తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
మఱియు, జ్ఞానానంద పరిపూర్ణమాత్రంబును, ననావృత ప్రకాశంబును, భేదరహితంబునుఁ, బ్రపంచజనకంబును, ప్రపంచవిలక్షణంబును, భూతేంద్రియాత్మకంబును, నేకంబును నైన రూపంబు నొందియు నెందునుఁ బొడగాన నట్టి నిన్ను నాశ్రయించెద; అదియునుంగాక జగన్మంగళ స్వరూపధరుండవై నీ యుపాసకుల మైన మా మంగళంబుకొఱకు నిరంతర ధ్యానంబుచేత నీ దివ్యరూపంబునం గానంబడితివి; ఇట్టి నీవు నిరయభాక్కు లై నిరీశ్వరవాదంబునంజేసి కుతర్కంబులు ప్రసంగించు భాగ్యరహితులచేత నాదృతుండవు గావు; మఱియుం గొందఱు కృతార్థు లైన మహాత్ములచేత భవదీయ శ్రీచరణారవిందకోశగంధంబు వేదమారుతానీతం బగుటంజేసి తమతమ కర్ణకుహరంబులచేత నాఘ్రాణించుచుందురు వారల హృదయకమలంబుల యందు భక్తిపారతంత్ర్యంబున గృహీత పాదారవిందంబులు గలిగి ప్రకాశింతువు; అదియునుం గాక ప్రాణులకు ద్రవ్యాగార సుహృన్నిమిత్తం బయిన భయంబునుఁ దన్నాశనిమిత్తం బయిన శోకంబును ద్రవ్యాది స్పృహయునుఁ దన్నిమిత్తం బయిన పరిభవంబును, మఱియు నందుఁ దృష్ణయు, నది ప్రయాసంబున లబ్ధం బైన నార్తిమూలం బగు తదీయం బైన వృథాగ్రహంబును, నీ శ్రీపాదారవిందంబు లందు వైముఖ్యం బెంత కాలంబు గలుగు నంతకాలంబు ప్రాప్తంబు లగుం గాని, మానవాత్మనాయకుండ వగు నిన్ను నాశ్ర యించిన భయనివృత్తిహేతు వైన మోక్షంబు గలుగు; మఱియునుం గొందఱు సకలపాపనివర్తకం బయిన త్వదీయ నామస్మరణ కీర్తనంబు లందు విముఖులై కామ్యకర్మ ప్రావీణ్యంబునంజేసి నష్టమతు లై యింద్రియపరతంత్రు లై యమంగళంబు లైన కార్యంబులు సేయుచుందురు; దానంజేసి వాతాది త్రిధాతుమూలం బైన క్షుత్తృడాది దుఃఖంబులచేతను శీతోష్ణ వర్ష వాతాది దుఃఖంబులచేతను నతి దీర్ఘం బైన కామాగ్నిచేతను నవిచ్ఛన్నం బగు క్రోధంబుచేతనుం దప్యమానులగుదురు వారలఁ గనిన నా చిత్తంబు గలంకం బొందు; జీవుండు భవదీయ మాయాపరిభ్రామ్యమాణుం డై యాత్మ వేఱని యెప్పుడు దెలియు నంతకాలంబు నిరర్థకంబై దుస్తరంబైన సంసారసాగరంబుఁ దరియింపఁ జాలకుండు; సన్మునీంద్రు లైనను భవదీయ నామస్మరణంబు మఱచి యితర విషయాసక్తు లైరేని, వారలు దివంబు లందు వృథాప్రయత్ను లై సంచరించుచు రాత్రుల యందు నిద్రాసక్తు లై, స్వప్న గోచరంబు లయిన బహువిధ సంపదలకు నానందించుచు శరీరపరిణామాది పీడలకు దుఃఖించుచుం బ్రతిహతంబు లైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు; నిష్కాము లై నిన్ను భజియించు సత్పురుషుల కర్ణమార్గంబులం బ్రవేశించి భవదీయ భక్తియోగ పరిశోధితం బైన హృత్సరోజకర్ణికాపీఠంబున వసియింతువు; అదియునుంగాక.
