తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
అనఘాత్మ! మఱి భవదవతార గుణకర్మ-
ఘన విడంబన హేతుకంబు లయిన
రమణీయ మగు దాశరథి వసుదేవకు-
మారాది దివ్యనామంబు లోలి
వెలయంగ మనుజులు వివశాత్ములై యవ-
సానకాలంబున సంస్మరించి
జన్మజన్మాంతర సంచిత దురితంబుఁ-
బాసి కైవల్యసంప్రాప్తు లగుదు
- ఉపకరణాలు:
రట్టి దివ్యావతారంబుల వతరించు
నజుఁడ వగు నీకు మ్రొక్కెద ననఘచరిత!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార!
భక్తమందార! దుర్భవభయవిదూర!
టీకా:
అనఘాత్మ = విష్ణుమూర్తీ {అనఘాత్మ - పాపముకానిది అయినవాడ, విష్ణువు}; మఱి = మరి; భవత్ = నీయొక్క; అవతార = అవతారముల; గుణ = గుణములు; కర్మ = కర్మలకు; ఘన = గొప్ప; విడంబన = అనుకరణంబు; హేతుకంబులు = కారణముగాకలవి; అయిన = అయిన; రమణీయ = మనోహరము; అగు = అయిన; దాశరథి = శ్రీరాముడు {దాశరథి - దశరథుని పుత్రుడు, శ్రీరాముడు}; వసుదేవకుమార = శ్రీకృష్ణుడు {వసుదేవకుమారుడు - వసుదేవుని కుమారుడు, శ్రీకృష్ణుడు}; ఆది = మొదలగు; దివ్య = దివ్యమైన; నామంబులన్ = పేర్లతో; ఓలిన్ = క్రమముగా; వెలయంగా = అవతరించగా; మనుజులు = మానవులు; వివశాత్ములు = పరవశతచెందినవారు; ఐ = అయ్యి; అవసాన = మరణాసన్న; కాలంబునన్ = కాలములో; సంస్మరించి = చక్కగా స్మరించి; జన్మజన్మాతర = జన్మజన్మల; సంచిత = పేరుకొన్న; దురితంబున్ = పాపములను; పాసి = పోగొట్టుకొని; కైవల్య = ముక్తి {కైవల్యము - కేవలము భగవంతుని స్థితి, ముక్తి}; సంప్రాప్తులు = పొందినవారు; అగుదురు = అవుతారు; అట్టి = అటువంటి; దివ్య = దివ్యమైన; అవతారంబులన్ = అవతారములలో; అవతరించు = అవతరించే; అజుడవు = జన్మము లేనివాడు; అగు = అయిన; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = మొక్కెదను; అనఘచరిత = విష్ణుమూర్తీ {అనఘచరితుడు - పాపములుకాని వర్తనములు కలవాడు, విష్ణువు}; చిరశుభాకార = విష్ణుమూర్తీ {చిరశుభాకారుడు - చిరకాలపు శుభమే ఆకారముగ కలవాడ, విష్ణువు}; నిత్యలక్ష్మీవిహార = విష్ణుమూర్తీ {నిత్యలక్ష్మీవిహారుడు - శాశ్వతమైన సంపదలకు విహారమైన వాడు, విష్ణువు}; భక్తమందార = విష్ణుమూర్తీ {భక్తమందారము - భక్తులకు కల్పవృక్షము వంటివాడు, విష్ణువు}; దుర్భవభయవిదూర = విష్ణుమూర్తీ {దుర్భవభయవిదూరడు - భయంకరమైన భవము (సంసారము) వలని భయమును పూర్తిగా దూరము చేయువాడ, విష్ణువు}.
భావము:
శ్రీమన్నారాయాణా! నీవు పరమ పవిత్రుడవు. సచ్చరిత్రుడవు. శాశ్వతమైన దివ్య మంగళ స్వరూపం కల వాడవు. ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కూడి సంచరించే వాడవు, భక్తులకు కల్పవృక్షం వంటి వాడవు. దుర్భరమైన సంసార భయాన్ని దూరం చేసే వాడవు. నీ అవతారాలకు, సద్గుణాలకూ, సత్కార్యాలకూ, మహదాశయాలకూ కారణమైనవి, మనోహరమైనవీ అయిన , దాశరధీ, వాసుదేవ మున్నగు దివ్య నామాలను, మనుష్యులు తమ తుది గడియల్లో స్మరించి, అనేక జన్మములలో కూడబెట్టుకున్న పాపాలను పోగొట్టుకొని మోక్షం పొందుతారు. జన్మ లేని వాడవు అయి కూడా అటువంటి దివ్య అవతారాలతో జన్మించే నీకు మొక్కుతున్నాను.