దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు
- ఉపకరణాలు:
సత్తైన ప్రకృతివలన నుత్పన్నంబైన యీజగత్తు సత్తు గావలయు; నది యెట్లనినం గనకోత్పన్నంబులైన భూషణంబులు కనకమయంబులయి కానంబడు చందంబున నని సాంఖ్యుండు వలికిన విని యద్వైతవాది యిట్లను; నెయ్యది యుత్పన్నంబు గాదది సత్తును గా; దను వ్యతిరేక వ్యాప్తి నియమంబు నిత్యసత్యంబైన బ్రహ్మంబునందుఁ దర్కహతంబగుం గావునం బ్రపంచంబు మిథ్య యని నిరూపించిననా ప్రపంచంబు బ్రహ్మవిశేషణంబై కార్యకారణావస్థలు గలిగియున్న యంతమాత్రంబున మిథ్యగానేర; దా ప్రపంచంబునకుఁ గార్యకారణావస్థలు నిత్యంబులు గావున నవస్థాద్వయ యుక్తంబయిన ప్రపంచంబు నిత్యంబనిన వెండియు నద్వైతి యిట్లను; బహుగ్రంథ ప్రతిపాదితం బయిన జగన్మిథ్యాత్వంబు లేమి యెట్లనిన నదియునుం గర్మవశులైన జడుల నవిద్యా ప్రతిపాదకం బైన కుతర్క సమేతం బైన భారతి యంధపరంపరా వ్యవహారంబునం జేసి భ్రమియింపఁజేయుఁ; గారణావస్థలయందును బ్రహ్మ విశేషణంబయిన సూక్ష్మరూపంబునం బ్రపంచంబు సత్తై యుండు; సత్యంబు బాధాయోగ్యంబు గావున నీకు శేషంబయి యుండుఁ గావున నీవు దేహగతుండైన దేహియందు నంతర్యామివయ్యుం గర్మఫలంబులం బొరయక కర్మఫలభోక్తయైన జీవునకు సాక్షిభూతంబవై యుందు; వట్టి నిన్ను నజ్ఞులైన మానవులు నిజకంఠ లగ్నంబయిన కంఠికామణి నిత్యసన్నిహితంబై వెలుంగుచుండినను గానకవర్తించు తెఱంగునఁ దమహృదయపద్మమధ్యంబున ననంతతేజోవిరాజమానుండవై ప్రకాశించు నిన్నుం దెలియలేరు; సకల బ్రహ్మాండనాయకుండవైన నీయందు శ్రుతులు ముఖ్య వృత్తిం బ్రవర్తించు"నని శ్రుత్యధిదేవతలు నారాయణు నభినందించిన తెఱంగున సనందనుండు మహర్షుల కెఱింగించిన ప్రకారం బని నారాయణర్షి నారదునకుం జెప్పిన నమ్మహాత్ముండు మజ్జనకుండైన వేదవ్యాసమునీంద్రునకు నుపన్యసించె; నయ్యర్థంబు నతండు నాకుం జెప్పిన విధంబున నీకుం జెప్పితి; నీ యుపాఖ్యానంబు సకల వేదశాస్త్ర పురాణేతిహాససారం; బుపనిషత్తుల్యంబు; దీనిం బఠించువారును వినువారును విగతకల్మషులై యిహపర సౌఖ్యంబుల నొంది వర్తింతు;” రని చెప్పిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె.
