తృతీయ స్కంధము : భూమ్యుద్ధరణంబు
- ఉపకరణాలు:
కఠిన సటాచ్ఛటోత్కట జాత వాత ని-
ర్ధూత జీమూత సంఘాత మగుచు
క్షురనిభ సునిశిత ఖురపుటాహత చల-
త్ఫణిరాజ దిగ్గజ ప్రచయ మగుచుఁ
జండ దంష్ట్రోత్థ వైశ్వాన రార్చిస్రవ-
ద్రజత హేమాద్రి విస్రంభ మగుచు
ఘోర గంభీర ఘుర్ఘుర భూరినిస్వన-
పంకి లాఖిల వార్ధి సంకులముగఁ
- ఉపకరణాలు:
బొరలుఁ గెరలు నటించు నంబరము దెరల
రొప్పు నుప్పర మెగయును గొప్పరించు
ముట్టె బిగియించు ముసముస మూరుకొనుచు
నడరు సంరక్షితక్షోణి యజ్ఞఘోణి.
టీకా:
కఠిన = బిరుసైన; సటా = జూలు; ఛటా = వరుసలుచే; ఉత్కట = అధికంగా, భయంకరంగా; జాత = పుట్టిన; వాత = గాలివేగమువలన; నిర్ధూత = ఎగురగొట్టబడిన; జీమూత = మేఘములతో; సంఘాతము = ఘర్షణలు కలది; అగుచున్ = అవుతూ; క్షుర = క్షురకుని కత్తి, మంగలికత్తి; నిభ = వలె; సునిశిత = మిక్కిలి వాడియైన; ఖుర = గిట్టల; పుట = గతులచే; ఆహత = కొట్టబడిన; చలత్ = చలించుచున్న; ఫణిరాజ = ఆదిశేషుడు {ఫణిరాజు - సర్పములకు రాజు, ఆదిశేషుడు (భూమిని మోయుచున్న వాడు)}; దిగ్గజ = దిగ్గజముల {దిగ్గజములు - అష్టదిగ్గజములు, భూమి మోయు చుండు దిక్కులందలి ఎనిమిది (8) ఏనుగులు, 1 ఐరావతము 2 పుండరీకము 3 వామనము 4 కుముదము 5 అండనము 6 పుష్పదంతము 7 సార్వభౌమము 8 సుప్రతీకము}; ప్రచయము = సమూహములు కలది; అగుచున్ = అవుతూ; చండ = భయంకరమైన; దంష్ట్రా = కోరలచే; ఉత్థ = ఉత్పన్నమైన; వైశ్వానర = అగ్నిహోత్రుని; అర్చిస్ = తేజస్సులచే, మంటలచే; స్రవ = కరుగుతున్న; రజత్ = కైలాస {రజతాద్రి - వెండి కొండ, కైలాస పర్వతము}; హేమ = మేరు {హేమాద్రి - బంగారు కొండ, మేరు పర్వతము}; అద్రి = పర్వతములకు; విసంభ్రము = మిక్కిలి ఆశ్చర్యము; అగుచున్ = అవుతూ; ఘోర = భయంకరమైన; గంభీర = గంభీరమైన; ఘుర్ఘుర = గురగుర అని; భూరి = అతిపెద్ద; నిస్వన = ధ్వనిచేత; పంకిల = బురదైపోయిన; అఖిల = సమస్తమైన; వారధిన్ = సముద్రము; సంకులముగన్ = వ్యాకులమగునట్లు; పొరలున్ = పొర్లును; కెరలున్ = కెలుకును; నటించున్ = గంతులేయును; అంబరము = ఆకాశము; తెరలన్ = కలిగిపోయేలా; రొప్పున్ = రొప్పును {రొప్పుట - గట్టిగా ఆయాసము వలె శబ్దము చేస్తూ ఊపిరి తీయుట}; ఉప్పరమున్ = ఆకాశమునకు; ఎగయున్ = ఎగురును; గొప్పరించున్ = నేల మెడ్డగించును; ముట్టె = ముట్టి; బిగియించి = బిగించి; ముసముస = చిఱచిఱలాడు కోపముతో; మూరుకొనుచున్ = వాసనచూసును; అడరు = అతిశయించునట్టి; సంరక్షిత = బాగుగా రక్షింపబడిన; క్షోణి = భూదేవి కలది; యజ్ఞఘోణి = యజ్ఞవరాహము.
