పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల హరి స్తుతి

  •  
  •  
  •  

3-552-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మహిత యశోవిలాసగుణమండన! సర్వశరణ్య! యింద్రియ
స్పృహులకుఁ గానరాక యతసీ కుసుమద్యుతిఁ నొప్పుచున్న నీ
సహజ శరీర మిప్పుడు భృశంబుగఁ జూచి మదీయ దృక్కు లిం
దహహ కృతార్థతం బొరసె నచ్యుత! మ్రొక్కెద మాదరింపవే."

టీకా:

మహితయశోవిలాసగుణమండన = నారాయణ {మహిత యశో విలాస గుణ మండనుడు - గొప్ప కీర్తితో విరాజిల్లు గుణములతో ప్రసిద్ధమైనవాడు, విష్ణువు)}; సర్వశరణ్య = నారాయణ {సర్వశరణ్యుడు - సర్వలకును శరణ్యమైనవాడు, విష్ణువు}; ఇంద్రియ = ఇంద్రియము లందు; స్పృహులు = ఆసక్తి కలవారి; కున్ = కి; కానరాక = కనిపించక; అతసీ = నల్ల అవిసె; కుసుమ = పుష్పము; ద్యుతిన్ = కాంతితో; ఒప్పుచున్న = ఉన్నట్టి; నీ = నీ యొక్క; సహజ = సహజసిద్ధమైన; శరీరమున్ = శరీరమును; ఇప్పుడు = ఇప్పుడు; భృశంబుగన్ = బాగుగా; చూచి = చూసి; మదీయ = మా యొక్క; దృక్కులు = చూపులు; ఇందు = దీనిలో; అహహ = ఓహో; కృతార్థతన్ = సార్థక్యమును; పొరసెన్ = పొందినవి; అచ్యుత = నారాయణ {అచ్యుత - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; మ్రొక్కెదము = నమస్కరించెదము; ఆదరింపవే = ఆదరింపుము.

భావము:

మహనీయమైన కీర్తియొక్క విలాసంచేత ప్రకాశించే సుగుణాలు కలవాడా! అందరికీ ఆశ్రయింప దగినవాడా! అచ్యుతా! పంచేంద్రియాలకు లొంగినవారికి కనిపించక నల్ల అవిసె పూవుల కాంతితో ఒప్పే నీ సహజ స్వరూపాన్ని ఇప్పుడు మేము సంతృప్తిగా చూసి మా కన్నులు ధన్యతను పొందాయి. నీకు మ్రొక్కిన మమ్మల్ని ఆదరించు.