చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట
- ఉపకరణాలు:
వినుత మంగళ యశోవిభవ! సర్వేశ్వర!-
యిందిర గుణసంగ్రహేచ్ఛఁ జేసి
యే నీదు శివతరం బైన సత్కీర్తిని-
నర్థిమై వరియించె నట్టి కీర్తి
కలిత సత్పురుష సంగమము గల్గుచు నుండ-
ధృతినెవ్వఁడేని యాదృచ్ఛికతను
జేసియునొకమాటు చెవులార విన్నవాఁ-
డనయంబును గుణజ్ఞుఁ డయ్యెనేని
- ఉపకరణాలు:
విరతి నేరీతి బొందును ధరణిఁ బశువుఁ
దక్కఁ దక్కిన తజ్ఞుండు దనుజ భేది
గాన యుత్సుకమతి నైన యేను లక్ష్మి
కరణి నిన్ను భజింతు; నో! పరమపురుష!
టీకా:
వినుతమంగళయశోవిభవ = నారాయణా {వినుతమంగళయశోవిభవుడు - స్తోత్రము చేయబడుతున్న శుభకరమైన కీర్తి యొక్క వైభవము కలవాడు, విష్ణువు}; సర్వేశ్వర = నారాయణా; ఇందిర = లక్ష్మీదేవి యొక్క; గుణ = గుణములను; సంగ్రహ = చక్కగగ్రహించెడి; ఇచ్చన్ = కోరిక; చేసి = వలన; ఏన్ = నేను; నీదు = నీ యొక్క; శివతరంబు = మిక్కిలిశుభప్రభమైనది {శివము - శివతరము - శివతమము}; ఐన = అయిన; సత్ = గొప్ప; కీర్తినిని = యశస్సును; అర్థిమై = పూని; వరియించెన్ = వరించెను; అట్టి = అటువంటి; కీర్తిన్ = కీర్తిని; కలిత = కలిగిన; సత్పురుష = మంచివారి; సంగమమున్ = కలియుట; కల్గుచున్ = కలుగుతూ; ఉండన్ = ఉండగా; ధృతిన్ = పూని; ఎవ్వడేని = ఎవరైనా; యాదృచ్చికతనున్ = తలవనితలంపుగా; కతనున్ = కారణము; చేసియున్ = వలనను; ఒకమాటు = ఒకమారు; చెవులార = చెవులనిండుగా; విన్నవాడు = వినినవాడు; అనయంబునున్ = అవశ్యము; గుణజ్ఞుడు = సుగుణములుకలవాడు; అయ్యెనేని = అయినచో.
విరతిన్ = అయిష్టతను; ఏ = ఏ; రీతిన్ = విధముగ; పొందునున్ = పొందును; ధరణిన్ = భూమిపైన; పశువున్ = జంతువు; తక్క = తప్పించి; తక్కిన = ఇతరమైన; తత్ = అది; జ్ఞుండున్ = తెలిసినవాడు; దనుజభేది = నారాయణా {దనుజభేది - దనుజ (రాక్షసులను) భేది (శత్రువు), విష్ణువు}; కాన = కనుక; ఉత్సుక = కుతూహలముగల; మతిని = బుద్దికలవాడను; ఐన = అయిన; ఏను = నేను; లక్ష్మి = లక్ష్మీదేవి; కరణి = వలె; నిన్నున్ = నిన్ను; భజింతున్ = సేవింతును; ఓ = ఓ; పరమపురుష = నారాయణా.
భావము:
సకల జగదీశ్వరియై మహనీయ మంగళ యశోమందిర అయిన ఇందిరాదేవి గుణగ్రహణ పారీణ బుద్ధితో కళ్యాణకరమైన నీ సత్కీర్తిని వరించింది. అటువంటి నీ యశోగాథలను సత్పురుషుల సహవాసం వల్ల ఒక్కసారి యాదృచ్ఛికంగానైనా సరే చెవులారా విన్నవాడు పశువు కాకుండా గుణజ్ఞుడైనట్లయితే అంతతో తృప్తి పొందక ఇంకా ఇంకా వినాలని కోరుకుంటాడు. కనుక ఓ పరమపురుషా! దనుజమర్దనా! నిన్ను నేను లక్ష్మీదేవి వలె సేవిస్తాను.