భావము:
భూమిని రక్షించు ఆ యజ్ఞవరాహం కర్కశమైన తన మెడమీది జూలు విదిల్చింది. అప్పుడు పుట్టిన వాయువేగానికి మేఘమండలమంతా చెల్లాచెదరై పోయింది. చురకత్తితో సాటిరాగల మిక్కిలివాడియైన ఆ వరాహమూర్తి గిట్టల కొనల తాకిడులకు, భూమండలానికి అడుగున ఉన్న ఆదిశేషుడు, దిగ్గజాలు, తల్లడిల్లి పోయారు. ఆ యజ్ఞవరాహం కఠోరాలైన కరకు కోరల రాపిడివల్ల పుట్టిన అగ్నిజ్వాలలకు, వెండికొండ కైలాశమూ, బంగారుకొండ మేరువూ, కరగి ద్రవించిపోతాయేమో అనిపించింది. ఆ మహావరాహం భయంకరమూ, గంభీరమూ అయిన తన ఘుర్ఝరారావంవల్ల సముద్రాలన్నీ, అల్లకల్లోలం అయ్యేటట్లు చేస్తున్నది. ఈవిధంగా ఆ ఆదివరాహం పొరలుతూ పొంగుతూ సంతోషంతో గంతులువేస్తూ. రొప్పుతూ, ఆకాశానికి ఎగురుతూ, విజృంభిస్తూ, మూతి బిగిస్తూ, కోపంతో ముసముస అంటూ నేలను మూచూస్తూ, ఇలా అనేక విధాలుగా తిరుగుతూ, చెలరేగుతూ ఉంది.
- ఉపకరణాలు:
మఱియు నయ్యజ్ఞవరాహంబు.
టీకా:
మఱియున్ = ఇంకనూ; ఆ = ఆ; యజ్ఞవరాహము = యజ్ఞవరాహము.
భావము:
అంతేకాకుండా ఆ యజ్ఞవరాహం
- ఉపకరణాలు:
తివిరి చతుర్దశ భువనంబులను దొంతు-
లొరగఁ గొమ్ములఁ జిమ్ము నొక్కమాటు
పుత్తడికొండ మూఁపురమను నొరగంట-
నుఱుముగా రాపాడు నొక్కమాటు
ఖురముల సప్తసాగరములఁ రొంపిగా-
నుక్కించి మట్టాఁడు నొక్కమాటు
నాభీల వాలవాతా హతిచే మింటి-
నొరసి బ్రద్దలుసేయు నొక్కమాటు
- ఉపకరణాలు:
గన్నుఁ గొనలను విస్ఫులింగములుసెదర
నురుభయంకర గతిఁ దోఁచు నొక్కమాటు
పరమయోగీంద్రజన సేవ్య భవ్యవిభవ
యోగ్య మై కానఁగా నగు నొక్కమాటు.
టీకా:
తివిరి = పూనుకొని; చతుర్దశ = పద్నాలుగు; భువనంబులన్ = లోకములను; దొంతులు = దొంతరలు; ఒరగన్ = చెదురునట్లు; కొమ్ములన్ = కొమ్ములతో; చిమ్మును = చిమ్మును; ఒక్క = ఒక; మాటు = మారు; పుత్తడికొండ = మేరుపర్వతమును; మూపురమ = వీపు; అను=అనెడి; ఒరగంటిన్ = బంగారము వన్నె చూపు రాయిచే; ఉఱుముగా = గర్జనలా; రాపాడున్ = రుద్దుతుంది; ఒక్క = ఒక; మాటు = మారు; ఖురములన్ = గిట్టలతో; సప్త = ఏడు (7); సాగరములన్ = సముద్రములను; రొంపి = బురద; కాన్ = అగునట్లు; ఉక్కించి = తొక్కి; మట్టాడున్ = సంచరించును, నడచును; ఒక్క = ఒక; మాటు = మారు; ఆభీల = భయంకరమైన; వాలా = తోకతో; హతి = కొట్టుట; చేన్ = చేత; మింటిన్ = ఆకాశమును; ఒరసి = రాపాడిస్తూ; బద్దలు = బద్దలు; చేయున్ = కొట్టును; ఒక్క = ఒక; మాటు = మారు; కన్నున్ = కన్నుల; కొనలన్ = కొసలనుండి;
విస్ఫు = నిప్పు; లింగములున్ = కణికలు; చెదరన్ = ఎగరగా; ఉరు = మిక్కిలి; భయంకర = భయంకరమైన; గతిన్ = విధముగా; తోచున్ = కనిపించును; ఒక్క = ఒక; మాటు = మారు; పరమ = అత్యుత్తమ; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠ; జన = జనులచేత; సేవ్య = సేవింబడు; భవ్య = శుభకరమైన; భవ = వైభవమునకు; యోగ్యము = తగినది; ఐ = అయ్యి; కానగన్ = కనబడుతూ; అగున్ = ఉండును; ఒక్క = ఒక; మాటు = మారు.
