పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : హరిభక్తిరహితుల హేయత

  •  
  •  
  •  

2-47-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వాసుదేవశ్లోకవార్త లాలించుచుఁ-
గాల మే పుణ్యుండు డుపుచుండు
తని యాయువుఁ దక్క న్యుల యాయువు-
నుదయాస్తమయముల నుగ్రకరుఁడు
వంచించి గొనిపోవు; వాఁడది యెఱుఁగక-
జీవింతుఁ బెక్కేండ్లు సిద్ధ మనుచు
నంగనా, పుత్ర, గేహారామ, విత్తాది-
సంసారహేతుక సంగ సుఖముఁ

2-47.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిలి వర్తింపఁ గాలంబు ఱి యెఱింగి
దండధరకింకరులు వచ్చి తాడనములు
సేసి కొనిపోవఁ బుణ్యంబు సేయ నైతిఁ
బాపరతి నైతి నని బిట్టు లవరించు.

టీకా:

వాసుదేవ = సమస్తాత్మల వసించు దేవుని; శ్లోక = కీర్తించు; వార్తలు = విశేషములను; ఆలించుచున్ = వినుచు; కాలమున్ = (తన) సమయమును; ఏ = ఏ; పుణ్యుండు = పుణ్యమూర్తి; గడుపుచుండున్ = గడుపుతుండునో; అతని = అతని; ఆయువున్ = ఆయుష్షును, జీవితకాలమును; తక్క = తప్పించి; అన్యుల = ఇతరుల; ఆయువున్ = ఆయుష్షును, జీవితకాలమును; ఉదయ = ఉదయించుటలోను; అస్తమయములన్ = అస్తమించుటలోను; ఉగ్ర = తీవ్రమైన; కరుండు = కిరణములు కలవాడు, సూర్యుడు; వంచించిన్ = మడిచిపెట్టేసి; కొనిపోవున్ = తీసుకొనిపోవును; వాఁడు = అతడు; అదిన్ = దానిని; ఎఱుఁగక = తెలియక; జీవింతున్ = జీవించెదను; పెక్కేండ్లు = చాల సంవత్సరములు; సిద్ధము = తప్పకుండగ; అనుచున్ = అనుకొనుచు; అంగనా = స్త్రీలు; పుత్ర = సంతానము; గేహ = ఇళ్ళు; ఆరామ = తోటలు; విత్త = ధనము; ఆదిన్ = మొదలగు; సంసార = సంసారమునకు; హేతుక = కారణభూత; సంగ = తగులముల, బంధనముల; సుఖమున్ = సుఖములకు; తగిలి = తగుల్కొని;
వర్తింపన్ = ప్రవర్తిల్లుతుండగ; కాలంబు = మరణకాల; తఱి = సమయము; ఎఱిగిన్ = తెలిసిన; దండ = దండమును; ధర = ధరించువాడు, యముని; కింకరులు = సేవకులు; వచ్చి = వచ్చి; తాడనములున్ = దెబ్బలుకొట్టుట; చేసిన్ = చేసి; కొనిపోవన్ = తీసుకొని పోవుచుండగ; పుణ్యంబున్ = పుణ్యమును; చేయన్ = చేయనివానిని; ఐతిన్ = అయితిని; పాపన్ = పాపములు ఎడ; రతిన్ = ప్రీతి కలవానిని; ఐతిన్ = అయితిని; అనిన్ = అనుకొనుచు; బిట్టు = మిక్కిలి, గట్టిగ; పలవరించున్ = విలపించును.

భావము:

భగవంతుని కథలు వింటూ కాలం గడిపెడి పుణ్యాత్ముడ ఆయుస్సు తప్ప, ఇతరుల ఆయుస్సును సూర్యుడు ఉదయాస్తమయ సమయాలలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడు. ఆ సంగతి తెలియక మూఢుడు నేను తప్పక బహుకాలం జీవిస్తాను అనుకుంటాడు. సంసార కారణాలైన ఆలుబిడ్డలు, ఇల్లువాకిళ్లు, తోటలు దొడ్డు ధనము మొదలైన వాటి తగులంలో చిక్కువడతాడు. కాలం అయినప్పుడు, యమభటులు తోలుకుపోతుంటే, అతను అయ్యో. నేను పుణ్యం చేయలేదే, పాపం చేశానే అంటూ వాడు గోడుగోడున ఏడుస్తాడు.