పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు

  •  
  •  
  •  

12-15-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శంతనుని యనుజండగు దేవాపియు, నిక్ష్వాకువంశజుండగు మరుత్తును, యోగయుక్తులై కలాపగ్రామనిలయులై కలియుగాంతంబున వాసుదేవప్రేరితులై, ప్రజల నాశ్రమాచారంబులు దప్పకుండ నడపుచు, నారాయణస్మరణంబు నిత్యం బొనర్చి, కైవల్యపదప్రాప్తులగుదు; రిక్కరణి నాలుగుయుగంబుల రాజులును నే నెఱింగించిన పూర్వరాజన్యులును, వీరందఱును సమస్తవస్తు సందోహంబుల యందు మమత నొంది యుత్సాహవంతులై యుండి పిదప నీ భూతలంబువదలి నిధనంబు నొందిరి; కావునఁ గాలంబుజాడ యెవ్వరికిం గానరాదు; మత్పూర్వులు హరిధ్యాన పరవశులై దయాసత్యశౌచశమదమాది ప్రశస్తగుణంబులం బ్రసిద్ధు లై నడచి; రట్లు గావున.

టీకా:

శంతనుని = శంతనుని; అనుజుండు = తమ్ముడు; అగు = ఐన; దేవాపియున్ = దేవాపి; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుని; వంశజుండు = వంశములో పుట్టినవాడు; అగు = ఐన; మరుత్తును = మరుత్తు; యోగయుక్తులు = యోగావలంభకులు; ఐ = అయ్యి; కలాప = కలాప అనెడి; గ్రామ = ఊరిలో; నిలయులు = ఉండువారు; ఐ = అయ్యి; కలియుగాంతంబునన్ = కలియుగాంతము చివర; వాసుదేవ = కృష్మునిచే; ప్రేరితులు = ప్రేరేపింబడినవారు; ఐ = అయ్యి; ప్రజలన్ = లోకులను; ఆశ్రమాచారంబులు = చతురాశ్రమాచారముల; తప్పకుండ = లోటులేకజరుగునట్లు; నడపుచు = నిర్వహించుచు; నారాయణ = విష్ణుమూర్తిని; స్మరణంబు = స్మరించుట; నిత్యంబున్ = ఎడతెగకుండ; ఒనర్చి = చేసి; కైవల్య = కైవల్య; పద = స్థానమును; ప్రాప్తులు = పొందినవారు; అగుదురు = ఔతారు; ఈ = ఈ; కరణిన్ = విధముగ; నాలుగు = నాలుగు (4); యుగంబుల = యుగములకుచెందిన; రాజులును = రాజులు; నేన్ = నేను; ఎఱింగించిన = తెలిపిన; పూర్వ = పూర్వకాలపు; రాజన్యులును = రాజులు; వీరందఱును = వీళ్ళందరు; సమస్త = సమస్తమైన; వస్తు = వస్తువుల; సందోహంబులన్ = సమూహముల; అందున్ = ఎడల; మమతన్ = మమకారం; ఒంది = పొంది; ఉత్సాహవంతులు = ఉత్సాహముగలవారు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; పిదపన్ = పిమ్మట; ఈ = ఈ; భూతలంబున్ = భూలోకమును; వదలి = విడిచిపెట్టి; నిధనంబున్ = మరణంబును; ఒందిరి = పొందారు; కావునన్ = కనుక; కాలంబుజాడ = కాలగమనమును; ఎవ్వరికిన్ = ఎవరికికూడ; కానరాదు = గమనింపరాదు; మత్ = మా; పూర్వులు = పెద్ధలు; హరి = విష్ణుమూర్తి; ధ్యాన = ధ్యానముచేయుటలో; పరవశులు = మైమరచినవారు; ఐ = అయ్యి; దయ = దయ; సత్య = సత్యము; శౌచ = శౌచము; శమ = శమము; దమ = దమము; ఆది = మొదలైన; ప్రశస్త = శ్రేష్ఠమైన; గుణంబులన్ = గుణములతో; ప్రసిద్ధులు = పేరుపొందినవారు; ఐ = అయ్యి; నడచిరి = మెలగిరి; అట్లుగావున = అందుచేత.

భావము:

శంతనుని తమ్ముడు దేవాపి, ఇక్ష్వాకు వంశస్థు డైన మరుత్తు యోగాన్ని అవలంబించి కలాప గ్రామంలో కలియుగాంతం వరకూ ఉంటారు. వారు వాసుదేవుని వలన ప్రేరణ పొందుతారు. ప్రజలు అందరు ఆశ్రమాచారాలు పాటించేలా నడిపిస్తూ నిత్యం నారాయణస్మరణ గావిస్తూ కైవల్యం పొందుతారు. ఈవిధంగా నాలుగు యుగాల రాజులు ఇంతకు ముందు నేను చెప్పిన రాజులు అందరు లోకంలోని సమస్త వస్తువుల మీద మమకారం పెంచుకుని ఉత్సాహంతో జీవితాన్ని గడిపి ఈ భూమండలాన్ని విడిచిపెట్టి మరణం వడిలోకి చేరారు. కాలగమనాన్ని ఎవరు గమనించలేరు. మా పెద్దలు విష్ణుధ్యాన పరాయణులై తమ జీవితాలు గడిపారు. దయా, సత్యం, శౌచం, శమం, దమం మున్నగు సద్గుణాలతో ప్రసిద్ధులై కీర్తిమంతులు అయ్యారు. అందుచేత....