భావము:
ఆ యజ్ఞవరాహం ఒకసారి పద్నాలుగు భువనాలూ, దొంతరలు దొంతరలుగా దొర్లి పడిపోయేలా కొమ్ములతో చిమ్ముతుంది. మరోసారి తన మూపురమనే నూరే రాయితో పసిడి కాంతులు, ప్రసరించేలా మేరుపర్వతాన్ని రుద్దుతుంది. ఇంకోసారి సప్తసముద్రాల జలాలు బురదలై పోయేలా ఎగిరి గంతులువేస్తూ తిరుగుతుంది. వేరొకసారి మిక్కిలి భయంకరంగా తోకను తిప్పడంవల్ల పుట్టిన గాలితాకిడికి, ఆకాశం దద్ధరిల్లి బ్రద్దలయ్యేటట్లు చేస్తుంది. ఒక్కొక్క మాటు కనుగొనకుల్లో అగ్నికణాలు కురిపిస్తూ, మహా భయంకరంగా కనిపిస్తుంది. ఇంకో మాటు మహా యోగులకు సేవ్యమైన భవ్య దివ్య వైభవంతో శోభిల్లుతుంది.
- ఉపకరణాలు:
ఇట్లు విహరించుచుఁ బ్రాతర్మధ్యందిన తృతీయసవనరూపుం డైన యజ్ఞవరాహమూర్తి యగు సర్వేశ్వరుండు మహాప్రళయంబు నందు యోగనిద్రా వివశుం డై యుండు నవసరంబున నుదకస్థం బైన భూమి రసాతలగతం బైన; దాని నుద్ధరించుటకు సముద్రోదరంబుఁ దరియం జొచ్చు వేగంబు సైరింపంజాలక, సముద్రుం డూర్ము లను భుజంబు లెత్తి వికీర్ణహృదయుం డై యార్తుని పగిది "యజ్ఞవరాహ నన్ను రక్షింపు రక్షింపు" మని యాక్రోశింప; నిశిత కరాళ క్షుర తీక్ష్ణంబు లైన ఖురాగ్రంబుల జలంబులు విచ్ఛిన్నంబులు గావించి యపారం బయిన రసాతలంబుఁ బ్రవేశించి భూమిం బొడగను నవసరంబున.
