పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : మార్కండేయోపాఖ్యానంబు

  •  
  •  
  •  

12-31-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తొల్లిటి యుగమునఁ దపములఁ
ల్లిదులగు ఋషుల మహిమ భాషింపఁగ రం
జిల్లెడు మార్కండేయుం
డుల్లంబున హరిని నిలిపి యుడుగక బ్రదికెన్.

టీకా:

తొల్లిటి = పూర్వపు; యుగమునన్ = యుగమునందు; తపములన్ = తప్పస్సుచేయుటలో; బల్లిదులు = సమర్థులు; అగు = ఐన; ఋషుల = మునులు యొక్క; మహిమన్ = గొప్పదనమును; భాషింపగన్ = ఉపన్యసించుచుండగా; రంజిల్లెడు = అనురాగముచెందెను; మార్కండేయుండు = మార్కండేయుడు; ఉల్లంబునన్ = మనసులో; హరిని = విష్ణుమూర్తిని; నిలిపి = నిలుపుకొని; ఉడుగక = విడువక, తగ్గక; బ్రదికెన్ = జీవించెను.

భావము:

పూర్వయుగంలో తపస్సుచేత సమర్ధులైన మునీశ్వరులు హరి మహిమలను చెప్పటం వలన, మార్కండేయుడు హరిని మనస్సులో నిలుపుకుని ఎప్పుడూ విడచిపెట్టకుండా ఆనందంతో మనుగడ సాగించాడు.

12-32-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకంబులు గల్పాంతసమయంబునం గబంధమయంబులయి, యంధ కార బంధురంబులయి యున్నయెడ నేకాకి యయి చరించుచు బాలార్కకోటి తేజుం డయిన బాలుని హృదయంబునం బ్రవేశించి యనేక సహస్ర వత్సరంబులు దిరిగి వటపత్రశాయి యయిన యబ్బాలునిఁ గ్రమ్మఱఁ గనియె” నని చెప్పిన శౌనకాదులు సూతునిం గనుగొని, “యా మునీంద్రునకు నీ ప్రభావం బెట్లుగలిగె?”నని యడిగిన నతం డిట్లనియె.

టీకా:

లోకంబులు = సర్వలోకములు; కల్పాంత = ప్రళయకాల; సమయంబునన్ = సమయనందు; కబంధ = నీటి; మయంబులు = మయమైపోయినవి; అయి = అయ్యి; అంధకార = చీకట్లతో; బంధురంబులు = నిండిపోయినవి; అయి = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు; ఏకాకి = ఒంటరిగానున్నవాడు; అయి = అయ్యి; చరించుచున్ = మెలగుచు; బాల = బాల; అర్క = సూర్యులు; కోటి = అనేకులకు సమానమైన; తేజుండు = తేజస్సుగలవాడు; అయిన = ఐన; బాలుని = బాలుని యొక్క; హృదయంబునన్ = హృదయమునందు; ప్రవేశించి = ప్రవేశించి; అనేక = అనేక; సహస్ర = వేల; వత్సరంబులున్ = సంవత్సరములు; తిరిగి = సంచరించి; వట = మఱ్ఱి, వటము; పత్ర = ఆకుపైన; శాయి = పరున్నస్వామి; అయిన = ఐనట్టి; ఆ = ఆ; బాలుని = పిల్లవానిని; క్రమ్మఱన్ = మరల; కనియె = చూసెను; అని = అని; చెప్పినన్ = చెప్పగా; శౌనక = శౌనకుడు; ఆదులు = మున్నగువారు; సూతునిన్ = సూతుడుని; కనుంగొని = చూసి; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రున్ = శ్రేష్ఠున; కున్ = కు; ఈ = ఇట్టి; ప్రభావంబు = మహిమ; ఎట్లు = ఏ విధముగా; కలిగెను = లభించింది; అని = అని; అడిగినన్ = ప్రశ్నించగా; అతండు = అతను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

కల్పం అంతం అయ్యే సమయంలో అంటే ప్రళయకాలంలో లోకాలన్నీ జలమయమై పోయాయి చీకట్లతో నిండిపోయాయి. అటువంటి సమయంలో ఆయన ఒక్కడే సంచరిస్తూ కోటిబాలసూర్యుల తేజస్సుతో ప్రకాశించే ఒక బాలుని హృదయంలో ప్రవేశించి, ఎన్నో వేల సంవత్సరాలు అక్కడే సంచరించి, మళ్ళా మఱ్ఱియాకు మీద పవ్వళించిన ఆ బాలుని దర్శించాడు.” ఈ విధంగా సూతుడు చెప్పగా శౌనకాదులైన. “ఆ మునీంద్రునికి ఇంతటి మహిమ ఏవిధంగా లభించింది.” అని ప్రశ్నించారు. అంత సూతుడు ఈ విధంగా చెప్పాడు.

12-33-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భూవినుత! బ్రహ్మచర్యము
దా దలక నిష్ఠచేతఁ థ్యము గాఁగన్
భావించి హరిఁదలంచుచుఁ
గోవిదనుతుఁడై మృకండు గుణముల వెలసెన్.

టీకా:

భూవినుత = పరీక్షిన్మహారాజా {భూవినుతుడు - భూలోకమున కీర్తింపబడు వాడు}; బ్రహ్మచర్యమున్ = బ్రహ్మచర్యమును; తాన్ = అతను; వదలక = వదిలిపెట్టకుండా; నిష్ఠ = నిష్ఠ; చేతన్ = తో; తథ్యము = నిలబడినది; కాగన్ = అగునట్లు; భావించి = తలచుకొని; హరిన్ = విష్ణుమూర్తిని; తలంచుచు = ధ్యానించుచు; కోవిద = విబుధులచే; నుతుడు = స్తుతింపబడినవాడు; ఐ = అయ్యి; మృకండు = మృకండుడు; గుణముల = గొప్పగుణములతో; వెలసెన్ = ప్రసిద్ధికెక్కెను.