టీకా:
సత్తు = సత్, ఎప్పటికి చెడనిది; ఐన = అయిన; ప్రకృతి = మూలప్రకృతి; వలనన్ = వలన; ఉత్పన్నంబు = కలిగినది; ఐన = అయిన; ఈ = ఈ; జగత్తు = ప్రపంచము; సత్తుగా = సత్, ఎప్పటికి చెడనిది; కావలయున్ = అయ్యి ఉండవలెను; అది = అది; ఎట్లు = ఏవిధముగా; అనినన్ = అనగా; కనక = బంగారముచే; ఉత్పన్నంబులు = తయారైనవి; ఐన = అగు; భూషణంబులు = ఆభరణములు; కనక = బంగారము యొక్క; మయంబులు = స్వరూపములే; అయి = ఐ; కానంబడు = తెలియబడెడి; చందంబునన్ = విధముగా; అని = అని; సాంఖ్యుండు = సాంఖ్యకుడు; పలికినన్ = చెప్పుతుండగా; విని = విని; అధ్వైతవాది = అధ్వైత మతస్థుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అని చెప్పును; ఎయ్యది = ఏదైతే; ఉత్పన్నంబు = పుట్టక కలది; కాదో = కాదో; అది = అది; సత్తును = సత్, ఎప్పటికి చెడనిది; కాదు = కాదు; అను = అనెడి; వ్యతిరేక = విరుద్ధ; వ్యాప్తి = అన్వయము గల; నియమంబున్ = నియమము; నిత్య = శాశ్వతమైన; సత్యంబు = సత్యము; ఐన = అయినట్టి; బ్రహ్మంబు = పరమాత్మ; అందున్ = ఎడల; తర్క = ఏ తర్కము, ఏ వాదన; హతంబు = నిలబడనిది, పనిచేయనిది; అగున్ = ఐపోవును; కావునన్ = కాబట్టి; ప్రపంచంబు = ప్రపంచము; మిథ్య = భ్రాంతి, ఉన్నట్టు తోచునది; అని = అని; నిరూపించినన్ = నిర్ణయించగా; ఆ = ఆ యొక్క; ప్రపంచంబు = లోకము; బ్రహ్మ = పరబ్రహ్మమును; విశేషణంబు = తెలియబరచునది; ఐ = అయ్యి; కార్యకారణ = కార్య కారణ నియమంలోని {కార్యకారణనియమము - ప్రతి కార్యమునకు కారణము ప్రతి కారణమునకు కార్యము ఉంటుంది ఇది సృష్టి నియమము}; అవస్థలు = దశలు; కలిగి = కలిగి; ఉన్నన్ = ఉన్నప్పటికి; అంతమాత్రంబునన్ = అంతమాత్రముచేత; మిథ్య = అసత్తు; కానేరదు = కాకుండా పోలేదు; ప్రపంచంబున్ = ప్రపంచమున; కున్ = కు; కార్య = కార్యము {కార్యము - కలిగినది}; కారణ = కారణము అను {కారణము - కలిగించినది}; అవస్థలు = దశలు; నిత్యంబులు = శాశ్వతములు; కావునన్ = కాబట్టి; అవస్థా = దశలు; ద్వయ = జంటతో; యుక్తంబు = కూడినది; అయిన = ఐన; ప్రపంచంబు = జగత్తు; నిత్యంబున్ = శాశ్వతమైనది; అనినన్ = అనగా; వెండియున్ = ఇంకను; అద్వైతి = అద్వైతమతస్థుడు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అని చెప్పును; బహు = అనేకమైన; గ్రంథ = గ్రంథము లందు; ప్రతిపాదితంబులు = చెప్పబడినది; అయిన = ఐన; జగత్ = ప్రపంచము; మిథ్యత్వంబు = అసత్యము; లేమి = లేకుండుట; ఎట్లు = ఎలా కుదురుతుంది; అనినన్ = అని చెప్పగా; అదియునున్ = అదంతా; కర్మవశులు = కర్మలకు వశమైన వారు; ఐన = అగు; జడుల = మూఢులు యొక్క; అవిద్యా = అఙ్ఞానముచేత; ప్రతిపాదికంబు = చెప్పబడినది; ఐన = అయిన; కుతర్క = అసంబద్ధ తర్కముతో; సమేతంబు = కూడినది; ఐన = అయినట్టి; భారతి = వేదవాక్కు; అంధ = సరిగా చూడనట్టి; పరంపరా = వరుస వాదనల; వ్యవహారంబునన్ = వ్యవహారము; చేత = వలన; భ్రమియింపన్ = భ్రాంతి