తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి
- ఉపకరణాలు:
వెండియు "ముహుర్ముహుర్భవ దావిర్భావంబు దీక్షణీయేష్టి యగు; నీదు దంష్ట్రలు ప్రాయణీయం బను దీక్షానంతరేష్టియు, నుదయనీయం బను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు ప్రాతస్సవనాదులు; నీదు త్వజ్మాంసాది సప్తధాతువు లగ్నిష్ఠోమాతిగ్నిష్ఠోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబు లను సంస్థాభేదంబులును, ద్వాదశాహాదిరూపంబులైన బహు యాగ సంఘాత రూపంబులు నగు; సర్వసత్త్రంబులు భవదీయ శరీరసంధులు; ససోమాసోమంబు లగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును నీవు యజనబంధనంబులచే నొప్పుచుందువు; అదియునుం గాక.
టీకా:
వెండియున్ = ఇంకనూ; ముహుర్ = మరల; ముహుర్ = మరల; భవత్ = నీ యొక్క; ఆవిర్భావంబున్ = ఉద్భవించుట, అవతరించుట; దీక్షణీయేష్టి = యజ్ఞ దీక్ష ప్రారంభ ఇష్టి; అగున్ = అగును; నీదు = నీ యొక్క; దంష్ట్రలు = కోరలు; ప్రాయణీయంబు = ప్రాయణీయము; అను = అను; దీక్ష = దీక్ష; అనంతర = అయిన తరువాత చేయు; ఇష్టియును = యాగములును; ఉదయనీయంబు = ఉదయనీయము; అను = అను; సమాప్త = యజ్ఞ సమాప్తమున చేయు యాగము; ఇష్టియున్ = యాగములును; ఉష్మత్ = నీ యొక్క; రేతంబున్ = రేతస్సు; సోమంబును = సోమరసమును {సోమము -వ్యు. (షూ-నూ(-ప్రనవే – ప్రేరణే), షు-ను(-అభిషవే) సూ – ను + మన్) కృ. ప్ర., యఙ్ఞార్థమైన రసము నొసగునది, ప్రేరకమైనది (ఆంధ్రశబ్దరత్నాకరము), సోమరసము}; త్వదీయ = నీ యొక్క; అవస్థానంబున్ = ఉనికి, నిలబడుట; ప్రాతః = ఉదయము చేయు; సవన = యాగము; ఆదులు = మొదలగునవి; నీదు = నీ యొక్క; త్వక్ = చర్మము; మాంస = మాంసము; ఆది = మొదలగు; సప్తధాతువులున్ = సప్తధాతువులు {సప్తధాతువులు - వసాదులు (వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు) - రోమాది (రోమ, త్వక్, మాంస, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు)}; అగ్నిష్ఠోమ = అగ్నిష్ఠోమము {అగ్నిష్ఠోమము - వసంత కాలమున ఐదు దినములలో చేయు యాగవిశేషము}; అతి + అగ్నిష్ఠోమ = అత్యగ్నిష్ఠోమము;; ఉక్థ్య = ఉక్థ్యము; షోడశీ = షోడశీయము; వాజపేయ = వాజపేయము; అతిరాత్ర = అతిరాత్రము; ఆప్తోర్యామంబులు = ఆప్తోర్యామములు; అను = అను; సంస్థా = యజ్ఞముల విధానములలోని; భేదంబులునున్ = భేదములు, రకములు; ద్వాదశాహ = ద్వాదశాహము {ద్వాదశాహము - ద్వాదశ (పన్నెండు) అహములు (పగళ్ళు) చేయు ఒక విధమైన యాగము}; ఆది = మొదలగు; రూపంబులున్ = రకములు; ఐన = అయిన; బహు = చాలా రకములైన; యాగ = యాగముల; సంఘాత = విశేషములైన; రూపంబులున్ = రూపములు; అగున్ = అగును; సర్వ = సర్వమైన; సత్త్రంబులున్ = సత్రయాగములు {సత్రములు - సత్రయాగములు - 13 మొదలు 100 దినముల వరకు జరుగు యాగములు}; భవదీయ = నీ యొక్క; శరీర = శరీరమందలి; సంధులు = కీళ్ళు; ససోమ = సోమరసముతో కూడినవి; అసోమంబులు = సోమరసము లేనివియును; అగు = అయిన; యజ్ఞ = యాగముల; క్రతువులు = యజ్ఞవిధానములు; నీవ = నీవే; మఱియున్ = ఇంకనూ; నీవు = నీవు; యజన = యజ్ఞములు అను; బంధనంబులన్ = బంధములు; చేన్ = చేత; ఒప్పుచున్ = చక్కగా; ఉందువు = ఉంటావు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:
అంతేకాక భగవంతుడవైన నీవు మళ్ళీమళ్ళీ ఆవిర్భవించటం “దీక్షణీయ” మనే యజ్ఞము; నీ కోరలు “ప్రాయణీయ” మనే దీక్షానంతరం జరిపే ఇష్టి, “ఉదయనీయం” అనే సమాప్తేష్టి; సోమరసం నీ రేతస్సు; నీ ఉనికియే ప్రాతఃకాలం, మధ్యాహ్నం, సాయం సమయం అనే మూడు యజ్ఞాంశలు. నీ చర్మం మాంసం మొదలైన సప్తధాతువులూ అగ్నిష్ఠోమం, ఉర్ధ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం, ద్వాదశాహం మొదలైన యజ్ఞ భేదాలు; సమస్త యజ్ఞాలు నీ శరీర సంధులు; సోమంతో కూడినవీ, కూడనివి అయిన క్రతువులన్నీ నీవే; నీవే యజ్ఞ బంధాలతో అలరారుతూ ఉంటావు.