పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-431-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తురామ్నాయ వపుర్విశేష ధర! చంత్సూకరాకార! నీ
సి దంష్ట్రాగ్ర విలగ్నమై ధరణి రాజిల్లెం గులాద్రీంద్ర రా
శృంగోపరిలగ్న మేఘము గతిం జాలం దగెన్ సజ్జనాం
చి హృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా!

టీకా:

చతురామ్నాయవపుర్విశేషధర = భగవంతుడా {చతురామ్నాయవపుర్విశేషధరుడు - చతుర (నాలుగు) ఆమ్నాయ (వేదము)లను వపుర్ (శరీర) విశేష (ప్రత్యేకతలు) వలె ధర (ధరించిన వాడు), విష్ణువు}; చంచత్సూకరాకార = భగవంతుడా {చంచత్సూకరాకారుడు - చంచత్ (చలిస్తున్న) సూకర (వరాహ) ఆకార (స్వరూపము) కలవాడు, విష్ణువు}; నీ = నీ యొక్క; సిత = తెల్లని; దంష్ట్ర = కోరల; అగ్ర = చివర; విలగ్నము = చక్కగ తగలుకొని ఉన్నది; ఐ = అయిన; ధరణి = భూమండలము; రాజిల్లెన్ = విరాజిల్లెను; కులాద్రి = కులపర్వతములలో {కులాద్రీంద్రము - కులపర్వతములలో శ్రేష్ఠమైనది, కైలాస పర్వతము}; ఇంద్ర = శ్రేష్ఠునియొక్క; రాజిత = వెండి; శృంగ = శిఖరము; ఉపరి = పైన; లగ్న = చిక్కుకొన్న; మేఘము = మేఘము; గతిన్ = వలె; చాలన్ = మిక్కిలి; తగెన్ = తగి ఉన్నది; సత్ = మంచి; జన = వారి; అంచిత = పూజనీయమైన; హృత్ = హృదయములు అను; పల్వల = నీటిగుంటలలో; లోల = విహరించువాడ; భూరమణ = విష్ణుమూర్తి {భూరమణ - భూదేవికి రమణుడు (భర్త), విష్ణువు}; లక్ష్మీనాథ = విష్ణుమూర్తి {లక్ష్మీనాథుడు - లక్ష్మీపతి, విష్ణువు}; దేవోత్తమ = విష్ణుమూర్తి {దేవోత్తముడు - దేవతలలో ఉత్తముడు, విష్ణువు}.

భావము:

చతుర్వేద స్వరూపమైన శరీరాన్ని ధరించి ఉన్న ఓ యజ్ఞవరాహా! నీవు జ్ఞానవంతుల అంతరంగాలనే నీటి మడుగులలో క్రీడిస్తూ ఉంటావు. భూదేవికి, శ్రీదేవికి మనోహారుడవు. దేవతలందరికి అగ్రేసరుడవు. నీ తెల్లని కోరల చివర తగులుకున్న భూమి కొండల చక్రవర్తి కైలాస పర్వతం వెండి శిఖరాన విరాజిల్లుతూ ఉండే, నీలమేఘంలా అందాలు చిందుతూ ఉంది.