పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల హరి స్తుతి

  •  
  •  
  •  

3-551-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అలరు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ
తులసి పవిత్రమైనగతిఁ దోయజనాభ! భవత్కథాసుధా
కలితములైన వాక్కుల నకల్మషయుక్తిని విన్నఁ గర్ణముల్
విలసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా!

టీకా:

అలరు = శోభ యుక్తమైన; భవత్ = నీ యొక్క; పద = పాదములు అనెడి; అంబుజ = పద్మముల; యుగ = జంటకు; అర్పితము = అర్పింపబడినవి; ఐ = అయ్యి; పొలుపొందున్ = ఒప్పారే; అట్టి = అటువంటి; తులసి = తులసి; పవిత్రము = పవిత్రము; ఐన = అయిన; గతిన్ = విధముగ; తోయజనాభ = నారాయణ {తోయజ నాభుడు - తోయజము (నీటిలో పుట్టునది, పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; భవత్ = నీ యొక్క; కథా = కథలు అను; సుధా = అమృతముతో; కలితములు = కూడినవి; ఐన = అయినట్టి; వాక్కులన్ = పలుకులను; అకల్మష = దోషరహితమైన; యుక్తిన్ = విధముగ; విన్నన్ = విన్నచో; కర్ణముల్ = చెవులు; విలసిత = విలాసవంతమైన; లీలమై = లీలవలె; భువిన్ = భూమిపైన; పవిత్రముల్ = పవిత్రమైనవి; ఐ = అయ్యి; విలసిల్లు = విరాజిల్లును; మాధవా = నారాయణ.

భావము:

పద్మనాభా! మాధవా! నీ పాదపద్మాలపై సమర్పింపబడి అందాలు చిందే ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన మాటలను ఎటువంటి కల్మషం లేకుండా విన్నట్టి మా చెవులు పవిత్రాలై విలసిల్లుతాయి.