తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
కావున మచ్చారిత్ర క
థా విలసిత మైన సుమహితస్తవము జగ
త్పావనము విగతసంశయ
భావుఁడ వై బుద్ధినిలుపు పంకజజన్మా!
టీకా:
కావున = కావున; మత్ = నాయొక్క; చరిత్ర = వర్తనలు; కథా = కథలుతో; విలసితము = విలసిల్లునది; ఐన = అయిన; సు = గొప్ప; మహిత = మహిమ కల; స్తవము = స్తోత్రము; జగత్ = భువనములను; పావనము = పవిత్రము చేయునది; విగత = విడిచిపెట్టిన; సంశయ = సంశయములు కల; భావుండవు = భావములు కలవాడవు; ఐ = అయి; బుద్ధిన్ = మనసున; నిలుపు = నిలుపుము; పంకజజన్మా = బ్రహ్మదేవుడా {పంకజజన్ముడు - పంకజ (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}.
భావము:
పద్మసంభవా! బ్రహ్మా! నా చరిత్ర, లీలా విలాసాలు కలిగిన కథలతో ప్రకాశించే ఈ పరమ పవిత్ర స్తోత్రం లోకాన్ని పవిత్రం చేస్తుంది. అందుచేత ఏమాత్రం సంశయం లేకుండా దీనిని నీ మనసులో స్థిరంగా నిలిపి ఉంచుకో.