భావము:

“లోకప్రసిద్ధులారా! మృకండు మహర్షి జగన్నుత మైన బ్రహ్మచర్యాన్ని అవలంభించి, నిష్ఠతో హరిని శాశ్వతుడుగా భావించి, మనసులో నిత్యము ధ్యానిస్తూ, విబుధుల స్తుతిపాత్రమైన ఉత్తమ గుణాలు కలిగి తపస్సు చేస్తున్నాడు.

12-34-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లుదపంబు సేయు నతనికి హరిహరులు ప్రత్యక్షంబయి “వరం బడుగు” మనిన గుణగణాఢ్యుం డయిన కుమారు నడిగిన ”నట్ల కాక” యని యతండు గోరిన వరంబిచ్చి యంతర్ధానంబు నొంది; రనంతరంబ యమ్మునికి మార్కండేయుం డుదయించి నియమ నిష్ఠా గరిష్ఠు డయి యుండ; మృత్యువు వానిం బాశబద్ధుం జేసిన నెదిర్చి మిత్తిని ధిక్కరించి, పదివేల హాయనంబులు తపంబు సలుప, నింద్రుండు భయంపడి యమ్ముని వరుని యుగ్రతపంబు భంగపఱచుటకు దేవతాంగనలం బంప, వారే తెంచునెడఁ బుష్పఫలభరితంబును; మత్తమధుకర శుక పికాది శకుం తలారవ నిరంతర దిగంతరంబును; జాతివైర రహిత మృగ పక్షికుల సంకులంబును, సారస చక్రవాక బక క్రౌంచ కారండవ కోయష్టి కాది జలవిహంగమాకులిత సరోవర సహస్ర సందర్శనీయంబును నగు నా తపోవనంబున జటావల్కలధారి యై హవ్యవాహనుండునుంబోలెఁ దపంబు సేయు మునీంద్రునిం గని యయ్యంగనలు వీణావేణు వినోద గానంబుల నలవరింప మెచ్చక ధీరోదాత్తుం డగు నమ్మునీంద్రుని గెల్వనోపక యింద్రుని కడకుం జని; రంత హరి యతని తపంబునకుఁ బ్రసన్నుండై యావిర్భవించినం గనుగొని ”దేవా! నీ దివ్యనామస్మరణంబునంజేసి యీ శరీరంబుతోడన యనేక యుగంబులు బ్రదుకు నట్లు గాఁజేయవే” యనినం గరుణించి యిచ్చుటయును.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తపంబున్ = తపస్సును; చేయు = చేస్తున్న; అతని = అతని; కిన్ = కి; హరి = విష్ణువు; హరులు = ఈశ్వరుడు లు; ప్రత్యక్షంబు = సాక్షాత్కరించినవారు; అయి = అయ్యి; వరంబున్ = వరము; అడుగుము = కోరుకొనుము; అనినన్ = అనగా; గుణ = సుగుణముల; గణ = సముదాయములచే; ఆఢ్యుండు = సంపన్నుడు; అయిన = ఐనట్టి; కుమారున్ = పుత్రుని; అడిగినన్ = కోరుకొనగా; అట్లకాక = అలాగే; అని = అని; అతండు = అతను; కోరిన = కోరుకోన్న; వరంబున్ = వరమును; ఇచ్చి = ప్రసాదించి; అంతర్దానంబు = అదృశ్యము; ఒఁదిరి = అయ్యిరి; అనంతరంబ = పిమ్మట; ఆ = ఆ; ముని = ముని; కిన్ = కి; మార్కండేయుండు = మార్కండేయుడు; ఉదయించి = పుట్టి; నియమ = నియమపాలనలో; నిష్ఠా = నిష్ఠకలిగుండుట యందు; గరిష్ఠుండు = గొప్పవాడు; అయి = అయ్యి; ఉండన్ = ఉండగా; మృత్యువు = యమధర్మరాజు; వానిన్ = అతనిన్; పాశ = యమపాశమునకు; బద్ధున్ = కట్టబడినవానిగా; చేసినన్ = చేయగా; ఎదిర్చి = ఎదిరించి; మిత్తిని = మృత్యువును; ధిక్కరించి = తృణీకరించి; పదివేల = పదివేల (10,000); హాయనంబులు = సంవత్సరంబులు; తపంబున్ = తపస్సును; సలుపన్ = చేయగా; ఇంద్రుండు = ఇంద్రుడు; భయంపడి = బెదిరిపోయి; ఆ = ఆ; ముని = మునులలో; వరుని = ఉత్తముని; ఉగ్ర = తీవ్రమైన; తపంబున్ = తపస్సును; భంగపఱచుట = భంగంచేయడాని; కున్ = కోసము; దేవతాంగనలన్ = దేవతాస్త్రీలను, అప్సరలను; పంపన్ = పంపించగా; వారు = వారు; ఏతెంచు = వచ్చెడి; ఎడన్ = సమయమునందు; పుష్ప = పూలతో; ఫల = పండ్లతో; భరితంబును = నిండినది; మత్త = మదించిన; మధుకర = తుమ్మెదలు; శుక = చిలుకలు; పిక = కోకిలలు; ఆది = మొదలైన; శకుంతల = పక్షుల; అరావ = కూజితములతో; నిరంతర = ఎడతెగకుండ నిండిన; దిగంతరంబును = దిక్కులమధ్యప్రదేశంగలది; జాతి = జాతిస్వతఃసిద్ధమైన; వైర = శత్రుత్వలక్షణములు; రహిత = లేని; మృగ = జంతువుల; పక్షి = పక్షుల; కుల = సమూహములు; సంకులంబును = నిండియున్నది; సారస = బెగ్గురుపక్షులు; చక్రవాక = చక్రవాకపక్షులు; బక = కొంగలు; క్రౌంచ = క్రౌంచపక్షులు; కారండవ = బాతులు; కోయష్టిక = కొక్కెరలు; ఆది = మున్నగు; జలవిహంగ = నీటిపక్షులచే; సమాకులిత = సందడిగా ఉన్న; సరోవర = సరస్సులు; సహస్ర = అనేకములతో; సందర్శనీయంబు = చూడచక్కగానున్నట్టిది; అగు = ఐన; ఆ = ఆ; తపోవనంబునన్ = ముని ఆశ్రమప్రాంతములో; జటా = జటలు; వల్కల = నారచీరలు; ధారి = ధరించినవాడు; ఐ = అయ్యి; హవ్యవాహనుండును = అగ్నిదేవుని {హవ్యవాహనుడు - హవ్యములను మోసుకు పోవువాడు, అగ్ని}; బోలెన్ = వలె; తపంబున్ = తపస్సు; చేయు = చేయుచున్న; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; కని = కనుగొని, చూసి; ఆ = ఆ; అంగనలు = స్త్రీలు; వీణ = వీణానాదములతో; వేణు = మురళీపూరించుటలతో; వినోద = వినోదములతో; గానంబులన్ = గానములతో; అలవరింపన్ = స్వాధీనపరచుకొనబోగా; మెచ్చక = మెచ్చుకోలేదు; ధీరోదాత్తుండు = ధీరోదాత్తుడు; అగు = ఐన; ఆ = ఆ యొక్క; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; గెల్వన్ = జయింప; ఓపక = సమర్థులుకాక; ఇంద్రుని = ఇంద్రుని; కడ = వద్ద; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంత = పిమ్మట; హరి = విష్ణుమూర్తి; అతని = అతని; తపంబున్ = తపస్సున; కున్ = కు; ప్రసన్నుండు = సంతుష్టుడు; ఐ = అయ్యి; ఆవిర్భవించినన్ = ప్రత్యక్షముకాగా; కనుంగొని = చూసి; దేవా = భగవంతుడా; నీ = నీ యొక్క; దివ్య = మహిమాన్వితమైన; నామ = నామమును; స్మరణంబునన్ = స్మరించుట; చేసి = తో; ఈ = ఈ యొక్క; శరీరంబు = శరీరము; తోడనన్ = తోనే; అనేక = అనేకమైన; యుగంబులు = యుగాలపాటు; బ్రదుకు = జీవించు; అట్లుగా = విధముగా; చేయవే = కావింపుము; అనినన్ = అనగా; కరుణించి = దయచూపి; ఇచ్చుటయును = ఇచ్చెను.

