చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట
- ఉపకరణాలు:
ఘన మగు దేవ! యీ వరమె కాదు మహాత్మక వాగ్వినిర్గతం
బనఁదగు తావకీన చరణాంబుజ చారు మరందరూపమై
తనరిన కీర్తియున్ విని ముదంబును బొందఁగ లేని మోక్ష మై
నను మదిఁ గోర నొల్ల నఘనాశ! రమేశ! సరోజలోచనా!
టీకా:
ఘనము = గొప్పవాడవు; అగు = అయిన; దేవా = దేవుడా; ఈ = ఈ; వరమె = వరమే; కాదు = కాదు; మహాత్మక = మహాత్ముల యొక్క; వాక్ = నోటినుండి; వినిర్గతంబున్ = చక్కగ వెలువడినది; అనన్ = అనుటకు; తగు = తగిన; తావకీన = నీ యొక్క; చరణ = పాదములు అనెడి; అంబుజ = పద్మముల {అంబుజము - అంబువు (నీరు)యందు జము (పుట్టునది), పద్మము}; చారు = చక్కటి; మరంద = తేనె; రూపము = రూపము కలది; ఐ = అయ్యి; తనరిన = అతిశయించెడి; కీర్తియున్ = కీర్తిని; విని = వినుటచే; ముదంబునున్ = సంతోషమును; పొందగన్ = పొందుటకు; లేని = లేనట్టి; మోక్షము = ముక్తి; ఐనను = అయినప్పటికిని; మదిన్ = మనసులో; కోరన్ = కోరుటను; ఒల్లన్ = ఒప్పుకొనను; అఘనాశ = నారాయణా {అఘ నాశ - పాపమును నాశనముచేయువాడు, విష్ణువు}; రమేశ = నారాయణా {రమేశుడు - రమ (లక్ష్మీదేవి)కి ఈశుడు, విష్ణువు}; సరోజలోచనా = నారాయణా {సరోజ లోచనుడు - సరోజ (పద్మముల) వంటి కన్నులు కలవాడు, విష్ణువు}.
భావము:
దేవా! పాపహరణా! రమాపతీ! ఈ గొప్ప వరాన్నే కాదు, నీ పాదారవిందాల మకరందమై మహాత్ముల వాక్కులనుండి వెలువడే నీ కథాకీర్తనం విని ఆనందం పొందలేని మోక్షాన్ని కూడ నేను కోరుకొనను.