ద్వాదశ స్కంధము : మార్కండేయోపాఖ్యానంబు
- ఉపకరణాలు:
లోకంబులు గల్పాంతసమయంబునం గబంధమయంబులయి, యంధ కార బంధురంబులయి యున్నయెడ నేకాకి యయి చరించుచు బాలార్కకోటి తేజుం డయిన బాలుని హృదయంబునం బ్రవేశించి యనేక సహస్ర వత్సరంబులు దిరిగి వటపత్రశాయి యయిన యబ్బాలునిఁ గ్రమ్మఱఁ గనియె” నని చెప్పిన శౌనకాదులు సూతునిం గనుగొని, “యా మునీంద్రునకు నీ ప్రభావం బెట్లుగలిగె?”నని యడిగిన నతం డిట్లనియె.
టీకా:
లోకంబులు = సర్వలోకములు; కల్పాంత = ప్రళయకాల; సమయంబునన్ = సమయనందు; కబంధ = నీటి; మయంబులు = మయమైపోయినవి; అయి = అయ్యి; అంధకార = చీకట్లతో; బంధురంబులు = నిండిపోయినవి; అయి = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు; ఏకాకి = ఒంటరిగానున్నవాడు; అయి = అయ్యి; చరించుచున్ = మెలగుచు; బాల = బాల; అర్క = సూర్యులు; కోటి = అనేకులకు సమానమైన; తేజుండు = తేజస్సుగలవాడు; అయిన = ఐన; బాలుని = బాలుని యొక్క; హృదయంబునన్ = హృదయమునందు; ప్రవేశించి = ప్రవేశించి; అనేక = అనేక; సహస్ర = వేల; వత్సరంబులున్ = సంవత్సరములు; తిరిగి = సంచరించి; వట = మఱ్ఱి, వటము; పత్ర = ఆకుపైన; శాయి = పరున్నస్వామి; అయిన = ఐనట్టి; ఆ = ఆ; బాలుని = పిల్లవానిని; క్రమ్మఱన్ = మరల; కనియె = చూసెను; అని = అని; చెప్పినన్ = చెప్పగా; శౌనక = శౌనకుడు; ఆదులు = మున్నగువారు; సూతునిన్ = సూతుడుని; కనుంగొని = చూసి; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రున్ = శ్రేష్ఠున; కున్ = కు; ఈ = ఇట్టి; ప్రభావంబు = మహిమ; ఎట్లు = ఏ విధముగా; కలిగెను = లభించింది; అని = అని; అడిగినన్ = ప్రశ్నించగా; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
కల్పం అంతం అయ్యే సమయంలో అంటే ప్రళయకాలంలో లోకాలన్నీ జలమయమై పోయాయి చీకట్లతో నిండిపోయాయి. అటువంటి సమయంలో ఆయన ఒక్కడే సంచరిస్తూ కోటిబాలసూర్యుల తేజస్సుతో ప్రకాశించే ఒక బాలుని హృదయంలో ప్రవేశించి, ఎన్నో వేల సంవత్సరాలు అక్కడే సంచరించి, మళ్ళా మఱ్ఱియాకు మీద పవ్వళించిన ఆ బాలుని దర్శించాడు.” ఈ విధంగా సూతుడు చెప్పగా శౌనకాదులైన. “ఆ మునీంద్రునికి ఇంతటి మహిమ ఏవిధంగా లభించింది.” అని ప్రశ్నించారు. అంత సూతుడు ఈ విధంగా చెప్పాడు.