భావము:

ఈ విధంగా తపస్సు చేస్తుంటే, విష్ణుమూర్తి, ఈశ్వరుడు ప్రత్యక్షమై “వరం కోరుకో” అన్నారు. ఆయన మంచి గుణసంపద కల కొడుకు కావాలని కోరుకున్నాడు. వాళ్ళిద్దరూ “అలాగే అగు గాక” అని అతను కోరిన వరాన్ని ప్రసాదించి అదృశ్యులయ్యారు. అంతట ఆ మునికి మార్కండేయుడు పుట్టి నియమ నిష్ఠలను చక్కగా పాటిస్తూ గొప్పవాడై ఉండగా, మృత్యువు వచ్చి తన పాశంతో కట్టివేయగా ఎదిరించి ఆ మృత్యువును తృణీకరించి పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసాడు. ఆ మార్కండేయుని తీవ్ర తపస్సుకు భయపడిన యింద్రుడు తపోభంగం చేయడం కోసం అప్సరసలను పంపించాడు. వారు వస్తూ పూలు పళ్ళతో నిండినది; మదించిన తుమ్మెదలు, చిలుకలు, కోకిలలు మున్నగు పక్షుల కూజితాలతో నిరంతరం నిండిన దిగంతాలు కలది; జాతివైరాన్ని విడచిపెట్టి సఖ్యతతో సంచరిస్తున్న జంతువులతో పక్షులతో నిండినది; బెగ్గురులు, జక్కవలు, కొంగలు, క్రౌంచలు, బాతులు, కొక్కెరలు మున్నగు నీటిపక్షులతో సందడిగా ఉన్న వేలాది సరోవరాలతో చూడముచ్చటగా ఉన్నది అగు ఆ తపోవనంలో జటలు, నారచీరలు ధరించి అగ్నిదేవునివలె తేజరిల్లుతూ తపస్సు చేస్తున్న మార్కండేయ మునివర్యుని చూసి ఆ అప్సరసలు వీణావాదనంతో వేణుగానంతో వినోదాలతో వివశుణ్ణి చెయ్యడానికి ఎంత ప్రయత్నించినా, అతను వారిని మెచ్చుకోలేదు, వారికి లొంగలేదు. ధీరోదాత్తుడైన ఆతనిని అప్సరసలు గెలువ లేక, తమ ఓటమిని అంగీకరించారు. యింద్రుని చెంతకు తిరిగి వెళ్ళిపోయారు.
విష్ణువు అతని తపస్సుకు మెచ్చి ప్రసన్నుడై ప్రత్యక్షం అయ్యాడు. మార్కండేయుడు విష్ణుదేవుని, “దేవా! దివ్యమైన నీ నామాన్ని స్మరిస్తూ ఈ శరీరంతోనే అనేక యుగాలు జీవించి ఉండేలా వరం ప్రసాదించు.” అని కోరాడు. విష్ణుమూర్తి ఆ వరం ప్రసాదించాడు.

