తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
అట్లు వొడగని యార్తుఁ డైనట్టి పద్మ
భవుని వాంఛిత మాత్మఁ దీర్పగఁ దలంచి
యతని మోహనివారక మైన యట్టి
యమృతరసతుల్య మధురవాక్యముల ననియె.
టీకా:
అట్లు = ఆ విధముగ; పొడగని = చూసి; ఆర్తుడు = ఆర్తి చెందినవాడు; ఐనట్టి = అయినట్టి; పద్మభవుని = బ్రహ్మదేవుని {పద్మభవుడు - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; వాంఛితము = కోరినది; ఆత్మన్ = స్వయముగా; తీర్పన్ = తీర్చవలెనని; తలచి = అనుకొని; అతని = అతని; మోహ = మోహమును; నివారకము = నివారించునది; ఐన = అయిన; అట్టి = అటువంటి; అమృత = అమృతము అను; రస = రసమునకు; తుల్య = సరితూగు; మధుర = మధురమైన; వాక్యములన్ = మాటలతో; అనియెన్ = పలికెను.
భావము:
అలా చూసి ఆర్తితో అడుగుతున్న బ్రహ్మదేవుని కోర్కె తీర్చాలని మదిలో భావించాడు. అతనిలోని వ్యామోహాన్ని తొలగించగలిగిన అమృతముతో సమానమైన తీయని మాటలతో ఇలా అన్నాడు.