తృతీయ స్కంధము : విరాడ్విగ్రహ ప్రకారంబు
- ఉపకరణాలు:
లలిత విలోల నిర్మలజలప్రతిబింబిత పూర్ణచంద్రమం
డలము దదంబుచాలన విడంబనహేతువు నొందియున్ వియ
త్తలమునఁ గంపమొందని విధంబున సర్వశరీరధర్మముల్
కలిగి రమించు నీశునకుఁ గల్గఁగ నేరవు కర్మబంధముల్.
టీకా:
లలిత = అందమైన; విలోల = కదులుచున్న; నిర్మల = నిర్మలమైన; జల = నీటిలో; ప్రతిబింబిత = ప్రతిఫలించిన; పూర్ణ = నిండు; చంద్ర = చంద్ర; మండలము = బింబము; తత్ = ఆ; అంబు = నీటిలో; చాలన = కదలికలు; విడంబన = అనుకరించునట్టి; హేతువును = కారణము; ఒందియున్ = పొందియును; వియత్ = ఆకాశ; తలమునన్ = స్థలమున; కంపము = కదలికలు; ఒందని = పొందని; విధంబునన్ = విధముగ; సర్వ = సర్వమైన; శరీర = శరీర; ధర్మములు = లక్షణములు; కలిగి = కూడి ఉండి; రమించు = క్రీడించు; ఈశున్ = విష్ణుని; కున్ = కి; కల్గగ = కలుగ; నేరవు = సమర్థములు కావు; కర్మ = కర్మముల యొక్క; బంధముల్ = బంధములు.
భావము:
అందంగా అటూ ఇటూ కదలుతూ ఉన్న స్వచ్ఛమైన కోనేటి నీటిలో ప్రతిబింబించే నిండు పున్నమి నాటి చంద్రబింబం ఆ నీటి కదలిక వల్ల కదులు తున్నట్లు కన్పిస్తుంది. జలం కదలిక వల్ల ప్రతిబింబం కదలినా ఆకాశంలో ఉన్న చంద్రబింబం ఏ మాత్రం చలించదు. అదే విధంగా, సర్వజీవుల శరీర ధర్మాలను కలిగి క్రీడించే ఈశ్వరునకు కర్మబంధాలు ఏ మాత్రమూ అంటవు.