తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
మఱియు, భూతేంద్రియగుణాత్ముం డనియు జగన్మయుం డనియు నన్ను నీ చిత్తంబు నందుఁ దలంపుము; తామరసనాళవివర పథంబు వెంటం జని జలంబులలోనం జూడం గోరి నట్టి మదీయ స్వరూపంబు.
టీకా:
మఱియున్ = ఇంకనూ; భూత = పంచభూతములు; ఇంద్రియ = దశేంద్రియములు; గుణ = త్రిగుణములు; ఆత్ముండన్ = తానే ఐన వాడను; అనియున్ = అనియూ; జగత్ = భువనములను; మయుండను = అంతయూ నిండినవాడను; అనియున్ = అనియూ; నన్నున్ = నన్ను; నీ = నీ యొక్క; చిత్తంబున్ = మనసు; అందున్ = లో; తలంపుము = స్మరింపుము; తామరస = పద్మము యొక్క; నాళ = తూడు, కాడ; వివర = కన్నము యొక్క; పథంబున్ = మార్గము; వెంటన్ = వెంట; చని = వెళ్లి; జలంబుల = నీటి; లోనన్ = లోపల; చూడన్ = చూడవలెనని; కోరిన = కోరిన; అట్టి = అటువంటి; మదీయ = నా యొక్క; స్వరూపంబున్ = స్వరూపము;
భావము:
1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము ఇవి పంచ భూతాలు; 1. కళ్ళు, 2. ముక్కూ, 3. చెవులు, 4. నోరు, 5. చర్మము, 6. నాలుక, 7. చేతులు, 8. కాళ్ళు, 9. మలద్వారము, 10. జననేంద్రియం ఇవి దశేంద్రియాలు; 1, సత్వగుణము, 2. రజోగుణము, 3. తమోగుణము ఇవి త్రిగుణాలు. నేనే ఈ పంచభూతాలకూ, పది ఇంద్రియాలకూ, త్రిగుణాలకూ, అంతరాత్మను అనీ, జగత్తు అంతటా వ్యాపించినవాడననీ, నన్ను నీ మనస్సులో భావించు. అప్పుడు పద్మంకింద కాడ లో ఉన్న కన్నం వెంట వెళ్లి నీటిలో ఉన్న నన్ను చూడాలనుకున్న నా స్వరూపం ఇప్పుడు నీకు దర్శనం అయింది.