తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
అరయ సమస్త జీవహృదయంబుల యందు వసించి యేకమై
పరఁగి సుహృత్క్రియానుగుణభాసిత ధర్ముఁడవుం బరాపరే
శ్వరుఁడవునై తనర్చుచు నసజ్జన దుర్లభమైన యట్టి సు
స్థిర మగు సర్వభూతదయచేఁ బొడగానఁగవత్తు వచ్యుతా!
టీకా:
అరయన్ = పరిశీలించిచూడగా; సమస్త = సమస్తమైన; జీవ = జీవుల; హృదయంబుల = హృదయముల; అందున్ = లోను; వసించి = ఉండి; ఏకము = ఒకే విధముగా; ఐ = అయి; పరగి = వ్యాపించి; సు = మంచి; హృత్ = హృదయము కలవారి; క్రియా = పనులకు; అనుగుణ = అనుగుణముగా; భాసిత = ప్రకాశించు; ధర్ముండవు = ధర్మములు కలవాడవు; పరా = పరమునకును {పరము - పరలోకము}; అపర = ఇహమునకు {అపర - పరముకానిది, ఇహము, ఈలోకము}; ఈశ్వరుడవున్ = అధిపతివివి; ఐ = అయి; తనర్చుచున్ = అతిశయించుచూ; అసత్ = మంచివారు కాని; జన = జనములకు; దుర్లభము = లభింపనిది; ఐనట్టి = అయినటువంటి; సుస్థిరము = సుస్థిరము; అగు = అయిన; సర్వ = సమస్తమైన; భూత = జీవరాశు లందును; దయ = దయ; చేన్ = చేత; పొడగానగ = దర్శించుటకు; వత్తువు = వీలగుదవు; అచ్యుతా = విష్ణుమూర్తీ {అచ్యుతుడు – పతనము లేనివాడు, విష్ణువు}.
భావము:
ఓ విష్ణుమూర్తీ! అచ్యుతా! నీవు సకల జీవుల హృదయాలలో అంతర్యామిగా ఉంటావు. అందరిలో అనితరుడవు అయి వెలుగొందుతావు. ఆప్యాయతకు అనుగుణంగా ప్రకాశించే ధర్మస్వరూపుడవు. ఇహపరాలకు నీవే అధీశ్వరుడవు. సజ్జనులకు సులభమూ, అసజ్జనులకు దుర్లభమూ అయిన సర్వ జీవ కారుణ్యం వల్ల మాత్రమే జనులకు దర్శనం ఇస్తావు.