పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : వైకుంఠపుర వర్ణనంబు

  •  
  •  
  •  

2-234-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీకాంతాతిలకంబు రత్నరుచిరాజిప్రేంఖితస్వర్ణడో
లాకేళిన్ విలసిల్లి తత్కచభరాలంకార స్రగ్గంధలో
భాకీర్ణప్రచరన్మధువ్రత మనోజ్ఞాలోలనాదంబు ల
స్తోకానుస్వర లీల నొప్పఁగ నిజేశున్ వేడ్కతోఁ బాడఁగన్.

టీకా:

శ్రీకాంతాతిలకంబున్ = లక్ష్మీదేవి {శ్రీకాంతా తిలకము- శుభకరమైన స్త్రీలలో ఉత్తమురాలు - లక్ష్మి}; రత్న = రత్నముల; రుచి = కాంతుల; రాజిన్ = పుంజములచే; ప్రేంఖితన్ = ఊపబడుతున్న; స్వర్ణ = బంగారు; డోలా = ఊయల; కేళిన్ = కేళితో; విలసిల్లి = ప్రకాశిస్తూ; తత్ = ఆమె; కచ = కొప్పు; భర = నిండా ఉన్న; అలంకార = అలంకరింపబడ్డ; స్రక్ = పూలదండ యొక్క; గంధ = సువాసన వలన; లోభ = ఆకాంక్ష; ఆకీర్ణ = సంకీర్ణమై; ప్రచరత్ = తిరుగుతున్న; మధువ్రత = తుమ్మెదల యొక్క; మనోఙ్ఞ = మనోహరమైన; ఆలోల = సంచలిస్తున్న; నాదంబున్ = ఝంకార నాదముతో; అస్తోక = గొప్ప; అనుస్వర = శ్రుతి కల్పుతున్న; లీలన్ = విధముగ; ఒప్పఁగన్ = ఒప్పునట్లు; నిజ = తన; ఈశున్ = భర్తను; వేడ్కన్ = ఇష్టము; తోఁన్ = తో; పాడఁగన్ = కీర్తిస్తుండగ.

భావము:

శ్రీ మహాలక్ష్మి రత్నకాంతులతో విరాజిల్లే బంగారపు తూగుటూయెలలో ఊగుతు ఉన్నది. ఆమె కొప్పులో ముడుచుకొన్న సుమమాలికల సుగంధం మీది అశతో గుమిగూడిన తుమ్మెదలు మనోజ్ఞంగా జుమ్మని రొద చేస్తూ విహరిస్తున్నాయి. ఆ భ్రమర ఝుంకారమే శ్రుతిగా శ్రీదేవి తన పతి శ్రీపతిమీద పాటలు పాడుతున్నది.