తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
తలకొని పంచభూతప్రవర్తకమైన-
భూరిమాయాగుణస్ఫురణఁ జిక్కు
వడక లోకంబులు భవదీయ జఠరంబు-
లో నిల్పి ఘనసమాలోల చటుల
సర్వంకషోర్మి భీషణ వార్థి నడుమను-
ఫణిరాజభోగతల్పంబు నందు
యోగనిద్రారతి నుండగ నొకకొంత-
కాలంబు సనఁగ మేల్కనిన వేళ
- ఉపకరణాలు:
నలఘు భవదీయనాభితోయజమువలనఁ
గలిగి ముల్లోకములు సోపకరణములుగఁ
బుట్టఁ జేసితి వతుల విభూతి మెఱసి
పుండరీకాక్ష! సంతతభువనరక్ష!
టీకా:
తలకొని = శిరసావహించి {తలకొని - తల (ముందు) భాగమును తీసుకొని, నాయకత్వము వహించి}; పంచభూత = పంచభూతముల యందును {పంచభూతములు - భూమి నీరు గాలి ఆకాశము తేజస్సు అను 5 భూతములు}; ప్రవర్తకము = మిక్కిలి వర్తించుచుండునది; ఐన = అయిన; భూరి = బహుగొప్ప; మాయా = మాయ యొక్క; గుణ = గుణములు వలన; స్పురణన్ = స్పురించుట అనే బంధాలలో; చిక్కు = తగులము; పడక = పొందక; లోకంబులున్ = భువనములను; భవదీయ = నీయొక్క; జఠరంబున్ = కడుపు; లోన్ = లోపల; నిల్పి = నిలుపుకొని; ఘన = మేఘములవలె; సమ = బాగా; ఆలోల = కదులుతూ; చటుల = భయంకరమైన; సర్వంకష = సర్వమును ఒరుసుకొని పోవుచున్న; ఊర్మి = అలలతో; భీషణ = భయంకరమైన; వార్థిన్ = మహాసముద్రము; నడుమనున్ = మధ్యలో; ఫణిరాజు = ఆదిశేషుని {ఫణిరాజు - సర్పములకు రాజు, ఆదిశేషువు}; భోగ = శరీరము అను; తల్పంబున్ = పాన్పు; అందున్ = అందు; యోగనిద్ర = యోగనిద్ర యందలి; రతిన్ = ఆసక్తిని; ఉండగన్ = ఉండగా; ఒకకొంత = కొంత; కాలమున = కాలమున; కున్ = కు; మేల్కొనిన = లేచిన; వేళన్ = సమయమందు; అలఘు = గొప్పదైన; భవదీయ = నీయొక్క; నాభి = నాభి యొక్క; తోయజము = పద్మము {తోయజము - తోయము (జలము) లందు జము (పుట్టినది), పద్మము}; వలనన్ = నుండి; కలిగి = పుట్టి; ముల్లోకములున్ = మూడులోకములును {ముల్లోకములు - భూ భువర్ సువర్ లోకములు మూడు}; స = కూడిన; ఉపకరణములుగ = సాధనములుకలవిగా; పుట్టన్ = పుట్టునట్లు; చేసితివి = చేసితివి; అతుల = సాటిలేని; విభూతిన్ = వైభవముతో; మెఱసి = అతిశయించి; పుండరీకాక్ష = విష్ణుమూర్తీ {పుండరీకాక్ష - పుండరీకములు (పద్మములు) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; సంతతభువనరక్ష = విష్ణుమూర్తీ {సంతతభువనరక్ష - ఎల్లప్పుడును లోకములును రక్షించువాడు, విష్ణువు}.
భావము:
తెల్లతామర రేకులవంటి కన్నులుగలవాడా! పద్మాక్షా! ఎల్లవేళలా ముల్లోకాలను చల్లగా రక్షించే శ్రీమన్నారాయణ! పంచభూతాలను ప్రవర్తింప చేసి. వాటి మహామాయాబంధాలలో చిక్కుపడకుండా లోకాలను నీ కడుపులో నిలుపుకుంటావు. ఉవ్వెత్తుగా లేచిపడుతున్న ఉత్తుంగ తరంగాలతో పొంగిపొరలే భయంకరమైన సముద్రం నడుమ శేషతల్పంమీద యోగనిద్రలో శయనించి ఉంటావు. కొంతకాలం గడిచాక మేల్కొంటావు. అప్పుడు నీసాటిలేని మేటి వైభవాన్ని వ్యక్తం చేస్తూ, నీ నాభికమలం నుంచి మూడు లోకాలను పుట్టింపచేస్తావు.