తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
జననస్థితివిలయంబుల
ననయంబును హేతుభూతమగు మాయాలీ
లను జెంది నటన సలిపెడు
ననఘాత్మక! నీకొనర్తు నభివందనముల్
టీకా:
జనన = సృష్టి; స్థితి = స్థితి; విలయంబులన్ = లయములకు; అనయంబునున్ = సతతము; హేతుభూతము = కారణాంశమైనది; అగు = అయిన; మాయా = మాయ వలని; లీలను = లీలను; చెంది = చెందినట్లు; నటన = నటనలు; సలిపెడు = చేసే; అనఘాత్మ = విష్ణుమూర్తీ {అనఘాత్మ - పాపముకానిది అయినవాడ, విష్ణువు}; నీకున్ = నీకు; ఒనర్తున్ = చేయుదును; అభివందనముల్ = మిక్కిలి నమస్కారములు.
భావము:
పుట్టుట, వృద్ధిపొందుట, చనిపోవుట, అనే మూడింటికి మూలకారణమైనది నీ మాయ. అటువంటి మాయా నటనలతో, లీలావిలాసంతో, నిరంతరము క్రీడించే ఓ పవిత్ర స్వరూపా! హరీ! నీకివే నా కైమోడ్పులు.