ద్వితీయ స్కంధము : పూర్ణి
- ఉపకరణాలు:
నిరుపమగుణజాలా! నిర్మలానందలోలా!
దురితఘనసమీరా! దుష్టదైత్యప్రహారా!
శరధిమదవిశోషా! చారుసద్భక్తపోషా!
సరసిజదళనేత్రా! సజ్జనస్తోత్రపాత్రా!
టీకా:
నిరుపమ = సాటిలేని; గుణ = గుణముల; జాలా = సమూహము కలవాడ; నిర్మల = మలినము లేని; ఆనంద = ఆనందముతో; లోలా = వర్తించు వాడ; దురిత = పాపములు అను; ఘన = మేఘములకు; సమీర = వాయువు వంటి వాడ; దుష్ట = దుష్టమైన; దైత్య = రాక్షసులను; ప్రహారా = సంహరించినవాడ; శరధి = సముద్రుని; మద = గర్వమును; విశోషా = మాపినవాడ; చారు = చక్కటి; సత్ = మంచి; భక్తన్ = భక్తులను; పోషా = పోషించువాడా; సరసిన్ = సరసులో; జ = పుట్టినదాని (పద్మము యొక్క) {సరసిజదళ - సరసున జ (పుట్టినది, పద్మము) యొక్క దళ (రేకులు)}; దళ = రేకుల వంటి; నేత్రా = కన్నులు కలవాడ; సత్ = మంచి; జనన్ = జనుల; స్తోత్రన్ = స్తోత్రములకు; పాత్రా = తగినవాడ.
భావము:
ఓ శ్రీరామ చంద్ర ప్రభు! అనంతగుణసాగరా! నీవు నిర్మలానందసాగరమున ఓలలాడుచుండు వాడవు. వాయువు మేఘలను చెదరగొట్టునట్లు పాపాలను చెదరగొట్టువాడవు. క్రూర మైన రాక్షసులను ఎందరినో సంహరించినవాడవు, సముద్రుని గర్వం సర్వం పరిహరించినవాడవు, భక్తకోటిని చక్కగా పోషించువాడవు, కలువరేకుల వంటి కన్నులు గలవాడవు, సజ్జనులచే స్తుతింపబడువాడవు.