తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి
- ఉపకరణాలు:
సలలిత వేదశాస్త్రమయ సౌకరమూర్తిఁ దనర్చుచున్ రసా
తలమున నుండి వెల్వడు నుదారత మేను విదుర్పఁ దత్సటో
చ్ఛలితము లైన బిందువుల సాధు తపోజన సత్యలోక వా
సుల మగు మేము దోఁగి పరిశుద్ధి వహించితి మయ్య; మాధవా!
టీకా:
సలలిత = గాయత్రీమంత్రము తోకూడిన, మనోజ్ఞము కలిగిన; వేద = వేదములు; శాస్త్ర = శాస్త్రములుతో; మయ = నిండిన; సౌకర = సౌకర్యమైన, వరాహము యొక్క; మూర్తిన్ = స్వరూపముతో; తనర్చుచున్ = వ్యాపించుతూ; రసాతలమునన్ = రసాతలము {రసాతలము - పాతాళాది సప్త అధోలోకములు యందలి ఒక లోకము}; నుండి = నుండి; వెల్వడున్ = బయటకు వచ్చు; ఉదారతన్ = వేగములో; మేను = శరీరము; విదుర్పన్ = విదిలించగా; తత్ = ఆ; సటన్ = జూలు నుండి; ఉచ్ఛలితములు = చిందుతున్నవి; ఐన = అయిన; బిందువులన్ = నీటి తుప్పరల వలన; సాధు = సాధులోకము; తపో = తపోలోకము; జన = జనలోకము; సత్య = సత్యలోకము; లోకవాసులము = లోకముల ఉండు వారము; అగు = అయిన; మేము = మేము; తోగి = మునిగి; పరిశుద్ధి = పరిశుద్ధిని; వహించితిమి = పొందితిమి; అయ్య = తండ్రి; మాధవా = విష్ణుమూర్తి {మాధవుడు - మానసములకు ధవుడు (ప్రభువు), విష్ణువు}.
భావము:
ఓ మాధవా! విష్ణుమూర్తీ! ఆహ్లాదంతో వేదశాస్ర స్వరూపమైన ఆదివరాహమూర్తివైన నీవు పాతాళంనుండి బయటికి వస్తూ సముద్రజలాలతో తడిచిన నీ శరీరాన్ని విదిలించావు. ఆ సమయంలో నీ మెడమీది జూలు నుండి నీటి చుక్కలు నలుదెసలా చిందాయి. పరమ పవిత్రా లయిన ఆ జల బిందువులలో తడిసి తపోలోకంలో, జనలోకంలో, సత్యలోకంలో, నివసించే మేమంతా ఎంతగానో పరిశుద్ధులము అయ్యాము.