టీకా:
ఇట్లు = ఈవిధముగా; విహరించుచున్ = తిరుగుతూ; ప్రాతః = ఉదయము; మధ్యందిన = మధ్యాహ్నము; తృతీయ = మూడవది, సాయంకాలము చేయు; సవన = వేదస్తోత్రముల; రూపుడు = రూపము కలవాడు; ఐన = అయిన; యజ్ఞవరాహ = యాగవరాహ; మూర్తిన్ = స్వరూపము; అగు = అయిన; సర్వేశ్వరుండు = భగవంతుడు {సర్వేశ్వరుడు - సర్వమునకును ఈశ్వరుడు, విష్ణువు}; మహాప్రళయంబున్ = మహాప్రళయము; అందున్ = సమయములో; యోగనిద్రా = యోగనిద్రకు; వివశుడు = వశుడు; ఐ = అయి; ఉండు = ఉండే; అవసరంబునన్ = సమయములో; ఉదకస్థంబు = నీటిపైన ఉండునది; ఐన = అయిన; భూమి = భూమి; రసాతల = రసాతలమునకు; గతంబున్ = వెళ్ళినది; ఐన = అయిన; దానిని = దానిని; ఉద్ధరించుట = పైకెత్తుట; కున్ = కు; సముద్ర = సముద్రము యొక్క; ఉదరము = గర్భమున; తరియన్ = మధించుటకు; చొచ్చు = చొరబడు; వేగంబున్ = వేగమును; సైరింపన్ = సహింపను; చాలక = లేక; సముద్రుండు = సముద్రుడు; ఊర్ములు = అలలు; అను = అను; భుజంబులున్ = భుజములను; ఎత్తి = ఎత్తి; వికీర్ణ = చెదరిన; హృదయుండు = మనసు కలవాడు; ఐ = అయి; ఆర్తుని = బాధపడుతున్న వాని; పగిదిన్ = వలె; యజ్ఞవరాహ = యజ్ఞవరాహ; నన్నున్ = నన్ను; రక్షింపు = రక్షింపుము; రక్షింపుము = రక్షింపుము; అని = అని; ఆక్రోశింపన్ = ఆక్రోశిస్తుండగా; నిశిత = మొనదేలిన; కరాళ = కఠినమైన; క్షుర = క్షరుకుని కత్తివలె; తీక్షణంబులు = వాడియైన; ఐన = అయిన; ఖుర = గిట్టల; అగ్రంబులన్ = అంచులతో; జలంబులు = నీటిని; విచ్చిన్నంబున్ = ఛేదింపబడు నట్లు; కావించి = చేసి; అపారంబున్ = అంతులేనిది; అయిన = అయిన; రసాతలంబున్ = రసాతలమున; ప్రవేశించి = చొచ్చి; భూమిన్ = భూమిని; పొడగను = చూసెడి; అవసరంబునన్ = సమయములో.
భావము:
ఆవిధంగా విహరిస్తూ, ఉదయము మధ్యాహ్నమూ, సాయంకాలమూ చేసే యజ్ఞము యొక్క స్వరూపము కలవాడు, యజ్ఞవరాహరూపం ధరించిన ఆ మహావిష్ణువు మహా ప్రళయ కాలంలో తాను నిద్రలో ఉన్నప్పుడు జలంలో నున్న భూమి రసాతలంలోకి చేరిన దానిని ఉద్దరించటానికై, సముద్రంలో ప్రవేశించాడు. ఆ వేగానికి సముద్రుడు అల్లకల్లోలమైన మనస్సుతో అలలు అనే చేతులు పైకెత్తి యజ్ఞవరాహా! నన్ను రక్షించు రక్షించు అని వేడుకున్నాడు. ఆ వరాహమూర్తి తన వాడి యైన, వంకరలు తిరిగిన కత్తులవంటి గిట్టల కొనలతో సముద్రజలాలను చెల్లాచెదురు చేస్తూ పాతాళం లోపలికి దూసుకొని పోయి అక్కడ భూమిని చూశాడు.
- ఉపకరణాలు:
శరనిధిలోన మహోగ్రా
మరకంటకుఁ డెదురఁ గాంచె మఖమయగాత్రిన్
ఖురవిదళితకులగోత్రిన్
ధరణికళత్రిన్ గవేషధాత్రిన్ పోత్రిన్.
టీకా:
శరనిధి = సముద్రము; లోనన్ = లోపల; మహా = గొప్ప; ఉగ్ర = భయంకరమైన; అమరకంటకుడు = రాక్షసుడు {అమరకంటకుడు - అమరులు (దేవతలు) కు కంటకుడు (శత్రువు), రాక్షసుడు}; ఎదురన్ = ఎదురుగా; కాంచెన్ = చూసెను; మఖ = యజ్ఞముతో; మయ = నిండిన; గాత్రిన్ = శరీరము కలదానిని; ఖుర = గిట్టలచే; విదళిత = మిక్కిలి ఖండింపబడిన; కులగోత్రిన్ = కులపర్వతములు కలదానిని; ధరణీ = భూదేవిని; కళత్రిన్ = భార్యగా కలదానిని; గవేష = వెదకుబడుతున్న; ధాత్రిన్ = భూమండలము కలదానిని; పోత్రిన్ = వరాహమును.