12-35-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గము రక్షింప జీవులఁ జంప మనుపఁ
ర్తవై సర్వమయుఁడవై కానిపింతు
వెచట నీ మాయఁ దెలియంగ నెవ్వఁ డోపు?
విశ్వసన్నుత! విశ్వేశ! వేదరూప!

టీకా:

జగము = లోకమున; రక్షింపన్ = కాపాడుటకు; జీవులన్ = ప్రాణులను; చంపన్ = చంపడానికి; మనుపన్ = పోషించుటకు; కర్తవు = కర్తవు; ఐ = అయ్యి; సర్వ = సర్వమునందు; మయుడవు = నిండియుండువాడవు; ఐ = అయ్యి; కానిపింతువు = గోచరింతువు; ఎచటన్ = ఎక్కడైనా; నీ = నీ యొక్క; మాయన్ = మహిమను; తెలియంగన్ = తెలిసికొనుటకు; ఎవ్వడు = ఎవరుమాత్రము; ఓపున్ = చేయగలడు; విశ్వసన్నుత = హరి {విశ్వసన్నుతుడు - లోకములచే స్తుతింపబడువాడు, విష్ణువు}; విశ్వేశ = హరి {విశ్వేశుడు - విశ్వమునకు ప్రభువు, విష్ణువు}; వేదరూప = హరి {వేదరూప - వేదములు తన రూపమైనవాడు, విష్ణువు}.

భావము:

“విశ్వేశా! వేదరూపా! విశ్వసన్నుతా! జగత్తును, ప్రాణులను పుట్టించడానికీ పోషించడానికీ చంపడానికీ నీవే కర్తవు. నీవే సర్వమయుడవు. నీ మాయను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

12-36-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భిన్ముఖ్య దిశాధినాథవరులున్ ఫాలాక్ష బ్రహ్మాదులున్
జాతాక్ష! పురంద రాది సురులుం ర్చించి నీ మాయలం
దెలియన్ లేరఁట! నా వశంబె తెలియన్? దీనార్తినిర్మూల! యు
జ్జ్వపంకేరుహపత్రలోచన! గదాక్రాంబుజాద్యంకితా!"

టీకా:

బలభిత్ = ఇంద్రుడు {బలభిత్తు - బలాసురుని ధ్వంసము చేసినవాడు, ఇంద్రుడు}; ముఖ్య = మున్నగు; దిశాధినాథ = దిక్పాలక; వరులన్ = శ్రేష్ఠులను; ఫాలాక్ష = శివుడు {ఫాలాక్షుడు - ఫాలమున (నుదుట) అక్షుడు (కన్నుగలవాడు), శివుడు}; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులున్ = మున్నగువారు; జలజాతాక్ష = శ్రీహరీ {జలజాతాక్షుడు - జలజాతము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; పురందర = దేవేంద్రుడు {పురందరుడు - శత్రు పురములను వ్రక్కలించినవాడు, దేవేంద్రుడు}; ఆది = మున్నగు; సురలున్ = దేవతలుకూడ; చర్చించి = తరచిచూసినను; నీ = నీ యొక్క; మాయలన్ = మహిమలను; తెలియన్ = తెలిసికొన; లేరు = లేరు; అట = అట; నా = నాకు; వశంబె = సాధ్యమగునా; తెలియన్ = తెలిసికొనుటకు; దీనార్తినిర్మూల = శ్రీహరీ {దీనార్తినిర్మూలనుడు - దీనుల ఆర్తిని నిర్మూలించువాడు, విష్ణువు}; ఉజ్జ్వలపంకేరుహపత్రలోచన = శ్రీహరీ {ఉజ్జ్వలపంకేరుహపత్రలోచనుడు - ప్రకాశవంతమైన పద్మదళాలవంటి కన్నులు గలవాడు, విష్ణువు}; గదాచక్రాంబుజాద్యంకితా = శ్రీహరీ {గదాచక్రాంబుజాద్యంకితుడు - గద చక్రము పద్మములు అలంకారముగా కలవాడు, విష్ణువు}.

భావము:

శ్రీహరీ! జలజాతాక్షా! దీనుల దీనత్వాన్ని నాశనంచేసే మహానుభావా! ప్రకాశవంతమైన పద్మపత్రాలవంటి నేత్రాలుకలవాడా! గదాచక్రాదులతో అలంకృతమైన బాహువులుకలవాడా! ఇంద్రాది సకల దిక్పాలకులు, బ్రహ్మదేవుడు, పరమశివుడు మున్నగు దేవతలు సైతం ఎంత చర్చించినా నీ మాయలను అవగాహన చేసుకోలేరట. ఇంక నా వల్ల ఎక్కడ అవుతుంది?’

