ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు
- ఉపకరణాలు:
అగుణుండగు పరమేశుఁడు
జగములఁ గల్పించుకొఱకుఁ జతురత మాయా
సగుణుం డగుఁ గావున హరి
భగవంతుం డనఁగఁ బరఁగె భవ్యచరిత్రా!
టీకా:
అగుణుండు = గుణములు లేనివాడు; అగు = అయిన; పరమేశుఁడు = భగవంతుడు {పరమేశుడు - అత్యున్నత ప్రభువు - భగవంతుడు}; జగములన్ = లోకములను; కల్పించు = సృష్టించు; కొఱకున్ = కోసము; చతురతన్ = మిక్కిలి నేర్పుతో; మాయా = మాయతో కూడిన, నిజముకాని; సగుణుండు = గుణములు కలవాడు; అగున్ = అగును; కావునన్ = అందుచేతనే; హరిన్ = విష్ణువును; భగవంతుండు = భగవంతుడు {భగవంతుడు - వీర్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, సృష్టికి మూలస్థానము}; అనఁగన్ = అనుట; పరగె = యుక్తమైనది, తగి ఉన్నది; భవ్య = గొప్ప; చరిత్రా = చరిత్రకలవాడ.
భావము:
నారదా! పవిత్ర చరిత్రుడా! పరమేశ్వరుడు నిర్గుణుడు ఐనా జగత్తులను సృష్టించడానికై నేర్పుతో ఆయన తన మాయా ప్రభావం వల్ల గుణసహితు డవుతున్నాడు. అందువల్లనే ఆయన భగవంతుడు అని చెప్పబడుతున్నాడు.