పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-433-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తలఁప రసాతలాంతరగతక్షితిఁ గ్రమ్మఱ నిల్పినట్టి నీ
కలితన మెన్న విస్మయము గాదు సమస్త జగత్తు లోలి మై
గలుగఁగఁ జేయు టద్భుతము గాక మహోన్నతి నీ వొనర్చు పెం
పలరిన కార్యముల్ నడప నన్యులకుం దరమే? రమేశ్వరా!

టీకా:

తలపన్ = విచారించిన; రసాతల = రసాతలము; అంతర = లోపల; గతన్ = పడినదియైన; క్షితిన్ = భూమండలమును; క్రమ్మఱన్ = మరల; నిల్పిన = నిలబెట్టిన; అట్టి = అటువంటి; నీ = నీ; కలితనము = నేర్పరితనము; ఎన్నన్ = ఎంచుటకు; విస్మయము = ఆశ్చర్యము; కాదు = కాదు; సమస్త = సమస్తమైన; జగత్తులు = భువనములును; ఓలి = క్రమ; మై = తో; కలుగన్ = సృష్టి; చేయుట = చేయుటలును; అద్భుతము = ఆశ్చర్యకరము; కాకన్ = అగునట్లు; మహా = మిక్కిలి; ఉన్నతిన్ = గొప్పతనముతో; నీవు = నీవు; ఒనర్చు = ఆచరించు, చేయు; పెంపు = విస్తృతిని; అలరిన = చెందిన; కార్యముల్ = పనులు; నడపన్ = చేయుటకు; అన్యుల్ = ఇతరుల; కున్ = కు; తరమే = తరమా ఏమి; రమేశ్వరా = విష్ణుమూర్తి {రమేశ్వరుడు - రమ (లక్ష్మీదేవి) ఈశ్వరుడు (భర్త), విష్ణువు}.

భావము:

శ్రీవల్లభా! వాస్తవంగా ఆలోచిస్తే సమస్త లోకాలను క్రమానుసారంగా సృష్టించడ మన్నది, అత్యద్భుతమైన విషయం. అటువంటి శక్తి ముందు పాతాళంలో ఉన్న భూమిని యథాస్థితికి తెచ్చి నిలిపిన ఈ నీ సామర్ధ్యం ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఇటువంటి మహా కార్యాలు నిర్వహించటానికి నీవే సమర్ధుడవు. ఇతరులకు ఈ కృత్యాలు అసాధ్యాలు.