దశమ స్కంధము - ఉత్తర : మృత విప్రసుతులఁ దెచ్చుట
- ఉపకరణాలు:
బాలభానుప్రభా భాసమానద్యుతిఁ-
గరమొప్ప నిజ రథాంగంబుఁ బనుప
నమ్మహాస్త్రం బేగి చిమ్మచీఁకటి నెల్ల-
నఱిముఱి నందంద నఱికి వైచి
యగ్రభాగంబున నతులిత గతి నేగ-
నా మార్గమున నిజస్యందనంబు
గడువడిఁదోలి యా కడిఁదితమోభూమిఁ-
గడవ ముందఱకడఁ గానరాక
- ఉపకరణాలు:
మిక్కుటంబుగ దృష్టి మిర్మిట్లు గొనఁగఁ
జదల వెలుఁగొందు దివ్యతేజంబుఁ జూచి
మొనసి గాండీవి కన్నులు మూసికొనుచు
నాత్మ భయమంది కొంతద వ్వరిగి యరిగి.
టీకా:
బాలభాను = ఉదయకాలసూర్యుని; ప్రభా = ప్రకాశముతో; సమాన = సమానమైన; ద్యుతిన్ = కాంతితో; కరము = మిక్కిలి; ఒప్పన్ = చక్కగా; నిజ = తన; రథాంగంబున్ = చక్రాయుధమును; పనుపన్ = పంపగా, ప్రయోగించగా; ఆ = ఆ; మహా = గొప్ప; అస్త్రంబు = ఆయుధము; ఏగి = వెళ్ళి; చిమ్మ = కటిక; చీకటిన్ = చీకట్లను; ఎల్లన్ = అన్నిటిని; అఱిముఱిన్ = త్వరతో; అందంద = క్రమముగా; నఱికివైచి = ఖండించేసి; అగ్ర = ముందర; భాగంబునన్ = తట్టు; అతులిత = సాటిలేని; గతిన్ = వేగముగా; ఏగన్ = వెళ్తుండగా; ఆ = ఆ; మార్గమున్ = దారమ్మట; నిజ = తన; స్యందనంబున్ = రథము; కడు = మిక్కలి; వడిన్ = వేగముగా; తోలి = నడిపి; ఆ = ఆ; కడిది = అసాధ్యమైన; తమః = చీకటి; భూమిన్ = నేలను; కడవన్ = దాటగా; ముందఱ = ఎదుట; కడన్ = చివరభాగము; కానరాక = కనిపించనంత.
మిక్కుటంబుగన్ = అత్యధికముగ; దృష్టిన్ = చూపు; మిర్మిట్లుగొనగన్ = చెదురునట్లుగ; చదలన్ = ఆకాశమున; వెలుగొందన్ = కాంతివంతమగు; దివ్య = మహా; తేజంబున్ = తేజస్సును; చూచి = చూసి; మొనసి = మొగ్గి; గాండీవి = అర్జునుడు {గాండీవి - గాడీవము అను విల్లు కలవాడు, అర్జునుడు}; కన్నులున్ = కన్నులను; మూసికొనుచున్ = మూసుకొంటు; ఆత్మ = మనసునందు; భయమున్ = భయ; అంది = పడి; కొంత = కొంత; దవ్వు = దూరము; అరిగియరిగి = పోయుపోయి.
భావము:
బాలసూర్యుడి కాంతికి సాటివచ్చే కాంతితో వెలిగే తన చక్రాయుధాన్ని శ్రీకృష్ణుడు ప్రయోగించాడు. అది విజృంభించి చిమ్మచీకటిని తొలగిస్తూ పైనుండి ముందుకు దూసుకుని పోసాగింది. కృష్ణార్జునులు చక్రాయుధం వెళ్ళే మార్గం వెంట అమితివేగంగా రథాన్ని నడిపించుకుంటూ వెళ్ళి చీకటిని దాటారు. అప్పుడు వారి ముందు కన్నులు మిరుమిట్లు కొలిపే దివ్యతేజస్సు కనిపించింది. అర్జునుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు. అతని ఆ స్థితిలో కొంత దూరం వెళ్ళారు.