12-37-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వినుతించి, “దేవా! నీ మాయం జేసి జగంబు భ్రాంతం బై యున్నయది; యిది దెలియ నానతీవలయు” నని యడిగిన నతండు నెఱింగించి చనియె, మునియును శివపూజ సేయుచు హరిస్మరణంబు సేయ మఱచి శతవర్షంబులు ధారాధరంబులు ధారావర్షంబుచే ధరాతలంబు నింప, జలమయంబై యంధకారబంధురబైన, నంత నా తిమిరంబునం గన్నుగానక భయంపడి యున్నయెడ నా జలమధ్యంబున నొక వటపత్రంబునం బద్మరాగ కిరణపుంజంబుల, రంజిల్లు పాదపద్మంబులుగల బాలునిం గని, మ్రొక్కి యతని శరీరంబు ప్రవేశించి, యనేక కాలం బనంతం బగు జఠరాంతరంబునం దిరిగి; యతని చరణారావింద సంస్మరణంబు సేసి; వెలువడి కౌఁగలింపంబోయిన మాయఁ గైకొని యంతర్ధానంబునొంద; మునియు నెప్పటియట్ల స్వాశ్రమంబు సేరి తపంబు సేయుచున్న సమయంబున.

టీకా:

అని = అని; వినుతించి = స్తుతించి; దేవా = భగవంతుడా; నీ = నీ యొక్క; మాయన్ = మాయ; చేసి = వలన; జగంబు = భువనము; భ్రాంతంబు = భ్రాంతిలోపడినది; ఐ = అయ్యి; ఉన్నయది = ఉన్నది; ఇది = దీనిని గురించి; తెలియన్ = స్పష్టముగా తెలియునట్లు; ఆనతీయవలయున్ = చెప్పుము; అని = అని; అడిగినన్ = కోరగా; అతండు = అతడు; ఎఱింగించి = తెలియజేసి; చనియెన్ = వెళ్ళిపోయెను; మునియును = ముని; శివ = శివునిగురించి; పూజ = పూజలు; చేయుచు = చేస్తూ; హరి = శ్రీహరిని; స్మరణంబున్ = స్మరించుట; చేయ = చేయుట; మఱచి = మరచిపోయెను; శత = వంద (100); వర్షంబులు = సంవత్సరములు పాటు; ధారాధరంబులు = మేఘములు {ధారాధరములు - నీటిధారలను ధరించునవి, మేఘములు}; ధారా = ధారాపాతముగా; వర్షంబు = వర్షించుట; చేన్ = చేత; ధరాతలంబున్ = భూమండలమును; నింపన్ = నింపివేయగా; జలమయంబు = నీటితోనిండినది; ఐ = అయిపోయి; అంధకార = కారుచీకట్లతో; బంధురంబు = నిండినది; ఐనన్ = కాగా; అంతన్ = అంతట; ఆ = ఆ యొక్క; తిమిరంబునన్ = చిమ్మచీకటిలో; కన్నుకానక = కళ్ళుకనిపించక; భయంపడి = బెదిరిపోయి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు; ఆ = ఆ యొక్క; జల = నీటి; మధ్యంబునన్ = మధ్యలో; ఒక = ఒకానొక; వట = రావి; పత్రంబునన్ = ఆకుపైన; పద్మరాగ = పద్మరాగమణుల; కిరణ = ప్రభల; పుంజంబులన్ = సమూహములవలె; రంజిల్లు = ప్రకాశించెడి; పాద = పాదములు అనెడి; పద్మంబులు = పద్మములు; కల = కలిగిన; బాలునిన్ = బాలకుని; కని = చూసి, కనుగొని; మ్రొక్కి = నమస్కరించి; అతని = అతని; శరీరంబున్ = శరీరములో; ప్రవేశించి = దూరి; అనేక = చాలా; కాలంబు = కాలము; అనంతంబు = అనంతమైనది; అగు = ఐన; జఠర = కడుపు, ఉదరము; అంతరంబునన్ = లోపల; తిరిగి = సంచరించి; అతని = అతని; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మములను; సంస్మరణంబు = స్మరించుట; చేసి = చేసి; వెలువడి = బయటకి వచ్చి; కౌగలింపంబోయినన్ = కౌగలించుకోబోగా; మాయన్ = మాయను; కైకొని = చేపట్టి; అంతర్దానంబున్ = అదృశ్యగుట; ఒందన్ = చెందగా; మునియును = ముని; ఎప్పటియట్ల = ఎప్పట్లాగ; స్వా = తన యొక్క; ఆశ్రమంబున్ = ఆశ్రమమును; చేరి = చేరి; తపంబున్ = తపస్సును; చేయుచున్న = చేస్తున్న; సమయంబునన్ = సమయమునందు.

భావము:

అని మార్కండేయుడు స్తోత్రం చేసాడు. ఆ పిమ్మట, “నీ మాయ వలన ప్రపంచం భ్రాంతి పొంది ఉంది. దీనిని గూర్చి స్పష్టంగా నాకు తెలియజెప్పు” అని అడిగాడు. విష్ణువు తెలియజేసి వెళ్ళిపోయాడు. మార్కండేయుడు శివపూజ చేస్తూ, హరినామస్మరణ మరచిపోయాడు. నూరుసంవత్సరాల పాటు మేఘాలు విడవకుండా ధారాపాతంగా వర్షం కురిసి ధాత్రిని నింపివేశాయి. దానితో ధాత్రి జలమయం అవడమేకాక కారుచీకటిలో ములిగిపోయింది. ఆ చీకటిలో కళ్ళు కనిపించక భయపడి ఉన్న సమయంలో, ఆ నీటి మధ్య వటపత్రం మీద పద్మరాగమణి ప్రభలతో ప్రకాశించే పాదపద్మాలు కల ఒక బాలకుని చూసి నమస్కరించి ఆ బాలుని శరీరంలో దూరి చాలా కాలం అతని ఉదరంలోనే సంచరించాడు. అతని పాదపద్మాలను స్మరించుతూ బయటికి వచ్చి కౌగలించుకోబోగా అతను మాయాధారియై అదృశ్యుడయ్యాడు. ముని అంతకుముందు వలననే తన ఆశ్రమంలో ప్రవేశించి తపస్సు చేసుకుంటున్నాడు.

