పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలమహాముని తపంబు

  •  
  •  
  •  

3-1051-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు కపిలోక్తమార్గంబున దేవహూతి శ్రీహరి యందుఁ గలసె; అయ్యంగనారత్నంబు మోక్షంబునకుం జనిన క్షేత్రంబు సిద్ధిపదం బను పేరం బరఁగి ప్రసిద్ధి వహించె; అంత నక్కడఁ గపిలుండు తల్లిచేత ననుజ్ఞాతుం డై సిద్ధ చారణ గంధర్వాప్సరో ముని నివహ సంస్తూయమానుం డగుచు; సముద్రునిచేత దత్తార్హణ పూజానికేతంబులు వడసి సాంఖ్యాచార్యాభిష్టుతం బగు యోగంబు నవలంబించి; లోకత్రయశాంతి కొఱకు సమాహితుండై; స్వపితాశ్రమంబు విడిచి యుదగ్భాగంబునకు జనియె"నని మైత్రేయమహాముని విదురున కిట్లనియె "తండ్రీ యీ యుపాఖ్యానంబు నాకు గోచరంచినరీతి నీకుం జెప్పితి; నిది "కపిల దేవహూతి సంవాదం"బత్యంత పావనంబు కపిల ప్రణీతంబు నయిన యోగంబు దీనిం బరమ భక్తియుక్తుండై యెవ్వండు పఠించు; నెవ్వండు విను; నట్టి పుణ్యాత్ములు విగతపాపులై గరుడధ్వజుండైన పుండరీకాక్షుని శ్రీచరణారవిందంబులం బొందుదు"రని మైత్రేయుండు విదురున కెఱింగించిన విధంబున శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె"నని సూతుండు సెప్పిన విని ప్రహృష్ట హృదయులై "మునికులోత్తమా! భవద్వాక్పూరం బగు భగవత్కథామృతంబు గ్రోలుచుండ మా మానసంబులు దనివోవ వింకను దరువాతి వృత్తాంతంబులు మాకు విశదంబులుగ వినిపింప నీవ యర్హుండ"వని యడుగుటయు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కపిల = కపిలునిచే; ఉక్త = చెప్పబడిన; మార్గంబునన్ = మార్గములో; దేవహూతి = దేవహూతి; శ్రీహరి = శ్రీహరి; అందున్ = అందు; కలసెన్ = కలసెను; ఆ = ఆ; అంగనా = స్త్రీలలో; రత్నంబు = రత్నము వంటిది; మోక్షంబున్ = మోక్షమున; కున్ = కు; చనినన్ = వెళ్ళిన; క్షేత్రంబు = క్షేత్రము; సిద్ధిపదంబున్ = సిద్ధిపదము; అను = అను; పేరన్ = పేరుతో; పరఁగి = తెలియబడుతూ; ప్రసిద్ధి = ప్రసిద్ధి; వహించెన్ = పొందెను; అంతన్ = అంతట; అక్కడ = అక్కడ; కపిలుండు = కపిలుడు; తల్లి = తల్లి; చేతనను = చేతను; జ్ఞాతుండు = తెలియబడినవాడు; ఐ = అయి; సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; గంధర్వ = గంధర్వులు; అప్సరస్ = అప్సర్సలు; ముని = మునుల; నివహ = సమూహములచే; సంస్తూయమానుండు = చక్కగా స్తుతింపబడువాడు; అగుచున్ = అవుతూ; సముద్రుని = సముద్రుని; చేతన్ = చేత; దత్త = ఒసగబడిన; అర్హణ = అర్చనలు; పూజా = పూజ యొక్క; నికేతంబులున్ = గుర్తులు; వడసి = పొంది; సాంఖ్యాచార్య = సాంఖ్యాచార్యులచే; అభిష్టుతంబున్ = స్తుతింపబడినది; అగు = అయిన; యోగంబున్ = యోగమును; అవలంబించి = అవలంబించి; లోకత్రయ = ముల్లోకముల; శాంతి = శాంతి; కొఱకున్ = కోసము; సమాహితుండు = నిష్ఠకు చెందినవాడు; ఐ = అయ్యి; స్వ = స్వంత; పితా = తండ్రి యొక్క; ఆశ్రమంబున్ = ఆశ్రమమును; విడిచి = వదలి; ఉత్ = ఉత్తర; భాగంబున్ = దిక్కున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అని = అని; మైత్రేయ = మైత్రేయుడు అను; మహా = గొప్ప; ముని = ముని; విదురునన్ = విదురుని; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; తండ్రీ = అయ్యా; ఈ = ఈ; ఉపాఖ్యానంబున్ = ఇతిహాసమును {ఉపాఖ్యానము - ఇతిహాసము, జరిగినదానికి సంబంధించిన కథనము}; నాకున్ = నాకు; గోచరించిన = అగపడిన; రీతిన్ = విథముగ; నీకున్ = నీకు; చెప్పితి = చెప్పితిని; ఇది = ఇది; కపిలదేవహూతిసంవాదంబున్ = కపిలదేవహూతిసంవాదంబు; అత్యంత = మిక్కిలి; పావనంబు = పవిత్రమైనది; కపిల = కపిలునిచే; ప్రణీతంబున్ = రచింపబడినది; అయిన = అయినట్టి; యోగంబున్ = యోగము; దీనిన్ = దీనిని; పరమ = ఉత్తమమైన; భక్తిన్ = భక్తితో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; ఎవ్వండున్ = ఎవరైతే; పఠించున్ = చదువునో; ఎవ్వండున్ = ఎవరైతే; వినున్ = వినునో; అట్టి = అటువంటి; పుణ్యాత్ములు = పుణ్యాత్ములు; విగత = తొలగిన; పాపులు = పాపములు కలవారు; ఐ = అయ్యి; గరుడధ్వజుండు = విష్ణువు {గరుడధ్వజుడు - గరుడధ్వజము కలవాడు, విష్ణువు, విష్ణుసహస్రనామాలు 354వ నామం}; ఐన = అయిన; పుండరీకాక్షుని = నారాయణుని {పుండరీకాక్షుడు - పుండరీకముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; శ్రీ = శుభకరమైన; చరణ = పాదములు అనెడి; అరవిందంబులన్ = పద్మములను; పొందుదురు = పొందెదరు; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురునన్ = విదురుని; కిన్ = కి; ఎఱింగించిన = తెలిపిన; విధంబునన్ = విధముగ; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నర = నరులకు; ఇంద్రునన్ = ప్రభువున; కున్ = కు; చెప్పెను = చెప్పెను; అని = అని; సూతుండు = సూతుడు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; ప్రహృష్ట = సంతోషింపజేయబడినట్టి; హృదయులు = హృదయములు కలవారు; ఐ = అయ్యి; ముని = మునుల; కుల = వంశములకు; ఉత్తమా = ఉత్తముడా; భవత్ = నీ యొక్క; వాక్ = పలుకుల; పూరంబున్ = ప్రవాహములు; అగు = అయిన; భవత్ = నీ యొక్క; కథా = కథలు అనెడి; అమృతంబున్ = అమృతమును; క్రోలుచున్ = ఆస్వాదించుచు; ఉండన్ = ఉండగా; మా = మా యొక్క; మానసంబులున్ = మనస్సులు; తనివిన్ = తృప్తిని; పోవవు = చెందవు; ఇంకన్ = ఇంకను; తరువాతి = తరవాతది అయిన; వృత్తాంతంబులున్ = వృత్తాంతములు; మాకున్ = మాకు; విశదంబుగన్ = వివరముగా; వినిపింపన్ = వినిపించుటకు; నీవ = నీవే; అర్హుండవు = తగినవాడవు; అని = అని; అడుగుటయున్ = అడిగిరి.

భావము:

ఈ విధంగా దేవహూతి కపిలుని ఉపదేశానుసారంగా విష్ణుదేవునిలో విలీనమైంది. ఆ సతీమతల్లి మోక్షాన్ని అందుకొన్న పవిత్ర క్షేత్రం ‘సిద్ధిపదం’ అనే పేరుతో ప్రసిద్ధమైంది. అక్కడ కపిలుడు కన్నతల్లి అనుజ్ఞ పొంది సిద్ధులు చారణులు గంధర్వులు అప్సరసలు మునులు చేసే వందనాలు అందుకుంటూ సముద్రతీరాన్ని చేరి సముద్రుడు సమర్పించిన కానుకలు, పూజలు గ్రహించి, సాంఖ్యాచారులచేత సంస్తూయమానమైన యోగమార్గాన్ని అవలంబించి, ముల్లోకాలకు శాంతిని ప్రసాదించడంకోసం తండ్రిగారి తపోవనాన్ని వదలి, నిశ్చల చిత్తంతో ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసాడు.” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు “నాయనా! ఈ ఉపాఖ్యానం నాకు తోచిన విధంగా నీకు చెప్పాను. ఈ ‘కపిల దేవహూతి సంవాదం’ అత్యంత పవిత్రమైంది. దీనినే కపిలప్రోక్తమైన యోగశాస్త్రం అంటారు. దీనిని భక్తితో పఠించిన, వినిన పుణ్యాత్ముల పాపాలు పటాపంచలౌతాయి. వారు గరుడధ్వజుడైన కమలాక్షుని శ్రీపాద కమలాలను చేరుకుంటారు.” అని ఈ ప్రకారంగా మైత్రేయుడు విదురునకు వివరించిన విషయాన్ని శుకమహర్షి పరీక్షిత్తునకు విశదీకరించాడని సూతుడు శౌనకాది మునులకు వెల్లడించాడు. ఈ వృత్తాంతం విన్న శౌనకాది మునీంద్రులు మనస్సులో సంతృప్తి చెంది “మునివర్యా! నీ వాక్ప్రవాహరూపమైన భగవత్కథా సుధారసం ఎంత త్రాగినా మా మనస్సులకు తృప్తి కలగటం లేదు. తనివి తీరేవిధంగా తరువాతి వృత్తాంతం వివరంగా వినిపించవలసిందిగా విన్నవించుకుంటున్నాము. అందుకు నీవే తగినవాడవు” అన్నారు.