తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
విను మదియుఁ గాక ప్రాణుల
కనయము నెఱుఁగంగరాని యనఘుఁడఁ దేజో
ధనుఁడఁ బరేశుఁడ నీచే
తను గానంబడితి నిదె పితామహ! కంటే.
టీకా:
వినుము = వినుము; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ప్రాణుల = జీవుల; కున్ = కు; అనయమున్ = అవశ్యమున్; ఎఱుగన్ = తెలియుటకు; రాని = రాని; అనఘుడన్ = పాపము అంటనివాడను; తేజోధనుడన్ = తేజస్సు అను ధనము కలవాడను; పరేశుడన్ = పరమమైన ప్రభువును; నీ = నీ; చేతనున్ = చేతను; కానంబడితిన్ = చూడబడితిని; ఇదె = ఇదిగో; సరోజజ = బ్రహ్మదేవుడా {సరోజజుడు - సరోజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; కంటె = చూసితివా.
భావము:
ఓ పితామహా! బ్రహ్మా! అంతేకాదు, నేను ఏ జీవులు ఏనాడూ తెలియలేని పుణ్యమూర్తిని, తేజోనిధిని, పరమేశ్వరుడను, అటువంటి నేనే ఇప్పుడు నీముందు సాక్షాత్కరించాను. చూసావు కదా.