తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
జననవృద్ధివినాశ హేతుక సంగతిం గల యేను నీ
వును హరుండు ద్రిశాఖలై మనువుల్ మరీచిముఖామరుల్
ఒనర నందుపశాఖలై చెలువొంద నింతకు మూలమై
యనయమున్ భువనద్రుమాకృతివైన నీకిదె మ్రొక్కెదన్.
టీకా:
జనన = పుట్టుటను; వృద్ధి = పెరుగుటను; వినాశక = నశించుటలకును; హేతుక = కారణ మగువానితో; సంగతిన్ = కూడుట; కల = కలిగిన; ఏను = నేను; నీవును = నీవును; హరుండున్ = శివుడును; త్రి = మూడు; శాఖలు = విభాగములు; ఐ = అయి; మనువుల్ = మనువులు (14గురు ఉపశాఖలు) {మనువులు - పద్నాలుగురు, 1 స్వాయంభువుడు 2 స్వారోచిషుడు 3 ఉత్తముడు 4 తామసుడు 5 రైవతుడు 6 చాక్షుసుడు 7 వైవస్వతుడు 8 సూర్యసావర్ణి 9 దక్షసావర్ణి 10 బ్రహ్మసావర్ణి 11 ధర్మసావర్ణి 12 రుద్రసావర్ణి 13 రౌచ్యుడు 14 భౌచ్యుడు ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవశ్వతమన్వంతరము జరుగుచున్నది}; మరీచి = మరీచి {మరీచ్యాదులు - నవబ్రహ్మలు, 1 మరీచి 2 అత్రి 3 అంగీరసుడు 4 పులస్త్యుడు 5 పులహుడు 6 క్రతువు 7 వసిష్టుడు - ఇంకోవిధముగ - నవబ్రహ్మలు, 1 మరీచి 2 భరద్వాజుడు 3 అత్రి 4 అంగీరసుడు 5 పులస్త్యుడు 6 పులహుడు 7 క్రతువు 8 వసిష్టుడు 9 వామదేవుడు}; ముఖ = మొదలగు (7, 9 గురు ఉపకి ఉప శాఖలు); అమరుల్ = దేవతలు; ఒనరన్ = చక్కగా; అందున్ = అందు; ఉపశాఖలు = చిలువలు పలవలు; ఐ = అయి; చెలువు = చక్కదనము; ఒందన్ = సంతరించుకొనగా; ఇంతకున్ = దీనంతకును; మూలము = మూలము; ఐ = అయి; అనయమున్ = అవశ్యము; భువన = విశ్వము అను; ద్రుమ = వృక్షము; ఆకృతివిన్ = ఆకృతిలోఉన్నవాడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; ఇదె = ఇదె; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.
భావము:
ఈ విశ్వం ఒక మహావృక్షం; సృష్టి స్థితి లయ కారకుల మైన నేనూ నీవు శివుడు, ముగ్గురం ఈ వృక్షానికి మూడు శాఖలము; మనువులు, మరీచి మొదలైన ప్రజాపతులూ, దేవతలూ దాని ఉపశాఖలు; ఆ విశ్వవృక్షానికి ఆధారమైన కూకటివేరు నీవే. విశాలమైన దాని ఆకారం కూడా నీవే. అట్టి నీకిదే చేతులెత్తి నమస్కరిస్తున్నాను.