తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
భవ దుదరప్రభూత మగు పద్మము నందు వసించి యున్న నే
నవిరళ తావకీన కలితాంశమునం దనరారు విశ్వముం
దవిలి రచించుచున్ బహువిధంబులఁ బల్కెడి వేదజాలముల్
శివతరమై ఫలింపఁ గృపసేయుము భక్తఫలప్రదాయకా!"
టీకా:
భవత్ = నీ యొక్క; ఉదర = ఉదరమున; ప్రభూతము = చక్కగా పుట్టినది; అగు = అయిన; పద్మము = పద్మము; అందున్ = లో; వసించి = నివసిస్తూ; ఉన్న = ఉన్నట్టి; నేన్ = నేను; అవిరళ = అపారమైన; తావకీన = నీ యొక్క; కలిత = కూడిన; అంశమునన్ = అంశతో; తనరారు = అతిశయించు; విశ్వమున్ = భువనములను; తవిలి = పూనుకొని; రచించుచున్ = రచించుతూ; బహు = అనేక; విధములన్ = విధములుగా; పల్కెడి = చెప్పెడి; వేద = వేదముల; జాలముల్ = సమూహములు; శివతరము = మిక్కిలి శుభకరము {శివము - శివతరము - శివతమము}; ఐ = అయి; ఫలింపన్ = ఫలితమిచ్చునట్లు; కృపన్ = దయ; చేయుము = చేయుము; భక్తఫలప్రదాయకా = విష్ణుమూర్తీ {భక్తఫలప్రదాయకుడు - భక్తులకు తగిన ఫలితము ఇచ్చువాడు, విష్ణువు}.
భావము:
హరీ! భక్తుల భక్తికి చక్కటి ఫలాలను ప్రసాదించేవాడా! నీ కడుపున పుట్టిన కమలంలోనుంచి జన్మించిన నేను అపారమైన నీ అంశతో ప్రకాశించే ఈ విశ్వాన్ని సృష్టించడానికి పూనుకున్నాను. ఈ సందర్భంలో నేను పలురీతులుగా పలికే పలుకులు వేదరాశి అయి మంగళప్రదాలై ఫలించేటట్లు అనుగ్రహించు.”