తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
మైన రూపంబు నాకుఁ బ్రత్యక్ష మయ్యె
నదియుఁగాక వివేకోదయమునఁ జేసి
వరద! నీ రూప మజ్ఞాన గురుతమో ని
వారకం బయ్యె నాకు శశ్వత్ప్రదీప!
టీకా:
నలినాక్ష = విష్ణుమూర్తీ {నలినాక్షుడు - పద్మములవంటి కన్నులు ఉన్న వాడు, విష్ణువు}; మాయా = మాయ యొక్క; గుణ = గుణముల; వ్యతికరమునన్ = పరస్పర మేళనము; చేసి = వలని; కార్యంబు = ఫలితము; ఐన = అయిన; సృష్టి = సృష్టి మొత్తము యొక్క; రూపమునన్ = స్వరూపములో; ప్రకాశించు = ప్రకాశించే; నీ = నీయొక్క; ఘన = గొప్ప; రూప = రూపముయొక్క; విభవంబున్ = వైభవమును; రూపింపన్ = ఊహించుటకు; దేహధారుల = శరీరధారుల; కున్ = కు; దుర్విభావ్యంబున్ = చక్కగాభావించుటకు కష్టమైనది; తలపోయ = ఆలోచించి చూస్తే; భగవంతుడవున్ = పూజ్యుడవు; ఐన = అయిన; పద్మాక్ష = విష్ణుమూర్తీ {పద్మాక్షుడు - పద్మములవంటి కన్నులు కలవాడు. విష్ణువు}; నీ = నీయొక్క; స్వరూపంబున్ = స్వరూపము; కంటెన్ = కంటె; అన్యము = వేరైనది; ఒక్కటి = ఒక్కటైనా; సత్యమై = నిజముగ; బోధకము = తెలియునది; ఐనయది = అయినట్టిది; లేదు = లేదు; కాన = కావున; అతుల = సాటిలేనిదియును; దివ్య = దివ్యమైనదియును; ఐన = అయినట్టి; రూపంబున్ = రూపమున; నాకు = నాకు; ప్రత్యక్షము = ప్రత్యక్షము {ప్రత్యక్షము - ప్రతి (ఎదురుగ) అక్షము (కంటికి) ఐ ఉన్నది}; అయ్యెన్ = అయ్యెను; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; వివేక = వివేకమును; ఉదయమునన్ = కలిగించుట; చేసి = వలన; వరద = విష్ణుమూర్తీ {వరదః - వరములను ద (ప్రసాదించు) వాడు, విష్ణువు, విష్ణుసహస్రనామాలు 330వ నామం}; నీ = నీయొక్క; రూపము = స్వరూపము; అజ్ఞాన = అజ్ఞానము అను; గురు = దట్టమైన; తమస్ = చీకటిని; నివారకంబున్ = పోగొట్టునది; అయ్యెన్ = అయ్యెను; నాకున్ = నాకు; శశ్వత్ప్రదీప = విష్ణుమూర్తి {శశ్వత్ప్రదీప - శశ్వత్(శాశ్వతమైన) ప్రదీపుడు (వెలుగును ప్రసాదించువాడు), విష్ణుమూర్తి}.
భావము:
“తామర పూలవంటి కన్నులు గల స్వామీ! నారాయణా! ఈ సృష్టి మాయాగుణంతో సంపర్కంవల్ల ఏర్పడింది. మా వంటి దేహధారులకు ఈ సృష్టి రూపంలో ప్రకాశించే నీ యొక్క ఘనమైన స్వరూపాన్ని నిరూపించటం సాధ్యం కాదు. కమలాక్షా! నీ స్వరూపం కంటె మరొకటి సత్యమైనది, తెలియదగినది లేదు. ఓ వరదా! సాటిలేని నీ మనోహర రూపం నాకు సాక్షాత్కరించింది. నాలో వివేకం వికసించింది. జ్యోతిర్మయా! అటువంటి జ్ఞానం కలగడంచేత నీ రూపం నా అజ్ఞానం అనే పెనుచీకటిని పోగొట్టింది. అందువల్ల నీ రూపమే నా పాలిటికి శాశ్వతమైన జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేది.