత; విమోహితులు = మోహమున పడినవారు; ఐ = అయ్యి; జనులు = ప్రజలు; ఏమి = ఎటువంటి; కారణంబునన్ = కారణముచేత; నీకున్ = నీకు; కంటెన్ = కంటె; ఇతరంబులన్ = వేరైనవాటిని; కోరుచుందురు = కోరుతుంటారు; ఇట్లు = ఈ విధముగ; అగుటన్ = అగుట; చేసి = వలన; తండ్రి = తండ్రి; తనంతన = తనంతతానే; బాల = పిల్లలకి; హితంబున్ = ఇష్టమైనవి; ఆచరించునట్లు = చేయునట్లు; మాకున్ = మాకు; నీవ = నీవే; హిత = హితవైనది; ఆచరణంబున్ = చేయుటను; ఆచరింపన్ = జరుపుటకు; అర్హుండవు = తగినవాడవు; అని = అని; పలికినన్ = పలికినట్టి; ఆది = మొట్టమొదటి; రాజర్షి = రాజులలోఋషి తుల్యుడు; ఐన = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; అర్థవంతంబులు = చక్కటి అర్థములు కలవి; అయిన = అయిన; వచనంబులున్ = మాటలు; విని = విని; విశ్వద్రష్ట = హరి {విశ్వద్రష్ట - విశ్వమునందు సమస్తమును ద్రష్ట (చూసెడివాడు, తెలియువాడు), విష్ణువు}; అగు = అయిన; నారాయణుండు = హరి; సంతుష్ట = సంతృప్తిచెందిన; అంతరంగుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మహారాజా = చక్రవర్తి; దైవ = దేవునిచే; ప్రేరితుడవు = పురిగొల్పబడినవాడవు; ఐ = అయ్యి; నా = నా; ఎడన్ = అందు; ఇట్టి = ఇటువంటి; బుద్ధిన్ = బుద్ధి; కలుగుటన్ = కలుగుట; చేసి = వలన; అచల = కొండవలె; అచలంబున్ = నిశ్చలమైనది; అగు = అయిన; భక్తి = భక్తి; ఒడమున్ = కలుగును; దాని = దాని; చేన్ = వలన; దుస్తరంబున్ = దాటరానిది; అగు = అయిన; మదీయ = నాయొక్క; మాయన్ = మాయను; తరింతువు = దాటెదవు; నీవు = నీవు; నా = నా; చేన్ = చేత; అధిష్టంబు = ఆదేశింపబడినది; అగు = అయిన; కృత్యంబున్ = కార్యక్రమమును, పనిని; అప్రమత్తుండవు = ఏమరుపాటు లేనివాడవు; అగుచున్న = అవుతూ; ఆచరించినన్ = ఆచరించినచో; సకల = సమస్తమైన; శుభంబులన్ = శుభములను; పొందుదువు = పొందెదవు; మదీయ = నా యొక్క; భక్త = భక్తులైన; జనంబులు = వారు; స్వర్గ = స్వర్గము; అపవర్గ = ముక్తి; నరకంబులన్ = నరకములను; అందున్ = ఎడల; తుల్యంబులు = సమానమైనవి; కాన్ = అయినట్లు; అవలోకింతురు = చూసెదరు; కావునన్ = అందుచేత; నీ = నీ యొక్క; అధ్యవసాయంబున్ = నిశ్చయము, పూనిక; అట్టిదియ = అటువంటిది; మఱియున్ = ఇంకను; మదీయ = నా యొక్క; ఆదేశంబునన్ = ఆదేశము; దుస్త్యజంబున్ = విడువరానిది; అగు = అయిన; రోషంబున్ = రోషమును; త్యజించి = విడిచి; నా = నా; ఎడన్ = అందు; భక్తిన్ = భక్తిని; సలిపితివి = చేసితివి; కాన = కనుక; అదియె = అదే; నాకున్ = నాకు; పరమ = మిక్కిలి; హర్షదంబు = సంతోషము కలిగించునది; అగున్ = అగును; అని = అని; అభినందించి = పొగిడి; అనుగ్రహించి = కరుణించి; అతండు = అతడు; కావించు = చేసెడి; పూజలున్ = సేవించుటలను; కయికొని = స్వీకరించి; గమన = వెళ్ళుటకు; ఉన్ముఖుండు = సిద్దపడినవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు.
భావము:
అందుకే సజ్జనులు మాయాతీతుడవైన నిన్ను సేవిస్తారు. వారు నీ పాదస్మరణ రూపమైన ఫలాన్ని తప్ప ఇంకొక ఫలాన్ని కోరుకొనరు. దేవదేవా! సేవకులను వరాలు కోరుకొమ్మని జగత్తును మోసగించె వాక్యాలను పలుకుతున్నావు. లోకులు నీ వాక్యాలనబడే త్రాళ్ళతో కట్టుబడిన వారై ఫలాలను ఆశించి కర్మాసక్తు లవుతారు. నీ మాయా విమోహితులు కాకపోతే జనులు నీ భక్తికంటే ఇతర వరాలను ఎందుకు కోరుకుంటారు? కాబట్టి తండ్రి తనంత తాను పిల్లలకు మేలుచేసే విధంగా నీవు మాకు హితం చేకూర్చు” అని పలికిన ఆది రాజర్షి అయిన పృథు చక్రవర్తి మాటలు విని విశ్వకర్త అయిన నారాయణుడు సంతృప్తి పడి ఇలా అన్నాడు. “మహారాజా! దైవప్రేరణ వల్లనే నాయందు నీకు ఇటువంటి బుద్ధి కలిగింది. అందువల్ల కొండవలె నిశ్చలమైన నిండు భక్తి నీకు ప్రాప్తిస్తుంది. ఆ నిశ్చల భక్తి వల్ల దాటటానికి శక్యం కాని నా మాయను నీవు దాటగలవు. నేను ఆజ్ఞాపించిన కార్యాన్ని నీవు జాగరూకుడవై ఆచరిస్తే సకల శుభాలను పొందుతావు. నా భక్తులు స్వర్గాన్ని, మోక్షాన్ని, నరకాన్ని సమానంగా చూస్తారు. నీ భావన కూడా అంతే. ఇదే నాకు పరమానందం” అని అభినందించి పృథు చక్రవర్తి చేసిన పూజలను స్వీకరించి శ్రీహరి వైకుంఠానికి బయలుదేరాడు. ఆ సమయంలో…