చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట
- ఉపకరణాలు:
“జగదీశ! దేవ! యుష్మత్పద కైంకర్య-
పరతఁ దనర్చు సాగరతనూజ
కృత్యంబునందు నకిల్బిష బుద్ధి నేఁ-
బ్రీతిఁ గోరుట జగన్మాత యైన
యా రమాసతితోడి వైర మవశ్యంబుఁ-
గల్గు నైనను దయాకార! నీవు
దీనవత్సలుఁడవు గాన స్వల్పం బైన-
నధికంబు చేయుదు! వట్లుగాన
- ఉపకరణాలు:
భవ్యచరిత! నిజస్వరూపంబునందు
నభిరతుఁడ వైన నీవు నన్నాదరించు
పగిది నిందిర నాదరింపవు మహాత్మ!
భక్తజనలోక మందార! భవవిదూర!
టీకా:
జగదీశ = హరి {జగదీశుడు - జగత్తు (లోకముల)కు ఈశ (ప్రభువు), విష్ణువు}; దేవా = హరి; యుష్మత్ = నీ యొక్క; పద = పాదములను; కైంకర్య = సేవించెడి; పరతన్ = దీక్షలో; తనర్చు = అతిశయించెడి; సాగరతనూజ = లక్ష్మీదేవి చేసెడి {సాగరతనూజ - సాగర (సముద్రుని) తనూజ (పుత్రిక), లక్ష్మి}; కృత్యంబున్ = పనులు; అందున్ = లో; అకిల్బిష = కల్మషములేని; బుద్ధి = భావముతో; నేన్ = నేను; ప్రీతిన్ = కూర్మితో; కోరుటన్ = కోరుటవలన; జగన్మాత = జగత్తునకేతల్లి; ఐన = అయిన; ఆ = ఆ; రమాసతి = లక్ష్మీదేవి; తోడి = తోటి; వైరమున్ = కలహము; అవశ్యంబున్ = తప్పక; కల్గున్ = కలుగును; ఐనన్ = అయినప్పటికిని; దయాకర = కృపచేయువాడ; నీవు = నీవు; దీన = దీనులఎడ; వత్సలుడవు = వాత్సల్యముకలవాడవు; కాన = కనుక; స్వల్పంబున్ = కొంచము; ఐనన్ = అయినను; అధికంబున్ = అధికఫలితమును; చేయుదువు = కలుగజేయుదువు; అట్లుగాన = అందుచేత.
భవ్యచరిత = దివ్యమైననడవడికకలవాడ; నిజ = స్వంత; స్వరూపంబున్ = స్వరూపము; అందున్ = ఎడల; అభిరతుండవు = అనురక్తికలవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; నన్ను = నన్ను; ఆదరించు = ఆదరించెడి; పగిదిన్ = విధముగ; ఇందిరన్ = లక్ష్మీదేవిని; ఆదరింపవు = ఆదరింపవు; మహాత్మ = హరి; భక్తజనలోకమందార = హరి {భక్తజనలోకమందార - భక్తులైనజనులు సమస్తమునకు కల్పవృక్షమువంటివాడు, విష్ణువు}; భవవిదూర = హరి {భవవిదూర - భవ (సంసారబంధనములను) విదూర (పోగొట్టువాడు), విష్ణువు}.
భావము:
“దేవా! జగన్నాథా! నీ పాదాలను సేవించాలని లక్ష్మీదేవి తహతహ లాడుతున్నది. నేను కూడ ఆమె చేసే పనినే చేయాలనే సద్బుద్ధితో తొందర పడుతున్నాను. కాబట్టి జగన్మాత అయిన లక్ష్మీదేవితో నాకు వివాదం తప్పదు. దయామయా! నీవు దీనవత్సలుడవు. కాబట్టి కొంచెంగా ఉన్నదానినైనా గొప్పదానిగా చేస్తావు. అందుచేత మహాత్ముడవు, సర్వాంతర్యామివి, భవభంజనుడవు, భక్తజన రంజనుడవు అయిన నీవు నన్ను ఆదరించినంతగా లక్ష్మీదేవిని ఆదరించవు.