టీకా:
మఱియు = ఇంకా; జ్ఞాన = జ్ఞానము; ఆనంద = ఆనందములతో; పరిపూర్ణ = పూర్తిగా నిండుట; మాత్రంబునున్ = మాత్రమే అయినది; అనావృత = ఆవృతములు లేని {ఆవృతములు - కప్పివేయునవి}; ప్రకాశంబునున్ = వెలుగు అయినది; భేద = భేదములు అనునవి; రహితంబునున్ = లేనిది; ప్రపంచ = ప్రపంచకములుచే {ప్రపంచకములు - పంచభూతములు పంచతన్మాత్రలు పంచేంద్రియములు మొదలగు పంచకములు}; జనకంబును = సృష్టింపబడినదియును; ప్రపంచ = పంచభూతములు మొదలగు; విలక్షణంబును = విశిష్టలక్షణములు కలదియును; భూత = పంచభూతములు; ఇంద్రియ = పంచేంద్రియములు; ఆత్మకంబును = తానే అయినదియును; ఏకంబును = ఇవన్నీ ఒక్కటే అయినది; ఐన = అయినట్టి; రూపంబున్ = రూపమును; ఒందియు = పొందికూడ; ఎందునున్ = ఎక్కడనూ; పొడన్ = ఆనమాలుకైనా; కానన్ = కనబడని; అట్టి = అటువంటి; నిన్నున్ = నిన్ను; ఆశ్రయించెదన్ = ఆశ్రయించెదను; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; జగత్ = లోకములకు; మంగళ = శుభకరమైన; స్వరూప = స్వరూపమును; ధరుండవు = ధరించినవాడవు; ఐ = అయి; నీ = నీ యొక్క; ఉపాసకులము = సేవించువారము; ఐన = అయిన; మా = మా; మంగళంబు = శుభములు; కొఱకున్ = కోసము; నిరంతర = ఎడతెగని; ధ్యానంబున్ = ధ్యానము; చేత = చేత; నీ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; రూపంబునన్ = రూపములో; కానంబడితివి = దర్శనము ఇస్తివి; ఇట్టి = ఇటువంటి; నీవు = నీవు; నిరయ = నరకమును; భాక్కులు = అనుభవించువారు; ఐ = అయి; నిరీశ్వర = ఈశ్వరుడు లేడు అను; వాదంబునన్ = వాదముల; చేసి = వలన; కుతర్కంబులు = విపరీత తర్కములు; ప్రసంగించు = చేయు; భాగ్యరహితులు = దౌర్భాగ్యుల; చేతన్ = చేత; ఆదృతుండవు = తెలియబడువాడవు; కావు = కావు; మఱియున్ = ఇంకనూ; కొందఱు = కొందరు; కృతార్థులు = ధన్యులు; ఐన = అయిన; మహా = గొప్ప; ఆత్ములు = వారి; చేతన్ = చేత; భవదీయ = నీ యొక్క; శ్రీ = శుభకరమైన; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; కోశ = మొగ్గల; గంధంబున్ = సువాసన; వేద = వేదములు అనెడి; మారుత = వాయువులచే; ఆనీతంబు = కొనిరాబడినది; అగుటన్ = అగుట; చేసి = వలన; తమతమ = తమతమ; కర్ణ = చెవుల; కుహరంబుల = గుహల; చేతన్ = ద్వారా; ఆఘ్రాణించుచు = ఆస్వాదిస్తూ; ఉందురు = ఉందురు; వారల = వారి యొక్క; హృదయ = హృదయములు అను; కమలంబులు = కమలములు; అందున్ = అందు; భక్తి = భక్తితో కూడిన; పారతంత్ర్యంబునన్ = అర్పణ కలవారు {పారతంత్రము - పరునిచే (భగవంతునిచే) నడుపబడుట}; గృహీత = గ్రహింపబడిన; పాద = పాదములు అనెడి; అరవిందంబులు = పద్మములు; కలిగి = ఉండి; ప్రకాశింతువు = ప్రకాశింతువు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ప్రాణుల = జీవుల; కున్ = కు; ద్రవ్య = ధనము, సిరి; ఆగార = ఇల్లు, సంపద; సుహృత్ = మిత్రులు; నిమిత్తంబున్ = కారణము; అయిన = అయిన; భయంబున్ = భయమును; తత్ = దాని; నాశ = నశించుట వలన; నిమిత్తంబున్ = కారణముగా; అయిన = కల; శోకంబును = శోకమును; ద్రవ్య = ధనము; ఆది = మొదలగునవి; స్పృహయును = ఉన్న దనుభావమును; తత్ = దాని; నిమిత్తంబున్ = కారణము; అయిన = వలన; పరిభవంబును = అవమానమును; మఱియున్ = మరల; అందున్ = వాని అందు; తృష్ణయును = తీవ్రమైన కోరికయును, లాలసయును; అది = అది; ప్రయాసంబునన్ = ప్రయత్నము వలన; అలబ్ధంబు = దొరకనిది; ఐన = అయిన; ఆర్తి = ఆర్తికి; మూలంబు = కారణము; అగు = అయిన; తదీయంబు = దానికి సంబంధించినది; ఐన = అయిన; వృథా = వ్యర్థమైన; ఆగ్రహంబునున్ = కోపములును; నీ = నీ యొక్క; శ్రీ = శుభకరమైన; పాద = పాదములు అనెడి; అరవిందంబులు = పద్మములు; అందున్ = అందు; వైముఖ్యంబు = అయిష్టము, విముఖత్వము; ఎంత = ఎంత; కాలంబున్ = కాలము; కలుగు = కలుగుతుందో; అంత = అంత; కాలంబున్ = కాలమును; ప్రాప్తంబులు = ప్రాప్తించినవి; అగున్ = అగును; కాని = కాని; మానవ = మానవుల; ఆత్మన్ = ఆత్మలకు; నాయకుండవు = నడపువాడవు; అగు = అయిన; నిన్నున్ = నిన్ను; ఆశ్రయించినన్ = ఆశ్రయించినఎడల; భయ = భయమును; నివృత్తి = పోగొట్టుటకు; హేతువు = కారణము; ఐన = అయిన; మోక్షంబున్ = మోక్షము; కలుగున్ = కలుగును; మఱియునున్ = ఇంకనూ; కొందఱు = కొందరు; సకల = సమస్తమైన; పాప = పాపములను; నివర్తకంబు = పోగొట్టునది; అయిన = అయిన; త్వదీయ = నీయొక్క; నామ = పేరును; స్మరణ = స్మరించుట; కీర్తనంబులు = కీర్తించుటలు; అందున్ = అందు; విముఖులు = అయిష్టులు; ఐ = అయి; కామ్య = కోరికలతో కూడిన; కర్మ = కర్మములందు; ప్రావీణ్యమునన్ = నేర్పు; చేసి = వలన; నష్ట = పోయిన; మతులు = మతికలవారు; ఐ = అయి; ఇంద్రియ = ఇంద్రియములచేత; పరతంత్రులు = నడపపబడువారు; ఐ = అయి; అమంగళంబులు = అశుభకరములు; ఐన = అయిన; కార్యంబులున్ = పనులను; చేయుచున్ = చేస్తూ; ఉందురు = ఉందురు; దానన్ = దాని; చేసి = వలన; వాత = వాతము {వాతాది - త్రిధాతువులు - వాతము పిత్తము శ్లేష్మము}; ఆది = మొదలగు; త్రి = మూడు; ధాతు = ధాతువుల; మూలంబు = కారణమైన; ఐన = అయిన; క్షుత్ = ఆకలి; తృట్ = దప్పిక; ఆది = మొదలగు; దుఃఖంబులు = దుఃఖములు; చేతను = వలనను; శీత = చలి; ఉష్ణ = వేడి; వర్ష = వాన; వాత = గాలి; ఆది = మొదలగు; దుఃఖంబుల = దుఃఖముల; చేతను = చేతను; అతి = మిక్కిలి; దీర్ఘంబు = పెద్దది, పొడుగుది; ఐన = అయిన; కామ = కామము అను; అగ్ని = నిప్పు; చేతను = చేత; అవిచ్ఛన్నంబు = తెంపులేని; అగు = అయిన; క్రోధంబు = కోపము; చేతనున్ = చేతను; తప్యమానులు = తపింపబడువారు; అగుదురు = అగుదురు; వారలన్ = వారిని; కనినన్ = చూసిన; నా = నా; చిత్తంబున్ = మనసు; కలంకన్ = కలవరమును; పొందున్ = పొందును; జీవుండు = జీవుడు; భవదీయ = నీయొక్క; మాయా = మాయచేత; పరిభ్రామ్యమాణుండు = మిక్కిలి తిప్పబడినవాడు; ఐ = అయి; ఆత్మన్ = ఆత్మను; వేఱు = పరమాత్మకంటె వేరు; అని = అని; ఎప్పుడు = ఎప్పటివరకు; తెలియున్ = అనుకుంటాడో; అంత = అంత; కాలంబున్ = కాలము; నిరర్థకంబున్ = ప్రయోజనము లేనిది; ఐ = అయి; దుస్తరంబు = దాటుటకు కష్టము; ఐన = అయిన; సంసార = సంసారము అను; సాగరంబున్ = సముద్రమును; తరియింవన్ = దాటుటకు; చాలక = సామర్థ్యము లేక; ఉండు = ఉండును; సత్ = మంచి; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; ఐనను = అయినను; భవదీయ = నీ యొక్క; నామ = పేరును; స్మరణంబున్ = స్మరించుటను; మరచి = మరచిపోయి; ఇతర = ఇతర; విషయ = విషయములందు; ఆసక్తులు = ఆసక్తికలవారు; ఐరి = అయినవారు; ఏని = అయినట్లైతే; వారలు = వారు; దివంబులు = పగళ్లు; అందున్ = అందు; వృథా = వృథా; ప్రయత్నులు = ప్రయత్నములుచేయువారు; ఐ = అయి; సంచరించుచు = తిరుగుతూ; రాత్రులు = రాత్రులు; అందున్ = అందు; నిద్రా = నిద్రయందు; ఆసక్తులు = ఆసక్తి కలవారు; ఐ = అయి; స్వప్న = కలలయందు; గోచరంబులు = కనిపించునవి; అయిన = అయిన; బహు = అనేక; విధ = రకముల; సంపదల = సంపదల; కున్ = కు; ఆనందించుచు = సంతోషించుచుచు; శరీర = శరీరమునవచ్చు; పరిణామ = పరిణామము; ఆది = మొదలగు; పీడలకు = బాధలకు; దుఃఖించుచున్ = దుఃఖించుతూ; ప్రతిహతంబులు = ఎదురుదెబ్బలు కలిగించునవి; ఐన = అయిన; ఉద్యోగంబులన్ = ప్రయత్నములలో; భూలోకంబులన్ = భూలోకములో; సంసారులు = సంసారములు చేయువారు; ఐ = అయి; వర్తింతురు = తిరుగుదురు; నిష్కాములు = నిష్కాములు {నిష్కాములు - కోరికలు లేకుండుటయే ధర్మముగా కలవారు}; ఐ = అయి; నిన్నున్ = నిన్ను; భజియించు = సేవించు; సత్ = మంచి; పురుషుల = పురుషుల; కర్ణ = చెవుల; మార్గంబులన్ = ద్వారా; ప్రవేశించి = ప్రవేశించి; భవదీయ = నీ యొక్క; భక్తి = భక్తితో కూడిన; యోగ = యోగముచే; పరిశోధితంబున్ = పరిశోధింపబడినది; ఐన = అయిన; హృత్ = హృదయము అను; సరోజ = పద్మము యొక్క; కర్ణికా = బొడ్డు; పీఠంబునన్ = పీఠము నందు; వసింతువు = నివసించెదవు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:
