తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
క్రతు దానోగ్రత పస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల
వ్రతచర్యాదుల నాదరింప వఖిలవ్యాపారపారాయణ
స్థితి నొప్పారెడి పాదపద్మయుగళీసేవాభి పూజా సమ
ర్పిత ధర్ముండగు వాని భంగి నసురారీ! దేవచూడామణీ!\
టీకా:
క్రతు = యజ్ఞములు; దాన = దానములు; ఉగ్ర = తీక్షణమైన; తపస్ = తపస్సు; సమాధి = సమాధి; సత్ = మంచి; కర్మ = కర్మములు; అగ్నిహోత్ర = అగ్నిహోత్రము; అఖిల = సమస్తమైన; వ్రతచర్య = వ్రతములు చేయుట; ఆదులన్ = మొదలగువానిని; ఆదరింపవు = ఆదరింపవు; అఖిల = సమస్తమైన; వ్యాపార = (పై) పనులు; పారాయణ = చేసిన; స్థితిన్ = విధముగ; ఒప్పారెడి = ఒప్పి ఉండే; పాద = (నీ) పాదములు అను; పద్మ = పద్మముల; యుగళీ = జంటను; సేవా = సేవించుటను; అభిపూజా = చక్కటి పూజలను; సమర్పిత = సమర్పించు; ధర్ముండు = స్వభావము కలవారు; అగు = అయిన; వానిన్ = వారిని; భంగిన్ = వలె; అసురారి = విష్ణుమూర్తీ {అసురారి - అసురులు (రాక్షసులు)కి శత్రువు, విష్ణువు}; దేవచూడామణీ = విష్ణుమూర్తీ {దేవచూడామణి - దేవుళ్ళలో శిరోమణి (అత్యుత్తముడు), విష్ణువు}.
భావము:
ఓ రాక్షస సంహారా! దేవతా సార్వభౌమా! శ్రీమహావిష్ణూ! చేసే పనులు అన్నీ నీకే సమర్పించి, నీ యందే మనస్సు లగ్నంచేసి నీ పాదపద్మ ద్వయాన్నే నిరంతరం ఆరాధించే భక్తులను నీవు ఎంతో ఆప్యాయంగా ఆదరించి ఆదుకుంటావు. యజ్ఞాలు, దానాలు, కఠోర తపస్సులూ, జపాలూ, అగ్నిహోత్రాలూ, వ్రతాలూ, మొదలైన సత్కర్మలు ఆచరించేవారిని కూడా ఇంత ప్రేమగా ఆదరించవు.