కలిగింపబడినదిగ; చేయు = చేసెడి; కారణ = కారణముల {కారణావస్థలు - అవ్యక్తమహదాదులు}; అవస్థల = దశలు; అందున్ = అందు; బ్రహ్మ = పరబ్రహ్మయొక్క; విశేషణంబు = విశేషణములు; అయిన = ఐనట్టి; సూక్ష్మ = సూక్ష్మమైన; రూపంబునన్ = రూపముతో; ప్రపంచంబున్ = జగత్తు; సత్తు = శాశ్వతమైనది; ఐ = అయ్యి; ఉండున్ = ఉంటుంది; సత్యంబు = సత్యము; బాధా = బాధచెందుటకు; అయోగ్యంబు = తగినది కాదు; కావునన్ = కాబట్టి; నీ = నీ; కున్ = కు; శేషంబు = శేషించినది; అయి = ఐ; ఉండున్ = ఉంటుంది; కావునన్ = కాబట్టి; నీవున్ = నీవు; దేహగతుండు = శరీరము నందుండు వాడు; ఐన = అయిన; దేహి = జీవుని; అందున్ = లోపల; అంతర్యామి = ఆత్మగా {అంతర్యామి - లోపలంతా వ్యాపించి ఉండు వాడు, ఆత్మ}; కర్మ = కర్మల యొక్క; ఫలంబులన్ = పర్యవసానములను; పొరయక = పొందకుండ; కర్మ = కర్మల యొక్క; ఫల = ఫలితములను; భోక్త = అనుభవించువాడు; ఐన = అయిన; జీవున్ = జీవుని; కున్ = కి; సాక్షిభూతంబవు = సాక్షి యైనవాడవు {సాక్షి - అంటకుండ కనుగొనువాడు}; ఐ = అయ్యి; ఉందువు = ఉంటావు; అట్టి = అటువంటి; నిన్నున్ = నిన్ను; అఙ్ఞులు = అఙ్ఞానులు; ఐన = అయిన; మానవులు = మనుషులు; నిజ = తన యొక్క; కంఠ = కంఠమున; లగ్నంబు = వేయబడి యున్నది; అయిన = ఐనట్టి; కంఠికామణిన్ = కంఠహారపు రత్నమును; నిత్య = ఎల్లప్పుడును; సన్నిహితంబు = సమీపముననే ఉండునది; ఐ = అయ్యి; వెలుంగుచుండినను = ప్రకాశించుచున్నను; కానక = కనుగొనలేక; వర్తించు = మెలగు; తెఱంగునన్ = విధముగా; తమ = తమ యొక్క; హృదయ = హృదయము అను; పద్మ = పద్మము; మధ్యంబునన్ = మధ్య బొడ్డు నందు; అనంత = అంతులేని; తేజస్ = తేజస్సుతో; విరాజమానుండు = విరాజిల్లుతున్నవాడవు; ఐ = అయ్యి; ప్రకాశించు = వెలిగిపోతుండెడి; నిన్నున్ = నిన్ను; తెలియలేరు = తెలిసికొనజాలరు; సకల = సమస్తమైన; బ్రహ్మాండ = బ్రహ్మాండములకు; నాయకుండవు = అధినాయకుడవు; ఐన = అయినట్టి; నీ = నీ; అందున్ = అందు; శ్రుతులు = వేదములు; ముఖ్య = ప్రథానకారణభూత; వృత్తిన్ = వృత్తి యందు; ప్రవర్తించును = వర్తించును; అని = అని; శ్రుతిఅధిదేవతలు = వేదాధిదేవతలు; నారాయణున్ = విష్ణుమూర్తిని; అభినందించిన = స్తుతించిన; తెఱంగునన్ = విధముగనే; సనందనుండు = సనందనదేవర్షి; మహ = గొప్ప; ఋషుల్ = మునుల; కున్ = కు; ఎఱింగించిన = తెలిపిన; ప్రకారంబు = విధము; అని = అని; నారాయణ = నారాయణుడు అను; ఋషి = ముని; నారదున్ = నారదున; కున్ = కు; చెప్పిన = చెప్పగా; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; మత్ = నా యొక్క; జనకుండు = తండ్రి; ఐన = అయిన; వేదవ్యాస = వేదవ్యాస; ముని = ఋషి; ఇంద్రున్ = ఉత్తమున; కున్ = కు; ఉపన్యసించెన్ = వివరించెను; ఆ = ఆ; అర్థంబునన్ = విషయమును; అతండు = అతను; నా = నా; కున్ = కు; చెప్పిన = చెప్పినట్టి; విధంబునన్ = విధముగా; నీ = నీ; కున్ = కు; చెప్పితిన్ = చెప్పాను; ఈ = ఈ యొక్క; ఉపాఖ్యానంబున్ = ఉపకథను; సకల = సమస్తమైన; వేద = వేదముల యొక్క; శాస్త్ర = ధర్మశాస్త్రముల యొక్క; పురాణ = పురాణముల యొక్క; ఇతిహాస = ఇతిహాసముల యొక్క; సారంబున్ = సారాంశము, అర్థము; ఉపనిషత్ = ఉపనిషత్తులతో; తుల్యంబు = సమానమైనది; దీనిన్ = దీనిని; పఠించు = చదువు; వారున్ = వారు; విను = వినెడి; వారునున్ = వారు; విగత = తొలగిన; కల్మషులు = పాపములు కలవారు; ఐ = అయ్యి; ఇహ = ఈ లొకపు; పర = పరలోకపు; సౌఖ్యంబులన్ = శుభములను; ఒంది = పొంది; వర్తింతురు = ఉంటారు; అని = అని; చెప్పిన = చెప్పినట్టి; శుక = శుకుడు అను; యోగి = ఋషి; ఇంద్రున్ = శ్రేష్ఠున; కున్ = కు; రాజ = రాజ; ఇంద్రుండు = ఉత్తముడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
సాంఖ్యులు “బంగారంతో చేసిన నగలు సర్వం బంగార మయములే కదా, అలాగే సత్యమైన ప్రకృతి నుండి జనించినది కావున ఈ జగత్తు సత్యమైనదే” అంటారు. అద్వైతవాది “స్వాయంభువమైన సర్వం సత్యం కానేరదు అనే వ్యతిరేక సిద్ధాంతం ప్రకారం, నిత్యసత్యమైన బ్రహ్మము నందు సకల జగత్తు ధర్మహతము అగును కావున ప్రపంచం మిథ్య మాత్రమే” అంటారు. ద్వైతులు “జగత్తు బ్రహ్మవిశేషణం అయి కార్యకారణ అవస్థలు కలిగి ఉన్నంత మాత్రం చేత మిథ్య అనలేము, కార్యకారణావస్థలు అనే అవస్థా ద్వయంతో కూడి ఉన్న లోకం సమస్తం సత్యమైనదే” అంటారు. అద్వైతసిద్ధాంతులు “ఎన్నో గ్రంథాలలో ప్రతిపాదించబడిన “జగన్మిథ్య” అనే సూత్రం తప్పు అని ఎలా అనగలము అంటే. కర్మవశులైన జడస్వభావులు చేసే అవిద్యా ప్రతిపాదికములు అయిన కుతర్కముల వలె గ్రుడ్డి పరంపరాగత వ్యవహారముల వలన భ్రమింప చేస్తున్నాయి. కారణావస్థ అందు బ్రహ్మమునకు విశేషణములై, సూక్ష రూపంలో జగత్తు సత్యమే అయి ఉంటుంది. అసత్తైన కారణంగా పరబ్రహ్మము అయిన నీకు శేషము అయి ఉంటుంది” అంటారు. కావున, సమస్త శరీరధారులలో అంతర్యామివై ఉండే నిన్ను కర్మఫలాలు సోకవు. కర్మఫలభోక్తలు అయిన జీవునకు సాక్షీభూతుడవై ఉంటావు. అజ్ఞానులు తమ కంఠమందు ప్రకాశించే రత్నాన్ని ఎలా తెలియలేరో అలా, తమ హృదయపద్మాల్లో మహాతేజంతో ప్రకాశించే నిన్ను తెలుసుకోలేరు. సకల బ్రహ్మాండానికి నాయకుడవైన నీలో వేదాలు వర్తిస్తుంటాయి. అని వేదాధిదేవతలు నారాయణుని స్తుతించిన ఈ విధం అంతా సనందనుడు మహర్షులకు తెలిపాడు. దానిని నారాయణముని నారదునికి చెప్పాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసునికి వివరించాడు. ఆ మహానుభావుడు నాకు చెప్పారు. ఆదే విధంగా దానిని నేను సవిస్తరంగా నీకు చెప్పాను. ఈ “శృతిగీతములు” అని ప్రసిద్ధము అయిన నారాయణోపాఖ్యానం సకల వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాల సారం. ఉపనిషత్తులకు సమానం. దీనిని పఠించినా విన్నా పాపాలు నశించిపోతాయి. ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి.” అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.