జ్ఞానం చేతా ఆనందం చేతా పరిపూర్ణమైనదీ; ఆవరణలు లేని కాంతి కలదీ; తనకు వేరైనది ఏదీ లేనిదీ; ప్రపంచాన్ని సృష్టించేది; ప్రపంచం కంటె భిన్నమైనది; పంచభూతాలకూ; ఇంద్రియాలకూ ఆత్మవంటిది; అనన్యమైనదీ అయిన రూపాన్ని ధరించి కూడా ఎక్కడా ఆనమాలు కూడా దొరకకుండా ఉండే నిన్ను ఆశ్రయిస్తాను. నీవు లోకాలకంతకు శుభాన్ని చేకూర్చే రూపం ధరించిన వాడవు; నిరంతరం నిన్ను ధ్యానించే మాకు శుభాలను కల్గించడానికై ఈ దివ్యమైన రూపంతో కనపడ్డావు; నరకం అనుభవించేవారు అయి ఈశ్వరుడు లేడని వాదిస్తూ కుతర్కాలతో కాలం గడిపే దురదృష్టవంతులు నిన్ను గుర్తించ లేరు; ధన్యజీవులు అయిన కొందరు మహాత్ములు వేదాలనే మలయమారుతాలు తీసుకొని వచ్చిన మీ పాదపద్మాల సుగంధాన్ని వీనులవిందుగా ఆఘ్రాణిస్తారు. వారు భక్తితో పరవశించిన తమ హృదయకమలాలతో నీ పాదపద్మాలను అందుకుంటారు. నీవు ఆ భక్తుల మనస్సులలో ప్రకాశిస్తావు. అంతేకాక ప్రాణులకు ధనం, ఇల్లు అందలి ఆపేక్షవల్ల కలిగే భయం, అవి నాశనం కావడంచేత కలిగే దుఃఖం, దానిమీద ఆశ, దాని సంపాదనలో ఎదురయ్యే అవమానం ఇన్ని శ్రమలు పడి పొందే శోకానికి మూలమైన తృష్ణ. అవన్నీ నీ మంగళకరమైన చరణాబ్జాలను తలంచకుండా ఎంతకాలం ఉంటామో అంతకాలమూ ఉంటాయి. కాని మానవుల ఆత్మలకు అధినాయకుడైన నిన్ను ఆశ్రయిస్తే భయాన్ని పోగొట్టుకోవడానికి కారణమైన మోక్షం కలుగుతుంది. కొందరు అన్ని పాపాలూ పోగట్టగలిగే నీ నామ ధ్యాన సంకీర్తనలకు విముఖులై, మోహ సంబంధ మైన పనుల్లో మతి కోల్పోయి, ఇంద్రియాలకు దాసులై, అశుభాలైన కార్యాలు చేస్తూ ఉంటారు. ఇందువల్ల వాత పిత్త శ్లేష్మాలు అనే త్రిధాతువులకు మూలమైన ఆకలిదప్పుల బాధల చేతా శీతల ఉష్ణ వర్షం వాతం మొదలైన వానివల్ల ప్రాప్తించే దుఃఖం చేతా, అవధిలేని కామాగ్ని చేతా, ఎడతెగని కోపం చేతా తపించి పరితపిస్తారు. అటువంటి వారిని చూచి నా మనస్సు చాలా కలతపడుతుంది. జీవుడు నీ మాయ కల్పించే భ్రమలలో కీలుబొమ్మ అయి దేహం కంటె ఆత్మ వేరని ఎప్పటి వరకు తెలుసుకోలేడో, అంతవరకు సారం లేని సంసారసాగరాన్ని దాటలేడు. శ్రేష్ఠులైన మునీంద్రులు కూడా, నీ నామ స్మరణాన్ని మరచి అన్య విషయాలపై ఆసక్తి కలవారయితే వారు పగలంతా పనికిమాలిన పనులలో పడి తిరుగుతూ, రాత్రిళ్లు నిద్రలో పడి, స్వప్నంలో కనిపించే అనేకమైన సంపదలకు సంతోషపడుతూ శరీరం అందలి రోగాది వికారాలకు విచారపడుతూ, ప్రయత్నాలన్నీ భగ్నంకాగా భూలోకంలో సంసారభంధాలలో చిక్కుకుని తిరుగుతారు. కోరికలు లేకుండా ధర్మమార్గంలొ నిన్ను సేవించే పుణ్యపురుషుల చెవులగుండా నీవు వారిలో ప్రవేశిస్తావు. నీపై భక్తి ప్రపత్తుల వల్ల పరిశుధ్ధమైన వారి హృదయ కమల పీఠం మీద స్థిరంగా ఉంటావు.