12-38-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిలిచిన శంకరుం గనియు, నిత్యసుఖంబుల నిచ్చు గౌరి యి
మ్ము "హర! భూతిభూషణసముజ్జ్వలగాత్రునిఁ గంటె, యెంతయున్
నుగ వానితోడ నొక వాటపుమాటను బల్కఁగాఁ దగున్
లితమైన యీ తపసి జాడ వినంగడు వేడ్క యయ్యెడిన్."

టీకా:

నిలిచిన = ఆగియున్న; శంకరున్ = శివుని; కనియున్ = చూసి; నిత్య = శాశ్వతమైన; సుఖంబులన్ = సుఖములను; ఇచ్చు = ప్రదాత్రి యైన; గౌరి = గౌరీదేవి {గౌరి - గౌరవర్ణంగలామె, పార్వతి}; ఇమ్ములన్ = యుక్తములుగ; హర = శివా; భూతి = విభూతి మాత్రమే; భూషణ = అలంకారముగా కలిగి; సముజ్జల = మిక్కిలి ప్రకాశవంతమైన; గాత్రునిన్ = శరీరము కలవానిని; కంటె = చూసితివా; ఎంతయున్ = మిక్కిలి; వలనుగ = ఒప్పిదముగ; వాని = అతని; తోడన్ = తోటి; ఒక = ఒకానొక; వాటపు = అనుకూలమైన; మాటను = పలుకు; పల్కగా = పలుకుట; తగున్ = బాగుంటుంది; సలలితము = మనోజ్ఞత్వము కలవాడు; ఐన = అగు; ఈ = ఈ; తపసి = తపస్వి; జాడ = విధానము; వినన్ = వినవలెనని; కడు = మిక్కిలి; వేడ్క = కుతూహలము; అయ్యెడిన్ = కలిగినది.

భావము:

ఆసమయంలో నిలిచి ఉన్న ఈశ్వరునితో శాశ్వత సుఖప్రదాత్రి, గౌరీదేవి, “హరా! విభూతి అలంకారించుకుని సముజ్జ్వలంగా విలసిల్లుతున్న శరీరం గల ఈ తపస్విని చూశావా? వానితో ఒక మంచి మాట పలకడం బాగుంటుంది ఈ తపసి విషయం తెలుసుకుందామని ఉంది?”