భావము:
ఆ సమయంలో సముద్రంలో దాగి వున్న ఒక భయంకర రాక్షసుడు హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. ఆ క్రూర దానవుడు కులపర్వాతాలను గిట్టలతో పగులకొట్టేది. భూమిని ప్రియురాలుగా గ్రహించినదీ, భూమండలాన్ని వెదుకుతూ ఉన్నదీ, యజ్ఞమయ మైన శరీరం కలదీ అయిన ఆ వరాహాన్ని తన ఎదుట దర్శించాడు.
- ఉపకరణాలు:
ఇట్లు పొడగని దైత్యుండు రోషభీషణాకారు డై.
టీకా:
ఇట్లు = ఈవిధముగా; పొడగని = చూసి; దైత్యుండు = రాక్షసుడు {దైత్యుడు- దితి యొక్క సంతానము, రాక్షసులు}; రోష = రోషముతో; భీషణ = భయంకరమైన; ఆకారుడు = ఆకారము కలవాడు; ఐ = అయి.
భావము:
అలా చూసీ చూడగానే వాడికి ఆగ్రహం వచ్చింది. రోషంతో భీకరమైన ఆకారం కలవాడు అయ్యాడు.
- ఉపకరణాలు:
గద సారించి యసహ్యవిక్రమ సమగ్రస్ఫూర్తిచే వేయఁగా
నది దప్పించి వరాహమూర్తి నిజదంష్ట్రాగ్రాహతిం ద్రుంచెఁ బెం
పొదవం గ్రోధమదాతిరేక బలశౌర్యోదార విస్తార సం
పదఁ బంచాస్యము సామజేంద్రుఁ జల మొప్పం ద్రుంచు చందంబునన్.
టీకా:
గదన్ = గదను; సారించి = సాచి; అసహ్య = సహింపరాని; విక్రమ = పరాక్రమముతో కూడిన; సమగ్ర = పూర్తి; స్ఫూర్తిన్ = బలము; చేన్ = తోటి; వేయగాన్ = దెబ్బవేయగా; అది = దానిని; తప్పించి = తప్పించి; వరాహమూర్తి = భగవంతుడు {వరాహమూర్తి - ఆదివరాహ రూపములో ఉన్నవాడు, విష్ణువు}; నిజ = తన; దంష్ట్రా = కోరల; అగ్రా = కొనలతో; ఆహతిన్ = పొడుచుటవలన; త్రుంచెన్ = సంహరించెను; పెంపొదవన్ = పెరిగిపోయిన; క్రోధ = క్రోధము; మద = మదములు; అతిరేక = అతిశయించిన; బల = బలము; శౌర్య = శౌర్యముల; ఉదార = మిక్కిలి; విస్తార = విజృంభించిన; సంపదన్ = సంపదలతో; పంచాస్యము = సింహము {పంచాస్యము - తెరచిననోరు గల మృగము, తెఱనోటిమెకము సింహము}; సామజ = ఏనుగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; చలము = ఊపు; ఒప్పన్ = ఒప్పునట్లు; త్రుంచు = చీల్చిచెండాడు; చందంబునన్ = విధముగా.
భావము:
ఆ రాక్షసుడు హిరణ్యాక్షుడు సహింపరాని మహా శౌర్యంతో గిరగిరా గద త్రిప్పి వేశాడు. వరాహమూర్తి అది తప్పించుకున్నాడు. క్రోధంతో, గర్వంతో, అపారమైన పరాక్రమంతో విజృంభించిన మృగరాజు గజరాజును మట్టుపెట్టినట్లు ఆ వరాహమూర్తి తన వాడి కోరల అంచులతో వాడిని విదలించి తుదముట్టించాడు.
