తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
నిగమస్తుత! లక్ష్మీపతి!
జగదంతర్యామి వగుచు సర్గము నెల్లం
దగు భవదైశ్వర్యంబున
నగణిత సౌఖ్యానుభవము నందింతు గదే.
టీకా:
నిగమస్థుత = విష్ణుమూర్తీ {నిగమస్తుత - వేదములచే స్తుతింపబడు వాడు, విష్ణువు}; లక్ష్మీపతి = విష్ణుమూర్తీ {లక్ష్మీపతి - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; జగత్ = విశ్వమునకు; అంతర్యామివి = లోప లంతా వ్యాపించి ఉండువాడవు; అగుచు = అవుతూ; సర్గమున్ = సృష్టిని; ఎల్లన్ = అంతనూ; తగు = తగిన; భవత్ = నీ యొక్క; ఐశ్వర్యంబునన్ = ఐశ్వర్యమువలన; అగణిత = గణించుటకురాని; సౌఖ్య = సుఖముల; అనుభవమున్ = అనుభవమును; అందింతు = అందించెదవు; కదే = కదా;
భావము:
వేదాలచే వినుతించబడువాడా! శ్రీవల్లభ! విష్ణుమూర్తీ! నీవు లోకాలు అన్నిటికి అంతర్యామివి అయి ఉంటూ, ఈ సృష్టి యావత్తుకి భవ్యమైన నీ దివ్యవిభూతిచే లెక్కలేనన్ని ఆనందానుభూతులను అందిస్తావు కదా.