పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శ్రుతి గీతలు

  •  
  •  
  •  

10.2-1223-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! కర్మమూలంబు లయిన పాణి పాదంబులు లేనివాఁడవయ్యును స్వతంత్రుఁడవు గావున బ్రహ్మాదులు భవత్పరతంత్రులై యుండుదురు; స్థిర చర రూపంబులుగల చేతనకోటికి నీవు సర్వవిధనియంతవు; గావున నీ కృపావలోకనంబుగల వారికి మోక్షంబు కరస్థితంబై యుండు; భవత్కృపావలోకనంబు లేని దుష్టాత్ములు దుర్గతిం గూలుదు; రట్టి జీవులు దేవతిర్మఙ్మనుష్యస్థావ రాది శరీరంబులు సొచ్చి యణురూపులై యుందు; రందును నీ వంతరాత్మ వగుచు నుందువు; మఱియును.

టీకా:

దేవా = స్వామీ; కర్మ = కర్మములకు; మూలంబులు = సాధనములు; అయిన = ఐనట్టి; పాణిన్ = చేతులు; పాదంబులున్ = కాళ్ళు; లేని = లేనట్టి; వాడవు = వాడవు; అయ్యున్ = అయినప్పటికిని; స్వతంత్రుడవు = సర్వస్వతంత్రుడవు; కావునన్ = కాబట్టి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలగువారు; భవత్ = నీకు; పరతంత్రులు = ఆధీనులు; ఐ = అయ్యి; ఉండుదురు = ఉంటారు; స్థిర = స్థావర, అచర; చర = జంగమ, చర; రూపంబులున్ = రూపములు, దేహములు; కల = కలిగిన; చేతన = ప్రాణి; కోటి = సమస్తమునకు; కున్ = కు; నీవు = నీవు; సర్వవిధ = అన్ని రకములుగను; నియంతవు = నియమించువాడవు, నాయకుడవు; కావునన్ = కాబట్టి; నీ = నీ యొక్క; కృపా = దయతోడి; అవలోకనంబున్ = చూపులు; కల = పొందిన; వారిన్ = వారల; కిన్ = కు; మోక్షంబు = ముక్తి; కర = అరచేతిలో; స్థితంబు = ఉన్నది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; భవత్ = నీ యొక్క; కృపా = దయతోడి; అవలోకనంబున్ = చూపు; లేని = పొందలేని; దుష్టాత్ములు = దుష్టబుద్ధులు; దుర్గతిన్ = నరకము నందు; కూలుదురు = పడిపోవుదుర; అట్టి = అటువంటి; జీవులు = ప్రాణులు; దేవ = దేవతల; తిర్యక్ = జంతువుల; మనుష్య = మానవుల; స్థావర = వృక్షముల; ఆది = మున్నగువాని; శరీరంబులున్ = దేహములను; చొచ్చి = ప్రవేశించి; అణు = అణువులవంటి; రూపులు = స్వరూపములు కలవారు; ఐ = అయ్యి; ఉందురు = ఉండెదరు; అందునున్ = వాటిలో; నీవు = నీవు; అంతరాత్మ = లోపలలుండెడి ఆత్మవు; అగుచున్ = ఔతు; ఉందువు = ఉండెదవు; మఱియునున్ = ఇంతే కాకుండ.

భావము:

ఓ దేవాదిదేవా! పాణి పాదములు కర్మ మూలములు. అట్టివి లేని నిర్వికారుడవు సర్వస్వతంత్రుడవు అయిన నీకు బ్రహ్మాదులు వశులు అయి ఉంటారు. ఈ చరాచర ప్రపంచము సమస్తానికి నీవే ప్రభువవు, నియామకుడవు. కనుక నీ కృపాపాత్రులకు మోక్షం కరతలామలకము అవుతుంది. నీ దయకు పాత్రులు కాని దుష్టాత్ములు దుర్గతిపాలై బహువిధ దేవ, నర, జంతు, వృక్షాది శరీరాలు ధరిస్తూ అణురూపులు ఔతూ ఉంటారు. అలాంటివారిలోనూ అంతరాత్మవై నీవు ఉంటావు. అంతే కాకుండా......