- ఉపకరణాలు:
దితిజాధీశుని నీ గతిం దునిమి యుద్వృత్తిం దదీయాంగ శో
ణితపంకాంకిత గండభాగుఁ డగుచున్విష్ణుండు దా నొప్పె వి
స్తృత సంధ్యాంబుద ధాతుచిత్రిత సముద్ధీప్తక్షమాభృద్గతిన్
క్షితిఁ దంష్ట్రాగ్రమునన్ ధరించి జలరాశిం బాసి యేతేరఁగన్.
టీకా:
దితిజ = దైత్యుల యొక్క {దితిజ - దితికి పుట్టినవారు, దైత్యులు}; అధీశునిన్ = ప్రభువును; ఈ = ఈ; గతిన్ = విధముగా; తునిమి = సంహరించి; ఉదత్ = ఉద్రేకించిన; వృత్తిన్ = ప్రవర్తనలతో; తదీయ = అతని; అంగ = శరీరము నందలి; శోణిత = రక్తము అను; పంక = బురద; అంకిత = అంటిన; గండభాగుండు = చెక్కిళ్ళు కలవాడు; అగుచున్ = అవతూ; విష్ణుండు = విష్ణుమూర్తి; తాన్ = తాను; ఒప్పెన్ = చక్కగా కనిపించెను; విస్త్రుత = విస్తరించిన; సంధ్యా = సంధ్యాకాలపు; అంబుద = మేఘములతోను {అంబుదము - అంబు (నీరు) ద (ఇచ్చునది), మేఘము}; ధాతున్ = ఖనిజములచేత; చిత్రిత = రంగులు పులుముకొన్న; సముత్ = బాగా; దీప్త = ప్రకాశిస్తున్న; క్షమాభృత్ = పర్వతము; గతిన్ = వలె; క్షితిన్ = భూమండలమును; దంష్ట్రా = కోరల; అగ్రమునన్ = కొనలపై; ధరించి = ధరించి; జలరాశిన్ = సముద్రమును {జలరాశి - ఎక్కువ జలము రాశిగా ఉన్నది, సముద్రము}; పాసి = వదలి; ఏతేరగన్ = రాగా.
భావము:
ఆ రాక్షసుడు హిరణ్యాక్షుని ఈ విధంగా వధించి వాడి వేడివేడి నెత్తురు ధారలతో నిండిన చెక్కిళ్ళు గలవాడైన వరాహమూర్తి సాయంసమయాన ఎఱ్ఱబడిన మేఘాలతో గైరికాది ఖనిజాలతో, జాలువారిన మహా పర్వతం వలె ఒప్పుతూ, భూమిని తన కోర చివర ధరించి సముద్రంలో నుండి బయటికి వచ్చాడు.
- ఉపకరణాలు:
బాలశీతాంశురేఖా విభాసమాన
ధవళ దంష్ట్రాగ్రమున నున్న ధరణి యొప్పె
హరికి నిత్యానపాయిని యైన లక్ష్మి
నెఱయఁ బూసిన కస్తూరినికర మనఁగ.
టీకా:
బాల = లేత; శీతాంశు = జాబిల్లి {శీతాంశుడు - చల్లటి అంశ కలవాడు, చంద్రుడు}; రేఖా = వంక వలె; విభాసమాన = ప్రకాశిస్తున్న; ధవళ = తెల్లని; దంష్ట్రా = కోరల; అగ్రమునన్ = కొన లందున; ఉన్న = ఉన్నట్టి; ధరణి = భూమి; ఒప్పెన్ = చక్కగా సరిపోయినది; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; నిత్య = ఎల్లప్పుడూ; అనపాయని = అసలు విడువకుండునది; ఐన = అయినట్టి; లక్ష్మి = లక్ష్మీదేవి; నెఱయన్ = నిండుగా; పూసిన = పూసినట్టి; కస్తూరి = కస్తూరి అను సుగంధ ద్రవ్యము; నికరము = ముద్ద; అనగన్ = అన్నట్లు.
భావము:
పాడ్యమి నాటి చంద్రరేఖలా విరాజిల్లుతున్న వరహావతారుడి తెల్లని కోరకొనపై నున్న ఆ భూమి, స్వామిని ఎప్పుడూ ఎడబాయని శ్రీ మహాలక్ష్మి ఆయనకు పూసిన కస్తూరి పంకంలా, కనిపించింది.