12-39-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన శంకరుండును శాంకరీసమేతుం డయి నభంబుననుండి ధరణీ తలంబునకు నేతెంచి యితరంబు గానక యేకాగ్రచిత్తుండగు నమ్మునిం గని తన దివ్యయోగమాయా ప్రభావంబుచేత నతని హృదయంబునం బ్రవేశించి చతుర్బాహుండును, విభూతి రుద్రాక్షమాలికాధరుండును, ద్రిశూల డమరుకాది దివ్యసాధన సమేతుండును, వృషభవాహ నారూఢుండును, నుమాసమేతుండునై తన స్వరూపంబు గనంబఱచిన విస్మయంబునొంది యమ్ముని యా పరమేశ్వరుని ననేక ప్రకారంబుల స్తుతియించిన, నప్పు డమ్ముని తపఃప్రభావంబునకు మెచ్చి “మహాత్మా! పరమశైవుండ” వని పరమేశ్వరుం డానతిచ్చిన మార్కండేయుండును శంకరు నిరీక్షించి, “దేవా! హరిమాయాప్రభావంబు దుర్లభం; బయ్యది భవత్సందర్శనంబునం గంటి; నింతియచాలు; నైన నొక్కవరంబు గోరెద; నారాయణచరణాంబుజ ధ్యానంబును, మృత్యుంజయంబునుం గలుగు నట్లు గాఁగృప సేయవే” యని ప్రార్థించినఁ గృపాసముద్రుండై “యట్లగాక” యని “జరారోగవికృతులు లేక కల్పకోటి పర్యంతంబు నాయువుం, బురుషోత్తముని యనుగ్రహంబుఁ గలుగు” నని యానతిచ్చి యమ్మహాదేవుం డతర్ధానంబు నొందె” నని చెప్పి యీ మార్కండేయోపాఖ్యానంబు వ్రాసిన వినినం జదివినను మృత్యువు దొలంగు నని మఱియు నిట్లనియె; హరి పరాయణుం డగు భాగవతుండు దేవతాతంర మంత్రాంతర సాధనాంతరంబులు వర్జించి, దుర్జనులం గూడక నిరంతరంబు నారాయణ గోవిందాది నామస్మరణంబు సేయుచునుండె నేని నట్టి పుణ్యపురుషుండు వైకుంఠంబున వసియించు; మఱియు హరి విశ్వరూపంబును జతుర్విధ వ్యూహభేదంబును, జతుర్మూర్తులును, లీలావతారంబులును జెప్ప నగోచరంబు" లనిన శౌనకుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; శంకరుండును = ఈశ్వరుడు {శంకరుడు - సుఖమును కలుగజేయువాడు, శివుడు}; శాంకరి = ఈశ్వరితో {శాంకరి - సుఖప్రదాయిత్రి, శంకరుని భార్య, పార్వతీదేవి}; సమేతుండు = కూడినవాడు; అయి = అయ్యి; నభంబు = ఆకాశము; నుండి = నుండి; ధరణీతలంబు = భూమండలమున; కున్ = కు; ఏతెంచి = వచ్చి; ఇతరంబు = మరిదేనిని; కానక = చూడకుండా; ఏకాగ్ర = ఏకాగ్రమైన; చిత్తుండు = మనసుకలవాడు; అగు = ఐన; ఆ = ఆ; మునిన్ = మునిని; కని = చూసి; తన = తన యొక్క; దివ్య = మహిమాన్వితమైన; యోగ = యోగము యొక్క; మాయా = మహిమ యొక్క; ప్రభావంబు = ప్రభావము; చేతన్ = తోటి; అతని = అతని; హృదయంబునన్ = హృదయములో; ప్రవేశించి = లోపలకెళ్ళి; చతుర్ = నాలుగు (4); బాహుండును = చేతులు కలవాడు; విభూతి = విభూతి; రుద్రాక్ష = రుద్రాక్షల; మాలికా = మాలలు; ధరుండును = ధరించినవాడు; త్రిశూల = త్రిశూలము; డమరుక = డమరుకము; ఆది = మున్నగు; దివ్య = దివ్యమైన; సాధన = సాధనములతో; సమేతుండును = కూడినవాడు; వృషభవాహన = వృషభవాహనము; ఆరూఢుండును = అధిరోహించినవాడు; ఉమా = పార్వతీదేవితో {ఉమ - తపస్సు చేయవలదని తల్లిచే నిషేధింపబడినామె, రక్షించునామె, పార్వతి}; సమేతుండును = కూడినవాడు; ఐ = అయ్యి; తన = తన యొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; కనంబఱచినన్ = చూపించగా; విస్మయంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; ఆ = ఆ; ముని = ముని; ఆ = ఆ; పరమేశ్వరునిన్ = పరమశివుని; అనేక = బహు; ప్రకారంబులన్ = విధములుగా; స్తుతియించినన్ = స్తోత్రములు చేయగా; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; ముని = ముని; తపః = తపస్సు యొక్క; ప్రభావంబున్ = మహిమ; కున్ = కు; మెచ్చి = పొగిడి; మహాత్మా = గొప్పఆత్మకలవాడా; పరమ = గొప్ప; శైవుండవు = శివభక్తుడవు; అని = అని; పరమేశ్వరుండు = శివుడు; ఆనతిచ్చినన్ = పలుకగా; మార్కండేయుండును = మార్కండేయుడు; శంకరుని = శివుని; నిరీక్షించి = చూసి; దేవా = భగవంతుడా; హరిమాయా = విష్ణుమాయ యొక్క; ప్రభావంబు = ప్రభావము; దుర్లభంబు = అందనిది; అయ్యది = అది; భవత్ = నీ యొక్క; సందర్శనంబునన్ = సాక్షాత్కారమువలన; కంటిన్ = తెలుసుకొనగలిగితిని; ఇంతియ = ఇది; చాలున్ = చాలును; ఐనన్ = అయినప్పటికి; ఒక్క = ఒకానొక; వరంబున్ = వరమును; కోరెదన్ = నిన్ను కోరుకొనెదను; నారాయణ = శ్రీహరి; చరణ = పాదములు అనెడి; అంబుజ = పద్మముల; ధ్యానంబును = ధ్యానము; మృత్యు = మరణముపై; జయంబునున్ = జయించగలుగుట; కలుగునట్లు = లభించునట్లు; కాగన్ = అగుటను; కృపసేయవే = ఇమ్ము; అని = అని; ప్రార్థించినన్ = ప్రార్థించగా; కృపాసముద్రుండు = దయాసాగరుడు; ఐ = అయ్యి; అట్ల = ఆ విధముగనే; కాకన్ = అగుగాక; అని = అని; జర = ముసలితనము; రోగ = జబ్బులు, రోగములు; వికృతులు = వికారములు; లేక = లేకుండ; కల్ప = కల్పములు; కోటి = కోటి; పర్యంతంబున్ = వరకు; ఆయువున్ = ఆయుష్షు; పురుషోత్తముని = శ్రీహరి; అనుగ్రహంబున్ = అనుగ్రహము; కలుగును = లభించును; అని = అని; ఆనతిచ్చి = వరప్రసాదమిచ్చి; ఆ = ఆ; మహాదేవుండు = శివుడు; అంతర్ధానంబున్ = అదృశ్యమగుటను; ఒందెను = పొందెను; అని = అని; చెప్పి = చెప్పి; ఈ = ఈ ప్రసిద్ధమైన; మార్కండేయోపాఖ్యానంబు = మార్కండేయోపాఖ్యానము; వ్రాసిన = రాసిన; వినినన్ = విన్నను; చదివినన్ = చదివిన; మృత్యువు = మరణము; తొలంగును = తొలగిపోతుంది; అని = అని; మఱియును = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; హరి = శ్రీహరి యందు; పరాయణుండు = భక్తికలవాడు; భాగవతుండు = భాగవతుడు; దేవతాంతర = ఇతరదేవతలను; మంత్రాంతర = ఇతరమంత్రములను; సాధనాంతరంబులు = ఇతరసాధనలను; వర్జించి = విడిచిపెట్టి; దుర్జనులన్ = దుష్టులను; కూడక = సహవాసంచేయకుండ; నిరంతరంబు = ఎల్లప్పుడు; నారాయణ = నారాయణ; గోవింద = గోవింద; ఆది = మున్నగు; నామ = నామములను; స్మరణంబు = స్మరించుట; చేయుచున్న = చేస్తూ; ఉండెనేని = ఉన్నట్లయితే; అట్టి = అటువంటి; పుణ్యపురుషుండు = పుణ్యపురుషుడు; వైకుంఠంబునన్ = వైకుంఠమునందు {వైకుంఠము - విష్ణులోకము}; వసియించున్ = నివసించును; మఱియున్ = ఇంకను; హరి = శ్రీహరి; విశ్వరూపంబును = విశ్వరూపమును; చతుర్విధవ్యూహ = చతుర్వ్యూహములు {చతుర్వ్యూహములు - 1వాసుదేవ 2ప్రద్యుమ్న 3అనిరుద్ధ 4సంకర్షణ అనెడి పరమేశ్వరుని రూపములు}; భేదంబునున్ = వివరములను; చతుర్ = నాలుగు (4) విధముల; మూర్తులును = రూపభేదములను; లీలావతారంబులును = లీలావతారములు; చెప్పన్ = తర్కించుటకు; అగోచరంబులు = సాధ్యముకానివి; అనినన్ = అనగా; శౌనకుండు = శౌనకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆమె మాట విని శివపార్వతులు ఆకాశం నుంచి భూమికి దిగారు. మార్కండేయుడు శివపార్వతుల రాక గమనించ నంత ఏకాగ్రమైన మనస్సుతో ఉండడంతో ఈశ్వరుడు తన దివ్యయోగ మాయతో అతని హృదయంలో ప్రవేశించాడు. నాలుగు చేతులు, విభూతి, రుద్రాక్షమాలికలు, త్రిశూలము. ఢమరుకం, మొదలైన దివ్య సాధనాలతో, పార్వతితో పాటుగా వృషభవాహనం అధిరోహించిన వానిగా దర్శనం ఇచ్చాడు.
అప్పుడు మార్కండేయుడు ఆశ్చర్యపోయి పరమేశ్వరుని అనేకవిధాలుగా స్తోత్రం చేసాడు. పరమశివుడు అతని తపస్సుకు సంతసించి “మహాత్మా! నీవు పరమశైవుడవు.” అని అన్నాడు. మార్కండేయుడు ఈశ్వరునితో “దేవా! విష్ణుదేవుని మాయా ప్రభావం తెలియుట దుర్లభము. కానీ నీ సందర్శనంచేత దానిని తెలుసుకోగలిగాను. ఇది చాలు అయినా ఒక వరం కోరుకుంటాను. శ్రీహరి పాదపద్మాలను ధ్యానించే బుద్ధి, మరణాన్ని జయించే శక్తి నాకు అనుగ్రహించు.” అని ప్రార్థించాడు. దయాసముద్రుడైన పరమశివుడు, “అలాగే అగు గాక.”అని అతను కోరిన వరం అనుగ్రహించి ఇలా అన్నాడు. “ముసలితనం రోగం మున్నగు వికారాలు లేకుండా, కోటి కల్పాల వరకూ ఆయుర్ధాయం, శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది.” అని వరం ఇచ్చి అదృశ్యం అయ్యాడు.
ఈ మార్కండేయోపాఖ్యానం వ్రాసినా, వినినా, చదివినా మరణం తొలగిపోతుంది. చిక్కటి హరిభక్తి కల భాగవతుడు ఇతర దేవతలను, ఇతర మంత్రాలను, ఇతర సాధనలను పూర్తిగా విడచి పెట్టాలి, దుష్టులతో స్నేహం చేయ రాదు. ఎల్లప్పుడూ నారాయణా, గోవిందాది నామస్మరణలు చేస్తుండాలి, ఆ విధంగా ఆచరించే పుణ్యాత్ముడు వైకుంఠం చేరుకుని అక్కడ నివసిస్తుంటాడు. విష్ణుదేవుని విశ్వరూపాన్నీ నాలుగు విధములయిన వ్యూహాభేదాల్ని, లీలావతారాలనీ, చతుర్వ్యూహ భేదాలు అనే నాలుగు మూర్తులను వర్ణించడం సాధ్యం కాదు.” అని సూతుడు చెప్పగా, శౌనకుడు ఇలా అన్నాడు.

12-40-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హరికథలు, హరిచరిత్రము,
రిలీలావర్తనములు నంచిత రీతిం
రువడి నెఱిఁగితి మంతయుఁ
సునుత! యనుమాన మొకటి సొప్పడెడి మదిన్.

టీకా:

హరి = విష్ణుదేవుని; కథలు = కథలు; హరి = విష్ణుదేవుని; చరిత్రము = చరితములు; హరి = విష్ణుదేవుని; లీలా = లీలలు; వర్తనములున్ = సంచారములు; అంచిత = చక్కటి; రీతిన్ = విధముగ; పరువడిన్ = క్రమబద్ధముగ; ఎఱిగితిమి = తెలుసుకొంటిమి; అంతయున్ = సమస్తమును; సురనుత = దేవతలచేకీర్తింపబడువాడా; అనుమానము = సందేహము; ఒకటి = ఒకానొకటి; చొప్పెడిని = కలిగినది; మదిన్ = మనసునందు.

భావము:

దేవసన్నుతా! సూతా! విష్ణుకథలు, విష్ణుమూర్తి చరిత్ర, విష్ణులీలలు చక్కగా సమగ్రంగా తెలుసుకున్నాం. అయినా నామనసులో ఒక సందేహం మిగిలిపోయింది